వైరస్‌లూ తెచ్చే అనర్థం నిమోనియా
మామూలు ఫ్లూ జ్వరం (ఇన్ఫ్లుయెంజా) మొదలుకొని ఇప్పుడొచ్చే కరోనా అయినా నేరుగా మనిషిని చంపలేదు. వైరస్ సోకాక సెకండరీ ఇన్ఫెక్షన్లా వచ్చే నిమోనియాతో మనిషి మరణం అంచులకు వెళ్తాడు. ఏదైనా వైరస్ విజృంభించి ఒక చోట ఎపిడమిక్‌లా వచ్చి, తన ప్రభావం చూపిన తర్వాత నిమోనియాకు దారితీసే అవకాశాలు మరింత ఎక్కువ. ఇప్పుడొస్తున్న కరోనాగానీ... ఒకప్పుడు ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన బర్డ్‌ఫ్లూ (హెచ్1ఎన్1), సార్స్, స్వైన్‌ఫ్లూ, మధ్యప్రాచ్యాన్ని భయపెట్టిన మెర్స్ వంటి వైరస్ల వల్ల వచ్చిన జ్వరాలు ఆ తర్వాత నిమోనియాకు కారణమవుతాయి.అలాంటి నిమోనియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మనం మన ఊపిరితిత్తుల ద్వారా అనుక్షణం శ్వాసిస్తూ ఉంటామన్న విషయం తెలిసిందే కదా. అప్పుడే మన ప్రాణాలు నిలబడతాయి. ఊపిరితిత్తుల్లోని అతి చివరి అంచెలో ఉండే గాలి గదులను ‘ఆల్వియోలై’ అంటారు. ఈ ఆల్వియోలైలోనే బయటి నుంచి ఆక్సిజన్ మన శరీర అవయవాలకు అందడం, అక్కడే లోపలి కలుషితమైన గాలి బయటికి రావడం వంటి గ్యాసెస్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమం జరుగుతుంది. ఏదైనా కారణం వల్ల ఆల్వియోలైలో ఈ కార్యక్రమం జరగడానికి అంతరాయం కలిగితే అది నిమోనియా సమస్యకు దారితీస్తుంది.
నిమోనియాకు కారణాలు
ఇప్పటి కరోనా మాత్రమే గాక నిమోనియాకు ఎన్నో కారణాలుంటాయి. ప్రధానంగా అవి...
♦ బాక్టీరియా వల్ల – స్టెఫలోకాకస్ బ్యాక్టీరియా (ఇది పెద్దల్లో సాధారణంగా వచ్చేందుకు కారణమవుతుంది), హీమోఫీలస్ (పిల్లల్లో సాధారణంగా దీనివల్ల వస్తుంది), గ్రామ్‌నెగెటివ్, అనరోబిక్, టీబీ బ్యాక్టీరియా మొదలైన బ్యాక్టీరియాల వల్ల.
♦ ఫంగస్ వల్ల కూడా నిమోనియా వస్తుంది.
♦ కొద్ది ప్రదేశంలోనే ఎక్కువమంది ఉండటం (ఓవర్ క్రౌడింగ్). కరోనా మొదలుకొని ఏ వైరస్ అయినా సోకడానికి ప్రధాన కారణం కాబట్టి గుంపులుగా వ్యక్తులుండే ప్రదేశాలకు అవసరమైతే తప్ప వెళ్లకూడదు. ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే మాస్క్ తప్పక ధరించాలి.
♦ ఆల్కహాల్ తాగడం – దీనివల్ల వ్యక్తుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగానూ రోగనిరోధక శక్తి (డిఫెన్స్ మెకానిజం) తగ్గుతుంది. ఉదాహరణకు మత్తు లో దగ్గడం కూడా తక్కువే. దాంతో ఊపిరితిత్తుల్లో ఉన్న మనకు సరిపడని పదార్థాలు అక్కడే ఉండిపోవడం వల్ల కూడా నిమోనియా రావచ్చు.
♦ మైక్రో యాస్పిరేషన్ – మనకు తెలియకుడానే ద్రవాలు గొంతునుంచి శ్వాసనాళంలోకి జారిపోతుంటాయి. ఆ ప్రక్రియనే మైక్రోయాస్పిరేషన్ అంటారు. ప్రతివ్యక్తి గొంతులో బ్యాక్టీరియా ఉంటుంది. దీన్నే ఓరోఫ్యారింజియల్ ఫ్లోరా అంటారు. ఆ బ్యాక్టీరియా గొంతు నుంచి శ్వాసనాళాల ద్వారా గాలిగదుల వరకు పోవడం వల్ల కూడా నిమోనియా రావచ్చు.
నిమోనియా లక్షణాలుసాధారణ నిమోనియాలో...
♦ దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు, చలిగా ఉండటం, ఒక్కోసారి ఆకలి లేకపోవడం
♦ కఫం ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. ఉంటే తెల్లగా, పసుపురంగులో ఒక్కోసారి రక్తపు చారికతోనూ కనిపించవచ్చు.
♦ నిమోనియా ఊపిరితిత్తి పొర (ప్లూరా)కు చేరినప్పుడు ఛాతినొప్పి కూడా రావచ్చు.
♦ నిమోనియా మరీ తీవ్రంగా ఉంటే ఆయాసం కూడా రావచ్చు.
♦ అసహజంగా అనిపించే ఇంటర్‌స్టిషియల్ నిమోనియాలో దగ్గు కూడా ఉంటుంది. ఇది ఏ పరిస్థితికి తీసుకెళ్తుందంటే... ఒక్కోసారి శ్వాసప్రక్రియ ఫెయిలయ్యే అవకాశమూ ఉంది.
♦ ఆస్తమాలో పిల్లికూతలు ఉంటాయి. గాని నిమోనియాలో ఉండవు. గాలి పీలుస్తున్నా అది లోపలికి వెళ్లదు. కారణం. గాలి చేరాల్సిన ప్రదేశమైన గాలిసంచిలోని ఎగ్జుడస్ అడ్డంకిగా ఉంటుంది. కాబట్టి అక్కడికి ఆక్సిజన్ చేరదు. దాంతో శరీరానికి అవసరమైనంత ఆక్సిజన్ అందదు. ఫలితంగా ఊపిరితిత్తులు తమ పని తాము చేయలేని పరిస్థితికి వస్తాయి. దీన్నే ‘హైపాక్సిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్’ అంటారు.
♦ ఊపిరి అందకపోవడంతో నుదుట చెమటలు పట్టడం, కంగారుగా ఉండటం, గుండె స్పందన వేగం పెరగడం, డీలా పడిపోవడం, బీపీ పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని ‘సివియర్ నిమోనియా’ అంటారు.
♦ కొందరు రోగుల్లో ఛాతీలో తీక్షణమైన నొప్పి (షార్ప్ పెయిన్) రావచ్చు.
సమయానికి చికిత్స తీసుకోకపోతే ప్రమాదమే...
ఏ కారణం వల్ల నిమోనియా వచ్చినప్పటికీ దానికి చికిత్స తీసుకోకపోతే అది మరింత సంక్లిష్టతలకు దారితీస్తుంది. అంటే దాని ఇతర కాంప్లికేషన్లయిన సెప్టిసీమియా (అంటే రక్తానికి అంతా ఇన్ఫెక్షన్ సోకి, రక్తమంతా విషపూరితంగా మారడం) వంటివి కనిపిస్తాయి. అంతేకాదు... రక్తపోటు పడిపోవడం, పక్షవాతం, మూత్రపిండాలు దెబ్బతినడం, మెదడుపై దుష్ప్రభావం పడటం వంటివి రావచ్చు. చివరికి మరణం కూడా సంభవించవచ్చు.
మరికొన్ని జబ్బుల్లో కూడా...
మరికొన్ని జబ్బులు ఉన్నప్పుడు నిమోనియా సోకడం చాలా సాధారణం. డయాబెటిస్ ఉన్న వారు, క్యాన్సర్‌తో బాధపడుతూ కీమోథెరపీ తీసుకుంటున్నావారు, ఎయిడ్స్ రోగులు, ఆస్తమా ఉన్నవారు, ఆల్కహాల్ ఎక్కువగా తాగేవారిలో నిమోనియా రావడం చాలా సాధారణం. ఇలాంటి వ్యక్తులకు వైరస్ సోకితే మిగతా ఆరోగ్యవంతులతో పోలిస్తే వారు మరణించే అవకాశాలు ఎక్కువ. అలాగే సాధారణంగా గర్భవతుల్లో నిమోనియాను సక్రమంగా గుర్తించి, సరిగా వైద్య చికిత్స అందివ్వకపోతే అది ఎన్నో కాంప్లికేషన్లకు దారితీసే ప్రమాదం ఉంది.
వ్యాధి నిర్ధారణ
♦ రోగిలో కనిపించే లక్షణాలను బట్టి
♦ సీబీపీ, సీఎక్స్ఆర్ వంటి చాలా సాధారణ పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు.
♦ ఒక్కోసారి వ్యాధి తీవ్రతను బట్టి, అవసరాన్ని బట్టి ఛాతీ సీటీ స్కాన్, కళ్లె పరీక్ష వంటి ఇతర పరీక్షలు కూడా చేయాల్సి రావచ్చు.
నివారణ
♦ పిల్లలకు చిన్నతనంలో ఇచ్చే బీసీజీ, పెర్టుసస్లతోపాటు నిమోకోకల్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల దీన్ని నివారించవచ్చు.
♦ పొగతాగే అలవాటు ఉంటే జ్వరం, దగ్గు, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే తక్షణం ఆ అలవాటును ఆపేయాలి.
♦ బయటి వాతావారణంలో పొగ ఉంటే దానికి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త పడాలి.
♦ ఆస్తమా రోగులు, బ్రాంకైటిస్ ఉన్నవారు తప్పనసరిగా అది నియంత్రణలోకి వచ్చేలా చికిత్స తీసుకోవాలి.
♦ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఫలితంగా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్లు తేలిగ్గా సంక్రమించవు.
♦ అన్ని పోషకాలూ ఉండే సమతులాహారం తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరిగి, నిమోనియాతోపాటు అనేక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలుగుతుంది.
చికిత్స
♦ నిమోనియాకు తగిన యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయాల్సి ఉంటుంది. దీని మోతాదును జాగ్రత్తగా నిర్ణయించి డాక్టర్ల పర్యవేక్షణలో ఇవ్వాలి.
♦ ఎవరికైనా మూడు రోజులకు పైబడి జ్వరం, ఛాతీనొప్పి, ఊపిరి సరిగా తీసుకోకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని గుర్తుంచుకోండి.- డాక్టర్ ఎస్. మల్లికార్జున్ రావు,సీనియర్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్,అపోలో హాస్పిటల్స్, హైదర్‌గూడ, హైదరాబాద్