నెలసరి నొప్పికి గృహవైద్యం ఉంది... | The monthly healing the pain of the housing | Sakshi
Sakshi News home page

నెలసరి నొప్పికి గృహవైద్యం ఉంది...

Published Wed, Jan 20 2016 11:39 PM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM

నెలసరి నొప్పికి గృహవైద్యం ఉంది...

నెలసరి నొప్పికి గృహవైద్యం ఉంది...

హోమియో కౌన్సెలింగ్
 
నా వయసు 40 సంవత్సరాలు. ఈ మధ్య ఆయాసం వస్తుంటే డాక్టర్ దగ్గరకు వెళ్లాను. ఆస్తమా అన్నారు. ఆస్తమా అంటే ఏమిటి? దీనికి హోమియోపతిలో ఎటువంటి చికిత్సా విధానం ఉంది తెలుపగలరు?
 - దేవరాయలు, అనంతపురం

 
1. ఆస్తమా అంటే ఏమిటి?

 దీర్ఘకాలిక శ్వాసకోశ ఇబ్బందిని ఆస్తమా అంటారు  ఊపిరితిత్తులలో గాలి మార్గానికి అడ్డంకులు ఏర్పడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది  శ్వాసకోశ మార్గంలో వాపు, శ్వాసకోశ మార్గం కుంచించుకుపోవడం వల్ల ఆస్తమా వస్తుంది.
 
2. ఆస్తమాకు కారణాలు ఏంటి?

  చల్లటి వాతావరణం  దుమ్ము, ధూళి, పొగ  ఫంగస్, వాతావరణ కాలుష్యం  వైరల్ ఇన్‌ఫెక్షన్స్  శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్స్  పెంపుడు జంతువులు  రసాయనాలు, ఘాటు వాసనలు
 
3. ఆస్తమా ఎలా వస్తుంది?
 ఆస్తమా వ్యాధి అలర్జీకి సంబంధించినది. కొంతమందిలో ఇది వంశపారంపర్యంగా కూడా సంక్రమించవచ్చు. దీనినే ఎటోపీ అంటారు  కొంత మందిలో వ్యాధి నిరోధక శక్తి కలిగించే యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయి. శరీరానికి సరిపడని యాంటీజెన్‌లు శరీరంలోకి ప్రవేశించినపుడు ఈ యాంటీబాడీ వెలువడి శరీరాన్ని రక్షించే ప్రయత్నం చేస్తాయి. ఈ క్రమంలో కణాల నుండి వెలువడే రసాయనాల వల్ల శ్వాసనాళాల్లో శ్లేష్మం జమ అవుతుంది. తద్వారా శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది.
 
4. ఆస్తమాలో కనిపించే లక్షణాలు ఏమిటి?
 ఎడతెరిపి లేని దగ్గు  పిల్లి కూతలు  ఆయాసం  జ్వరం  జలుబు  శ్వాస తీసుకోలేకపోవడం  మానసిక ఆందోళన
 
5. ఆస్తమా నిర్ధారణ పరీక్షలు
 వంశానుగత చరిత్ర  అలర్జీకి సంబంధించిన పరీక్షలు  ముక్కు, గొంతు, ఛాతీ పరీక్షలు  కఫం పరీక్ష  చర్మానికి సంబంధించిన అలర్జీ పరీక్షలు  స్పైరోమెట్రీ  ఛాతీ ఎక్స్‌రే
 
6. ఆస్తమాకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?
ప్రతిరోజూ వ్యాయామం చేయడం  పోషకాహారం తీసుకోవడం  ఎక్కువ శారీరక శ్రమ లేకుండా చూసుకోవడం  మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం  దుమ్ము, ధూళి, పొగ, కాలుష్యానికి దూరంగా ఉండటంచల్లని వాతావరణానికి తిరగకుండా ఉండటం  పడని పదార్థాలకు దూరంగా ఉండటం
 
డాక్టర్ ఎ.ఎం. రెడ్డి
సీనియర్ డాక్టర్
పాజిటివ్ హోమియోపతి
హైదరాబాద్
 
ఆయుర్వేద కౌన్సెలింగ్
 
నా వయసు 35. ఇద్దరు పిల్లలు. ఇటీవల పొట్టలో నొప్పిగానూ, కొంచెం గట్టిగానూ ఉంటే, స్త్రీవైద్య నిపుణులను సంప్రదించాను. పరీక్షలన్నీ చేసి గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని, హిస్టెరెక్టమీ ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఇవి తగ్గడానికి, ఆపరేషన్ లేకుండా, ఆయుర్వేదంలో మందులుంటే సూచించండి.
 - కె. శ్యామల, వనస్థలిపురం

 మీరు ప్రస్తావించిన ‘ఫైబ్రాయిడ్స్’ను ఆయుర్వేద పరిభాషలో ‘గ్రంథి లేక అర్బుదము’ అంటారు. ఇలాంటివి గర్భాశయంలో కూడా సంభవించవచ్చు. వాటి పరిమాణాన్ని బట్టి, లక్షణాలు మారుతుంటాయి. కంతి సైజు పెద్దదిగా లేకపోతే, ఇతర సమస్యలు లేకపోతే ఆపరేషన్ అక్కర్లేకుండా దీన్ని తగ్గించడానికి చక్కటి ఆయుర్వేద మందులు ఉన్నాయి. వాటిని మీ ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో ఒక ఆరునెలల పాటు వాడితే ఈ వ్యాధి గణనీయంగా తగ్గిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ మందుల వివరాలు...
 1. కైశోర గుగ్గులు (మాత్రలు):  ఉ॥2, రాత్రి 2
 2. కాంచనార గుగ్గులు (మాత్రలు): ఉ॥2, రాత్రి 2
 3. శతావరీ లేహ్యం: ఉ॥1 చెంచా, రాత్రి 1 చెంచా
 4. అశోకారిష్ట (ద్రావకం):  నాలుగు చెంచాల మందుకి సమానంగా నీళ్లు కలిపి (ఒక మోతాదు) రెండు పూటలా తాగాలి. అధిక రక్తస్రావం తగ్గడానికి... ‘బోలబద్ధరస’ మాత్రలు రెండేసి చొప్పున, రోజుకి మూడు సార్ల వరకు వాడవచ్చు. ఇవి ఒక వారం రోజుల వరకు వాడవచ్చు.
 
మా అమ్మాయి వయసు 15 ఏళ్లు. నాలుగేళ్ల క్రితమే రజస్వల అయ్యింది. నెలసరి సమయంలో విపరీతమైన కడుపునొప్పి వస్తోంది. ఆయుర్వేదంలో పరిష్కారం తెలపండి.
 - ఎస్. మేరీ, హనమకొండ

 ఇది చాలామందిలో కనిపించే సాధారణ సమస్య. ఈ వికారాన్ని ఆయుర్వేదంలో ‘కష్టార్తవ లేక ఉదావర్తం’గా వివరించారు. వివాహం తర్వాత, కాన్పు తర్వాత చాలావరకు ఈ సమస్య దానంతట అదే తగ్గిపోవచ్చు. కానీ చాలామంది కన్యలు ఈ లక్షణంతో విలవిలలాడుతుంటారు. ఈ కింద సూచించిన మందులు, రుతుస్రావం అయ్యే తేదీకి రెండు రోజుల ముందు నుంచి మొదలుపెట్టి రక్తస్రావం తగ్గేవరకు వాడండి. తప్పక ఉపశమనం కలుగుతుంది.

1. హింగు త్రిగుణతైలం: దీన్ని ఒక చెంచా గోరువెచ్చని నీటితో కలిపి ఉదయం పరగడుపున ఒకసారి, రాత్రి పడుకునే ముందు ఒకసారి తాగాలి; 2. అశోకారిష్ట (ద్రావకం): 3 చెంచాల మందుకి సమానంగా నీళ్లు కలిపి, రోజూ మూడు పూటలా తాగాలి. గృహవైద్యం: నాలుగు వెల్లుల్లి రేకల్ని దంచి, దానికి మూడు చిటికెలు ఇంగువ కల్పి, రెండు చెంచాల స్వచ్ఛమైన నువ్వులనూనెలో మరిగించి, వడగట్టాలి. ఇది ఒక మోతాదుగా - 3 చెంచాల పాలు కలిపి, ఉదయం, రాత్రి రెండుపూటలా తాగాలి.
 
డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
ఆయుర్వేద నిపుణులు
సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్
హుమాయూన్‌నగర్
హైదరాబాద్
 
బ్లడ్‌ప్రషర్ కౌన్సెలింగ్
 
ఒకసారి నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన నాకు మామూలు బీపీ చూడడంతో పాటు ‘సెంట్రల్ బ్లడ్ ప్రెషర్’ కూడా చూశారు. ఈమాట వినడమే కొత్త! సెంట్రల్ బ్లడ్ ప్రెషర్ అంటే ఏమిటి? దీనికీ, మామూలుగా కొలిచే బ్లడ్ ప్రెషర్‌కూ తేడా ఏమిటి?
 - సుహాసిని, చెన్నై

సాధారణంగా మనం బ్లడ్ ప్రెషర్‌ను బీపీ ఆపరేటస్‌తో కొలుస్తుంటాం. ఇందులో ఒక పట్టాలాంటి దాన్ని చేతికి కట్టులా కట్టి, దాన్ని గాలితో నింపి, బిగిసేలా చేసి, రక్తనాళాల్లో ప్రవహించే రక్తపు వేగాన్ని కొలుస్తాం. దీన్నే బీపీ అంటారు. కాని రక్తపోటును గుండె దగ్గరే కొలిస్తే ఆ విలువ సరైనది అని వైద్య నిపుణులు అభిప్రాయం. నేరుగా గుండె స్పందించినప్పుడు అక్కడి రక్తనాళాల్లో రక్తపీడనాన్ని కొలవడాన్ని ‘సెంట్రల్ బ్లడ్ ప్రెషర్’ అంటారు.  ఇటీవల ఈ విధమైన సెంట్రల్ బ్లడ్‌ప్రెషర్‌ను కొలవడానికి ఒక పెన్ వంటి సాధనాన్ని రూపొందించారు. దీని కొనను మణికట్టు (రిస్ట్) వద్ద ఉండే నాడి దగ్గర మృదువుగా ఆనించి, ఆ వచ్చిన కొలతలను కంప్యూటర్‌కు అనుసంధానిస్తారు. ఆ ‘పల్స్ వేవ్’ విలువలను కంప్యూటర్ గణించి, నేరుగా గుండెదగ్గరి రక ్తనాళాల్లో రక్తపోటు ఎంత ఉందో లెక్కలు వేస్తుంది. దీని ఆధారంగా మనం గుండెదగ్గరి రక్తపోటును తెలుసుకుంటామన్నమాట.

ఇలా నేరుగా గుండెదగ్గర అది స్పందించినప్పుడు రక్తం తొలుత గురైన పీడనాన్నీ అంటే సెంట్రల్ బ్లడ్ ప్రెషర్‌నూ, సాధారణంగా చేతి దగ్గర పట్టా చుట్టి, అందులో గాలి నింపి తీసుకునే సాధారణ బ్లడ్ ప్రషర్‌నూ తెలుసుకుంటూ ఇంకా ఈ విలువలను సరిపోల్చి చూస్తున్నారు. మామూలుగా చేతి దగ్గర తీసే బ్లడ్‌ప్రెషర్‌ను కొన్ని కోట్లమందిలో అనేకసార్లు గణించి సాధారణ రక్తపోటు ప్రమాణాన్ని ‘120/80’గా నిర్ణయించాం. కానీ సెంట్రల్ బ్లడ్‌ప్రెషర్‌తో తీసే విలువలకు ఇంకా నిర్ణీత ప్రమాణాలను రూపొందించలేదు. ఎందుకంటే మన రక్తపోటు క్షణక్షణానికీ మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఒక స్థిరమైన నార్మల్ విలువ వచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ఇంకా దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. త్వరలోనే సెంట్రల్ బ్లడ్ ప్రెషర్‌కూ ‘ప్రమాణాలను’ రూపొందిస్తే అప్పుడు మామూలు బ్లడ్‌ప్రెషర్ స్థానాన్ని ఆధునికంగా తీసే సెంట్రల్ బ్లడ్ ప్రెషర్ విలువలు ఆక్రమించడం జరుగుతుందని ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ల అంచనా.
 
డాక్టర్ సుధీంద్ర ఊటూరి
కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్
రీహ్యాబిలిటేషన్
కిమ్స్ హాస్పిటల్స్
సికింద్రాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement