Talasani Srivas Yadav
-
8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ
సాక్షి, హైదరాబాద్ : ఆస్తమా రోగులకు వచ్చే నెల 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జూన్ 8న సాయంత్రం 6 గంటల నుంచి 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు చేప ప్రసాద పంపిణీ చేపడతామన్నారు. మంగళవారం సచివాలయంలో చేప ప్రసాద పంపిణీ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె. జోషి, వివిధ శాఖల అధికారులతో తలసాని సమన్వయ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బత్తిని హరినాధ్‌గౌడ్ కుటుంబీకులు 173 ఏళ్ల నుంచి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారని గుర్తుచేశారు. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 3 లక్షల మందికిపైగా ప్రజలు వస్తారని, వారికి అవసరమైన చేప పిల్లలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని అదనంగా మంచినీరు, వైద్య సదుపాయాలు కల్పించడంతోపాటు ట్రాఫిక్, బ్యారికేడింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. అగ్నిమాపక నిరోధక వ్యవస్ధకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జీహెచ్ఎంసీ ద్వారా పారిశుద్ధ్యం, మొబైల్ టాయిలెట్స్, అదనపు సిబ్బంది, రోడ్లకు రిపేర్లు, రూ. 5 భోజనం వసతి కల్పించాలని వివరించారు. మెట్రో వాటర్ వర్క్స్ ద్వారా మంచినీటి ప్యాకెట్లు, మంచినీటి సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా చేయాలన్నారు. ఆర్టీసీ ద్వారా వివిధ ప్రాంతాల నుంచి 150 బస్సులను నడుపుతున్నట్లు తలసాని తెలిపారు. పనుల పరిశీలనకు జూన్ 4న ఉదయం 11 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సమావేశం అవుతామన్నారు. సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, ఫైర్ సర్వీసెస్ డీజీ గోపీకృష్ణ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మాణిక్‌రాజ్, ఫిషరీస్ కమిషనర్ సువర్ణ, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డిలతోపాటు బత్తిని హరినాధ్‌గౌడ్ కుటుంబీకులు పాల్గొన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కాళేశ్వరంతో మత్స్యకారులకు లబ్ధి: తలసాని
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుతో దాదాపు లక్ష మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుందని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, కన్నెపల్లి, ధర్మారం తదితర రిజర్వాయర్లను ఈనెల 23న సుమారు వెయ్యిమంది మత్స్యకారులతో కలసి సందర్శించనున్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మరింత విçస్తృతం చేస్తామన్నారు. గురువారం సచివాలయంలో పశుసంవర్థ్ధకశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణలతో జరిగిన అధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రి నేతృత్వంలో మత్స్యకారులు, గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీ లక్ష్మారెడ్డి, విజయ డెయిరీ ఎండీ నిర్మలతో కూడిన అధికారుల బృందం సందర్శించనుంది. -
బస్సు ఎక్కకుండా జారుకున్నారు!
టీడీపీకి తెలంగాణలో బస్సుయాత్ర కలిచొచ్చినట్టు కనబడడం లేదు. చంద్రబాబు బస్సుయాత్ర గురించి ప్రకటన చేసిన నాటి నుంచే 'సైకిల్' టైరుకు పంక్చర్ పడడం మొదలైంది. తెలుగు తమ్ముళ్లు బస్సు ఎక్కకుండానే జారుకుంటున్నారు. ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ గులాబీ చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో బాబుగారి బస్సుయాత్ర ఆదిలోనే జావగారిపోయింది. మొత్తానికి శుక్రవారం బస్సుయాత్ర బయలుదేరింది. ఇక్కడ కూడా సైకిల్ పార్టీకి ఉలికిపాటు తప్పలేదు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ధర్మారెడ్డి, ఆర్. కృష్ణయ్య... బస్సుయాత్రకు డుమ్మాకొట్టారు. బాబుగారి బస్సు ఎక్కకుండా జారుకున్నారు. మంచిరెడ్డి, కృష్ణయ్య కూడా సైకిల్ దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని గత కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు వచ్చాయి. మరికొంత మంది వరుసలో ఉన్నారంటూ టీఆర్ఎస్ నాయకులు చెబుతుండడంతో టీడీపీలో గుబులు రేపుతోంది. టీడీపీ శిబిరం పూర్తిగా ఖాళీ కావాలనే లక్ష్యంతో కేసీఆర్ పావులు కదుపుతున్నారని, త్వరలోనే మరికొందరు టీడీపీ సీనియర్లు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమన్న సమాచారం పచ్చ పార్టీని కుదిపేస్తోంది. తమ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరకుండా చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో టీడీపీ అధినేతకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అయితే బస్సుయాత్ర ప్రకటన చేసిన నాటి నుంచే తమ పార్టీకి అపశకునాలు ఎదురవుతుండడంతో తెలుగు తమ్ముళ్లు 'బాబోయ్ బస్సుయాత్ర' అంటున్నారు(ట).