
ఒకే మోతాదుతో ఉబ్బసం తగ్గదు
ఆయుర్వేద కౌన్సెలింగ్
కొన్ని వనమూలికలతో చేసిన మందును ఒక మోతాదులో తీసుకుంటే ఆస్తమా (ఉబ్బసవ్యాధి) పూర్తిగా తగ్గుతుందని కొంతమంది చెబుతున్నారు. అది సాధ్యమేనా? - ఎ. పార్వతీశం, హైదరాబాద్
వాడుక భాషలో ఉబ్బసం అని పిలిచే ఈ వ్యాధిని ఆయుర్వేద శాస్త్రం ‘తమక శ్వాస’ అనే పేరుతో వివరించింది. ఆధునికంగా ‘బ్రాంకియల్ ఆస్తమా’ అని వ్యవహరిస్తారు. ఇది శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధి. వాయునాళాలు మూసుకుపోవడం వల్ల శ్వాస విడవడం క్లిష్టంగా మారుతుంది. వాయునాళాల్లో కఫం కూడా పేరుకుపోతే దాన్ని తొలగించడం కోసం దగ్గు కూడా తోడై పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. దీని తీవ్రతను బట్టి జ్వరం, మూర్ఛ కూడా సంభవించవచ్చు.
కారణాలు: 1. అసాత్మ్యాకర పదార్థాలు (అలర్జీ కలిగించేవి) : వాతావరణంలోని దుమ్ము, ధూళి, చల్లని మేఘావృత వాతావరణం, అధిక తేమ, పువ్వులలోంచి వచ్చే పుప్పొడి రేణువులు; బొగ్గు, సిమెంటు వంటి కొన్ని రసాయన ద్రవ్యాలు, కొన్ని తినుబండారాలు :ఉదాహరణకు కొన్ని నూనెలు, రంగులు, వాసనలు, నూనె మరుగుతున్నప్పుడు వెలువడే పొగ 2. వారసత్వం కూడా సంక్రమించవచ్చు 3. మానసిక ఒత్తిడి: భయం, ఆందోళన, అభద్రతాభావం, చింత, శోకం వంటి వ్యతిరేక ఉద్వేగాలు.
చికిత్స: ఈ వ్యాధి ప్రధానంగా కఫం, వాతం ప్రకోపించి కలుగుతుంది. కాబట్టి ఛాతీకి, చెవులకు, శిరస్సుకు వెచ్చదనం సమకూర్చుకోవాలి. శీతల వాతావరణానికి దూరంగా ఉండాలి. పైన వివరించిన అసాత్మ్యకర భావాలు స్పష్టంగా తెలిస్తే, వాటిని దూరం చేయాలి. మానసిక ఒత్తిడి లేకుండా జాగ్రత్త వహించాలి. అసలిపోయేంత శారీరక శ్రమ చేయకూడదు. అన్ని జాగ్రత్తలు వహిస్తూ వేడివేడి టీ వంటి పానీయాలు, తేలికగా జీర్ణమయ్యే జావులు సేవిస్తే ఆయాసపు తీవ్రత మూడు, నాలుగు రోజుల్లో తగ్గిపోయి, ఆరోగ్య స్థితి సమకూరుతుంది.
ఔషధాలు: ఆయాసంగా ఉన్న సమయంలో 1. కనకాసవ, పిప్పలాసవ ద్రావకాలను రెండేసి చెంచాలు ఒక గ్లాసులో కలిపి, నాల్గుచెంచాలు గోరువెచ్చని నీళ్లు కూడా కలిపి మూడు పూటలా తాగాలి. 2. శ్వాసకుఠారరస మాత్రలు : ఉదయం ఒకటి, రాత్రి ఒకటి తీసుకోవాలి.
ఆయాసం తగ్గిపోయిన తర్వాత శ్వాసకోశానికి బలం కలిగించేవి, తత్సంబంధిత ‘రోగ నిరోధక శక్తి’ని పెంపొందించే మందులను ఆరు నెలల పాటు వాడాలి.
ఉదాహరణకు అగస్త్య హరీతకీ రసాయనం (లేహ్యం): ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా చప్పరించి పాలు తాగాలి. ఆమలకీ (ఉసిరికాయ) రసాన్ని ఒక చెంచా తేనెతో రోజూ తీసుకుంటే (ఎంతకాలమైనా తీసుకోవచ్చు) ఉబ్బసంతో పాటు ఎన్నో రకాల వ్యాధులు దరిచేరవు. రోజుకు రెండుపూటలా ఖాళీకడుపున ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులకు అమోఘమైన శక్తి పెరిగి ఎన్నో రకాల అలర్జీలనుంచి నివారణ కలుగుతుంది.
వ్యాధి స్వభావం: చిన్నప్పుడు ఒకసారిగానీ, పలుమార్లు గానీ వచ్చి ఇంకెప్పుడూ జీవితంలో తిరగబెట్టదు. దీన్ని ‘పాల ఉబ్బసం’ అంటారు. చిన్నప్పుడు రాకపోవచ్చు. ఏ వయసు వారికైనా రావచ్చు. ఈ ఆయాసం ఎన్ని రోజులకొకసారి తిరగబెడుతుందన్నది ఇదమిత్థంగా చెప్పలేం. కొంతమందిలో దగ్గరదగ్గర విరామాల్లో రావచ్చు. కొంతమందిలో నెలలు లేక సంవత్సరాల విరామంలో రావచ్చు. ఇది వ్యాధికారణం, పరసరాల ప్రభావం, వ్యక్తి ప్రకృతి, తన పాటించే పథ్యాపథ్యాలు, వృత్తి మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. కొంతమందిలో కేవలం వార్థక్యలో సంభవించివచ్చు.
సాధ్యాసాధ్యత: ఈ వ్యాధి సుసాధ్యమూ కాదు, అసాధ్యమూ కాదు. ఇది కష్టసాధ్యం (యాప్యం) అని ఆయుర్వేదం వర్ణించింది. వైద్యుడు రోగికి సరియైన అవగాహన కల్పించి, సరైన ఆహార విహార ఔషధాలు సేవిస్తే, ఈ వ్యాధిని తప్పకుండా నియంత్రణలోకి తేవచ్చు. కొత్తగా వచ్చినప్పుడు సరియైన చికిత్స చేస్తే శాశ్వతంగా నిర్మూలనమవుతుంది. (భావప్రకాశ : సయాప్య్యః తమకశ్వాసః సాధ్యోవాస్యాత్ నవ ఉత్థితః )
గమనిక: వైద్యార్హతలు లేని కువైద్యుల ప్రచారాలను నమ్మి ఆరోగ్య సమస్యలను మరింత జటిలం చేసుకోవద్దు. కేవలం ఒక్క మోతాదులో ఉబ్బసం శాశ్వతంగా పోతుందన్నది వాస్తవం కాదు. పైన వివరించినట్లుగా వ్యాధి స్వభావాన్నిబట్టి ఒక్కోసారి దానంతట అదే తగ్గిపోవచ్చు. అంతేకాని ‘ఒక్క మోతాదు’ ప్రభావం కాదు. ఒక్క మోతాదులో తగ్గుతుందన్నప్పుడు తర్కబద్ధమైన ప్రశ్న ఉద్భవిస్తుంది. ఆ ఒక్కమోతాదు దేనిని నిర్మూలిస్తుంది? వ్యాధి కారణాలా? ఆత్యయికంగా ఉన్న ఆయాసాన్నా లేదా రోగనిరోధకశక్తిని జీవితాంతం ఉండేలా ఒకేసారి పెంచుతుందా? ఊపిరిత్తుల బలాన్ని పెంచుతుందా?... కాబట్టి ఒక్క మోతాదులో తగ్గుతుందనే ప్రచారాలకు లోనై, అసలైన శాస్త్రీయ వైద్య చికిత్సలను దూరం చేసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి అలాంటి ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య
ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్