కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: బారెడు పొద్దెక్కినా నిద్ర లేచేందుకు శరీరం సహకరించని పరిస్థితి. వ్యాయామం చేసేందుకు తెల్లవారుజామున బయటకొస్తే చలి కొరికేస్తోంది. సాయంత్రం నుంచే ప్రజలు ముడుచుకుపోతున్నారు. వారం రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం 8 గంటలు దాటినా తీవ్రత తగ్గడం లేదు. గరిష్టంగా 30, కనిష్టంగా 16 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. గత నెల రోజులుగా వరుస తుపానులే ఇందుకు కారణంగా వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు.
ఇకపై చలి తీవ్రత మరింత పెరుగుతుందనే సమాచారం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లా వ్యాప్తంగా మఫ్లర్లు, స్వెట్టర్లు, దుప్పట్లు, మంకీ క్యాప్‌లకు గిరాకీ పెరుగుతోంది. చిన్న పిల్లలను బయట తిప్పేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరం, ఆస్తమా, అలర్జీ బాధితులు వైద్యుల వద్దకు పరుగులు తీస్తున్నారు.
చిన్నారుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త
- డాక్టర్ జి.సుధాకర్, చిన్నపిల్లల వైద్యనిపుణులు
చలికాలంలో బరువు తక్కువగా ఉండి జన్మించిన పిల్లలు, నెలలు నిండకముందే జన్మించిన చిన్నారులతో పాటు ఏడాదిలోపు వయస్సు చిన్నారుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వీరి శరీర ఉష్ణోగ్రత 36.5 డిగ్రీల సెల్సియస్, 98.4 ఫారెన్‌హీట్ డిగ్రీలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఇళ్లలో ఉంటే తలుపులు, కిటికీలు మూసివేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో నులకమంచం కింద కుంపట్లు పెట్టేవారు. అలా కాకపోతే రూంహీటర్లు వినియోగించాలి. ఎట్టి పరిస్థితుల్లో చన్నీటి స్నానం చేయించకూడదు. గోరువెచ్చని నీటితో కాస్త ఎండపడ్డాక 5 నిమిషాల్లో స్నానం ముగించాలి. వ్యాధుల బారిన పడితే వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి.
చలి చంపేస్తోంది!
Published Tue, Dec 10 2013 6:17 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
Advertisement
Advertisement