
తీవ్రమైన ఒత్తిడి వల్ల ఆస్తమా వస్తుందా?
నేను ఒక మల్టీ నేషనల్ సంస్థలో పనిచేస్తున్నాను. నా మీద ఎప్పుడూ చాలా ఒత్తిళ్లు పనిచేస్తుంటాయి. ఈ ఒత్తిడి తీవ్రత ఎక్కువైనప్పుడల్లా ఆస్తమా రావడం గమనిస్తున్నాను. ఒత్తిడికీ, ఆస్తమాకూ సంబంధం ఉందా? దీన్ని తగ్గించుకోవడం ఎలా? – వి. సురేశ్, గచ్చిబౌలి
మన వాయునాళాలు వాపునకు (ఇన్‌ఫ్లమేషన్‌కు) గురైనప్పుడు సన్నబారిపోవడంతో శ్వాసతీసుకోవడం కష్టమయ్యే లక్షణాంతో ఆస్తమా కనిపిస్తుంది. ఈ లక్షణాలు కనిపించకుండా ఉండాలంటే ఆస్తమా వచ్చినప్పుడైతే తక్షణం వాయునాళాలను విస్తరింపజేసే మందులువాడాలి. అదే రాకముందైతే... ఆస్తమాను రాకుండా నివారించే ప్రివెంటివ్ మందులు వాడాలి.
ఒత్తిడికీ, ఆస్తమాకూ ఏదైనా సంబంధం ఉందా... అనే అంశం ఎప్పుడూ చర్చనీయాంశమే.
ఆస్తమా లేనివారిలో ఒత్తిడి అనేది కొత్తగా ఆస్తమానేమీ కలిగించదు. కానీ ఆస్తమా ఉన్నవారిలో మాత్రం.. వారి పరిస్థితిని ఒత్తిడి మరింత దిగజారుస్తుంది. తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొనేవారిలో ఆస్తమా అటాక్స్ చాలా తరచూ వస్తుంటాయి. మిగతావారితో పోలిస్తే మరింత ఎక్కువగానూ వస్తాయి. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ఆస్తమా లక్షణాలు కనిపించడాన్ని పరిశోధకులు చాలా సందర్భాల్లో నమోదు చేశారు.
ఉదాహరణకు పిల్లల్లోనైతే స్కూలు పరీక్షలు, ఎక్కడైనా నలుగురిలో మాట్లాడాల్సి రావడం, పెద్దల్లో కుటుంబంలో విభేదాలు, విపత్తులు, హింసకు గురికావడం వంటి సంఘటనల్లో ఒత్తిడి పెరిగితే అది ఆస్తమా ఉన్నవారి జీవితాన్ని మరింత దుర్భరం చేస్తుంది. మొదట ఒత్తిడి అనేది యాంగై్జటీని పెంచి అటాక్ వచ్చేందుకు అనువైన పరిస్థితులను కల్పిస్తుంది. అంటే ఆస్తమా అటాక్‌ను ప్రేరేపించే హిస్టమైన్, ల్యూకోట్రైన్ వంటి రసాయనాలను విడుదలయ్యేలా పరిస్థితులు నెలకొంటాయి. దాంతో వాయునాళాలు సన్నబారిపోతాయి. మిగతావారితో పోలిస్తే ఒత్తిడితో బాధపడేవారిలో ఆస్తమా ఉన్నప్పుడు పరిస్థితిని నియంత్రించడం ఒకింత కష్టమవుతుంది.
మరి ఒత్తిడినీ, ఆస్తమానూ అరికట్టడం ఎలాగంటే...
♦ మీకు ఒత్తిడి కలిగిస్తున్న అంశాలేవో మొదట తెలుసుకోండి. ఉదాహరణకు ఆర్థిక సమస్యలా, కుటుంబ సభ్యులతో విభేదాలా, జీవితంలో ఎవరూ సహాయసహకారాలు అందించకపోవడం, ఎప్పుడూ పనిలోనే ఉండాల్సి రావడం లేదా నిత్యం డెడ్‌లైన్స్‌తో సతమతమవుతుండటమా అని గుర్తించండి. ఒకసారి సమస్యను గుర్తించాక... దాన్ని ఎదుర్కోవడం మీతోనే సాధ్యమవుతుందా, లేదా ఎవరైనా వృత్తినిపుణుల సహాయం అవసరమా అని తెలుసుకొని, ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించండి.
♦ అన్ని పనులూ మీరే పూర్తి చేయాలని అనుకోకండి. పనుల జాబితా రూపొందించి, ఎవరు చేయదగ్గపనుల్ని వారికి అప్పగించండి. ఉదాహరణకు డెడ్‌లైన్ అనేది మీ ఒక్కరికే కాదు.. మీ బృందంలో పనిచేస్తున్నవారందరికీ వర్తిస్తుందనీ, అందరికోసం అందరమూ పనిచేయాలంటూ స్పష్టంగా చెప్పి, పనులను పంచండి. ఇలా వర్క్‌ప్లేస్ స్ట్రాటజీలను అమలు చేసుకోండి.
♦ మీకు అలసట కలిగించని వ్యాయామాన్ని నిత్యం చేయండి.
♦ కంటినిండా హాయిగా నిద్రపోండి.
♦ శ్వాసవ్యాయామాలు (బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్), ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ విధానాల వంటివి పాటించండి. యోగా, ధ్యానం వంటివీ ప్రాక్టీస్ చేయండి.
♦ అటాక్ వచ్చినప్పుడు వాడే మందులు, అటాక్ రాకుండా నివారించే మందులు ఎప్పుడూ దగ్గర ఉంచుకోండి.
♦ ఒత్తిడితో కూడిన అటాక్ వచ్చినప్పుడు 5 – 10 నిమిషాల్లో మీరు నార్మల్ స్థితికి రాకపోతే 15వ నిమిషం తర్వాత తప్పక వైద్యుల సహాయం తీసుకోండి.
గర్భవతికి ఆస్తమా ఉంటే..?
మా అమ్మాయి ప్రస్తుతం మూడు నెలల గర్భిణి. ఆమెకు ఆస్తమా ఉంది. ఆమె తన ఆస్తమాను నియంత్రణలో ఉంచుకోవడం ఎలా? ఈ గర్భధారణ సమయంలో ఆమె తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. – కె. రామలక్ష్మి, ఒంగోలు
గర్భవతిగా ఉన్న సమయంలో ఆస్తమాను నియంత్రణలో ఉంచుకోవడం అన్నది కాబోయే తల్లికీ, కడుపులోని బిడ్డకూ చాలా అవసరం. ఇప్పుడు గర్భవతిగా ఉన్న సమయంలోనూ ఆస్తమాను నియంత్రణలో ఉంచే మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. గర్భంతో ఉన్న సమయంలో అటాక్ రాకుండా ఉండేలా మందులు వాడటం / వచ్చినప్పుడూ వాడటంతో పాటు... ఆ మందుల దుష్ప్రభావాలు గర్భంలోని పిండం మీద పడకుండా చూసుకోవడం... అన్న సమన్వయాన్ని పాటించడం చాలా ముఖ్యం.
ఆస్తమా ఉన్న మహిళలు గర్భవతులుగా ఉన్నప్పుడు దాదాపు 20 శాతం మందిలో ఆయాసం వచ్చి, దాన్ని తగ్గించే మందులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మరో 6 శాతం మందిలో హాస్పిటల్‌లో చేర్చి, చికిత్స అందించాల్సిన పరిస్థితులు ఉంటాయి. అందుకే గర్భవతిగా ఉన్న సమయంలో ఆస్తమా సమస్య ఉన్నవారు, దాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం.
ఎందుకంటే ఒకవేళ ఆస్తమా అదుపులో లేకపోతే అకస్మాత్తుగా రక్తపోటు చాలా ఎక్కువగా పెరగడం (ప్రీ–అక్లాంప్సియా), నెలల పూర్తిగా నిండకముందే ప్రసవం కావడం (ప్రీ–టర్మ్ బేబీ), పుట్టిన బిడ్డ చాలా తక్కువ బరువుతో ఉండటం లేదా మృతశిశువు జన్మించడం వంటి అనర్థాలు సంభవించవచ్చు. అందువల్ల గర్భిణుల్లో ఆస్తమాను అదుపులో ఉంచుకోవడం చాలా ప్రధానం.
ఎందుకంటే పుట్టబోయే బిడ్డకు ఎంత ఎక్కువగా ఆక్సిజన్ సరఫరా ఉంటే, పుట్టాక ఆ బిడ్డ మానసిక, శారీరక వికాసాలు అంత బాగుంటాయి. బిడ్డ జీవన నాణ్యతకూడా బాగా ఉంటుంది. సాధారణంగా ఆస్తమా అటాక్ వచ్చినప్పుడు ఇచ్చే మందులు... గర్భవతులకైనా, సాధారణ మహిళలకైనా దాదాపుగా ఒకేలా ఉంటాయి.
గర్భవతులైన ఆస్తమా సమస్య ఉన్న మహిళలకు కొన్ని సూచనలు...
♦ గర్భవతులైన మహిళల్లో ప్రతి 4 లేదా 6 వారాలకు ఒకసారి వారి శ్వాస తీసుకునే తీరు ఎలా ఉందో పరీక్షించేందుకు పీక్ ఎక్స్‌పిరేటరీ ఫ్లో పరీక్ష చేయిస్తూ ఉండటం మంచిది. ఆస్తమా అటాక్ రాకుండా ఉండేందుకు వాడే ప్రివెంటార్ ఇన్‌హేలర్స్ తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి. అవి పిండంపై ఎలాంటి దుష్ప్రభావాలు చూపవనే అంశాన్ని గుర్తెరిగి, వాటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి.
♦ గర్భతుల్లో అటాక్ వచ్చి ఆక్సిజన్ తీసుకునే సామర్థ్యం తగ్గితే... పిండానికీ ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. అది ఎంతమాత్రమూ సరికాదు. అందుకే ఏ చిన్న అటాక్ లక్షణాలు కనిపించినా వెంటనే ఆ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోవాలి. అప్పుడు వెంటనే హాస్పిటల్‌కు రావడం మంచిది.
♦ ఆస్తమాను ప్రేరేపించే అంశాలు (ట్రిగర్ ఫ్యాక్టర్స్)కు దూరంగా ఉండాలి. తమకు సరిపడని వాటిని గుర్తించి, గర్భవతిగా ఉన్న సమయంలో వాటి దరిదాపుల్లోకి కూడా వెళ్లకుండా ఉండాలి.
ఇక ప్రసవం విషయానికి వస్తే...
చాలా తీవ్రమైన ఆస్తమా ఉన్నవారిని మినహాయించి మిగతా వారందరిలోనూ దాదాపుగా ప్రసవం సాధారణంగానే అవుతుంది. ప్రసవ సమయంలో ఆస్తమా రావడం చాలా చాలా అసాధారణం కాబట్టి దాని గురించి దిగులు పడాల్సిన అవసరం దాదాపుగా ఉండదు.
- డాక్టర్ రమణ ప్రసాద్, కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
Comments
Please login to add a commentAdd a comment