సాక్షి, హైదరాబాద్: ఆస్తమా బాధితులకు అందించే మూలిక ఔషధం చేప మందు పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో శుక్రవారం ఉదయం నుంచి శనివారం వరకు జరగనున్న మందు పంపిణీకి 50వేల మందికి పైగా ఆస్తమా బాధితులు రానున్నట్లు అంచనా వేస్తున్నారు.
ఇందుకు అనుగుణంగా టోకెన్లు, చేపల పంపిణీ కౌంటర్లు ఏర్పాటు చేశారు. మందు పంపిణీ కోసం 1.32 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచారు. ఆస్తమా బాధితుల కోసం బత్తిన సోదరులు 175 ఏళ్లుగా చేప మందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు మందు కోసం తరలివస్తారు.
133 అదనపు బస్సులు
40 కేంద్రాల ద్వారా చేప మందు పంపిణీ కూపన్లు అందజేయనున్నారు. రెండు మొబైల్ కౌంటర్లు, మరో రెండు వీఐపీ కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్లు, నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లు, శంషాబాద్ అంతర్జాతీయ విమా నాశ్రయం సహా నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు ఆర్టీసీ అదనంగా 133 బస్సులు నడపనుంది.
అన్ని ప్రధాన కూడళ్లలో ఆర్టీసీ సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. బస్సులపై ‘ఫిష్ మెడిసిన్ స్పెషల్’అని తాత్కాలిక డెస్టినేషన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. భారీగా జనం తరలిరానున్న దృష్ట్యా 3 ప్రత్యేక వైద్య శిబిరాలు, 3 మొబైల్ వైద్య బృందాలను రంగంలోకి దించనున్నారు. 108, 104 వాహ నాలు సిద్ధంగా ఉంచారు. రూ.5 భోజన కేంద్రాలతోపాటు మంచి నీరు, పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
1,500 పోలీసులతో బందోబస్తు
సుమారు 1,500 మంది పోలీసులు, ఇద్దరు అదనపు డీసీపీ స్థాయి అధికారులు, 8 మంది ఏసీపీలు, 22 మంది సీఐలతో భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. అన్ని ప్రధాన కేంద్రాల్లో 70 సీసీ కెమెరాలతో నిఘా ఉంచా రు. 4 ఫైర్ ఇంజన్లు, మరో 4 మొబైల్ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లనూ అందుబాటులో ఉంచారు.
1,230 మంది పారిశుధ్య సిబ్బంది 2 రోజులు విధులు నిర్వహించనున్నారు. 100 టాయిలెట్లు, 100 మొబైల్ టాయిలెట్లు ఏర్పా టు చేశారు. 800 మంది వలంటీర్లు సేవలందించనున్నారు. హిందీ, ఉర్దూ, తెలుగు భాషల్లో సూచనలు చేసేందుకు యాంకర్లను నియమించారు. 3 లక్షల మంచినీటి ప్యాకెట్ల పంపిణీకి జలమండలి ఏర్పాట్లు చేసింది.
ఉబ్బస వ్యాధిగ్రస్తులకు నియమాలు
చేప ప్రసాదం తీసుకునే ఉబ్బస వ్యాధి గ్రస్తులు కొన్ని నియమాలు పాటించాలని బత్తిన సోదరులు సూచించారు. ప్రసాదం తీసుకునే ముందు 3 గంటలు, తీసుకున్న తరువాత గంటన్నర వరకు ఆహారం తీసుకోరాదు. ఇచ్చిన మందును 6 మాత్రలుగా చేసి నీడలో 7 రోజులు ఆరబెట్టాలి. వీటిని 3 పర్యాయాలుగా జూన్ 23, జూలై 8, 23 తేదీల్లో ఉదయం పరగడుపున ఒకటి, నిద్రబోయే మందు ఒకటి చొప్పున గోరు వెచ్చటి నీటితో వేసుకోవాలి.
అలాగే వ్యాధిగ్రస్తులు 45 రోజులు పత్యము ఉండాలి. పత్యము ఉండే రోగులు పాత బియ్యం, గోధుమలు, చక్కెర, మేక మాంసం, చామ కూర, పాలకూర, పులిచింత కూర, పొట్లకాయ, చామగడ్డ, మామిడి వరుగు, కోయికూర, అల్లము, ఎల్లిగడ్డ, పసుపు, కందిపప్పు, కరడి ఆయిల్, మిరియాలు, మినప్పప్పు, మిరపపొడి, ఉప్పు, నెయ్యి (ఆవు), మోసంబీలు, అంజీర్ పండ్లు, ఆవు పాలతో చేసిన టీ, తెల్ల జొన్నలు, ఇడ్లీ (చట్నీ లేకుండా), బ్రెడ్ మాత్రమే తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment