సాక్షి, హైదరాబాద్ : ఆస్తమా రోగులకు వచ్చే నెల 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జూన్ 8న సాయంత్రం 6 గంటల నుంచి 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు చేప ప్రసాద పంపిణీ చేపడతామన్నారు. మంగళవారం సచివాలయంలో చేప ప్రసాద పంపిణీ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె. జోషి, వివిధ శాఖల అధికారులతో తలసాని సమన్వయ సమావేశం నిర్వహిం చారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బత్తిని హరినాధ్‌గౌడ్ కుటుంబీకులు 173 ఏళ్ల నుంచి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారని గుర్తుచేశారు. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 3 లక్షల మందికిపైగా ప్రజలు వస్తారని, వారికి అవసరమైన చేప పిల్లలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని అదనంగా మంచినీరు, వైద్య సదుపాయాలు కల్పించడంతోపాటు ట్రాఫిక్, బ్యారికేడింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. అగ్నిమాపక నిరోధక వ్యవస్ధకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
జీహెచ్‌ఎంసీ ద్వారా పారిశుద్ధ్యం, మొబైల్ టాయిలెట్స్, అదనపు సిబ్బంది, రోడ్లకు రిపేర్లు, రూ. 5 భోజనం వసతి కల్పించాలని వివరించారు. మెట్రో వాటర్ వర్క్స్ ద్వారా మంచినీటి ప్యాకెట్లు, మంచినీటి సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా చేయాలన్నారు. ఆర్టీసీ ద్వారా వివిధ ప్రాంతాల నుంచి 150 బస్సులను నడుపుతున్నట్లు తలసాని తెలిపారు. పనుల పరిశీలనకు జూన్ 4న ఉదయం 11 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సమావేశం అవుతామన్నారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, ఫైర్ సర్వీసెస్ డీజీ గోపీకృష్ణ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మాణిక్‌రాజ్, ఫిషరీస్ కమిషనర్ సువర్ణ, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఆర్ అండ్ బీ ఈఎన్‌సీ గణపతిరెడ్డిలతోపాటు బత్తిని హరినాధ్‌గౌడ్ కుటుంబీకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment