ఆస్తమాకూ ఆధునిక చికిత్స... | Modern treatment of both asthma ... | Sakshi
Sakshi News home page

ఆస్తమాకూ ఆధునిక చికిత్స...

Published Tue, Jul 5 2016 12:17 AM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM

Modern treatment of both asthma ...


హోమియో కౌన్సెలింగ్
 
 
నా వయస్సు 65. నేను చాలా సంవత్సరాలుగా ఆస్తమాతో బాధపడుతున్నాను. డాక్టరు గారి సూచనల మేరకు మందులు వాడుతున్నాను. వారు ఈ సమస్య పూర్తిగా తగ్గడానికి చికిత్స అందుబాటులో లేదని చెప్పారు. చల్లటి వాతావరణం ఏర్పడితే ఈ సమస్య తీవ్రతరం అయి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. హోమియో చికిత్స ద్వారా ఈ సమస్య పూర్తిగా నయం అయే అవకాశం ఉందా? సలహా ఇవ్వగలరు.  - పాలడుగు పుల్లయ్య, ఆదోని

 మీరు ఆందోళన చెందకండి. ఆస్తమా వ్యాధి హోమియో చికిత్స ద్వారా సంపూర్ణంగా నయం అవుతుంది. ఆస్తమా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. సాధారణంగా మనం ఊపిరి పీల్చుకున్న గాలి వాయుద్వారాల ద్వారా ఊపిరితిత్తులకు చేరుతుంది. అదేవిధంగా బయటకు వెళ్లిపోతుంది. ఈ వాయుద్వారాలు శోధకు గురి అయి వాపు చెందడం ద్వారా అవి సన్నగా, ఇరుకుగా మారి ఎక్కువగా శ్లేష్మాన్ని ఉత్పత్తి చేయటాన్ని ఆస్తమా అని అంటారు.

మన శరీరానికి సరిపడని పదార్థాలు గాలి ద్వారా పీల్చుకున్నప్పుడు వాయుద్వారాలు వాటికి బలంగా స్పందిస్తాయి. ఇలా స్పందించిన వాయుద్వారాల కండరాలు బిగుసుకుపోతాయి. దీని వల్ల వాయుద్వారాలు కాస్త సన్నగా మారతాయి. అవి శోధకు గురయి వాపు చెందడం ద్వారా సాధారణ స్థాయికి మించి శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తాయి. దాంతో అవి మరింత ఇరుకుగా మారి గాలి ప్రసరణకు ఆటంకాలు ఏర్పరచడం వల్ల ఆస్తమా లక్షణాలు ఏర్పడతాయి.

 కారణాలు: ఆస్తమా కలగడానికి గల కారణాలలో ఇంతవరకు స్పష్టత లభించడం లేదు. కానీ జన్యుపరమైన అంశాలు, వంశపారంపర్యత, వాతావరణం వంటి అంశాల సమ్మేళనంతో ఈ వ్యాధి కలుగుతుందని భావిస్తున్నారు.  ఆస్తమాని ప్రేరేపించే అంశాలు: ఇవి అందరిలోనూ ఒకేరకంగా ఉండవు. పూలమొక్కల నుండి వెలువడే పుప్పొడి రేణువులు, జంతుకేశాలు, దుమ్ము, బొద్దింకలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, జలుబు, శారీరక శ్రమ, వ్యాయామాల వల్ల చల్లగాలి లేదా చల్లటి వాతావరణం, వాతావరణ కాలుష్యం, పొగతాగటం, కెమికల్స్, వృత్తిరీత్యా దుమ్ములో గడపవలసి రావటం, ఆస్పిరిన్, బీటా బ్లాకర్స్ వంటి మందులు, ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే ప్రిజర్వేటివ్స్, అధిక మానసిక ఒత్తిడి వంటివన్నీ ఆస్తమాను ప్రేరేపిస్తాయి.


లక్షణాలు: ఇవి ఒక  వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వేర్వేరుగా ఉంటాయి. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, ఛాతీ బిగువుగా లేదా నొప్పిగా అనిపించటం, శ్వాస బయటకు వదిలినప్పుడు పిల్లికూతల వంటి శబ్దాలు వినిపించడం, దగ్గు. (ఆస్తమా వల్ల కలిగే దగ్గు రాత్రివేళలో, తెల్లవారు ఝామున అధికంగా ఉంటుంది). శ్వాస ఆడకపోవడం, దగ్గు వల్ల నిద్రకు ఇబ్బందికరంగా మారడం వంటివి.
 హోమియోకేర్ ఇంటర్‌నేషనల్ చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్ అందించే అధునాతనమైన జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ చికిత్సా విధానం ద్వారా ఎలాంటి శ్వాస సంబంధిత వ్యాధులనైనా సమర్థంగా నయం చేయడం జరుగుతుంది. రోగి మానసిక, శారీరక తత్వాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స అందించడం ద్వారా వ్యాధిని పూర్తిగా  తగ్గించవచ్చు. అంతేకాకుండా హోమియో మందుల ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపరచడం ద్వారా ఆస్తమా ప్రేరేపకాలు ఎదురైనప్పటికీ సమస్య మళ్లీ పునరావృతం కాకుండా సంపూర్ణంగా నయం చేయవచ్చు.
 
 
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండి.
హోమియోకేర్ ఇంటర్నేషనల్
హైదరాబాద్
 
 
కిడ్నీ మార్పిడే ఉత్తమం

 నా వయసు 26 సంవత్సరాలు. ఈ మధ్య ఆకలి లేకపోవడం, నీరసంగా ఉంటే పరీక్షలు చేయించుకున్నాను. క్రియాటినిన్ 14 ఎంజీ, యూరియా 320 మి.గ్రా. ఉంది. స్కానింగ్‌లో సీకేడీవీ అని చెప్పారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవాలని చెప్పారు. కిడ్నీ మార్పిడి కాకుండా ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు దాతలు ఎవరు ఉండవచ్చు?
 - రత్నకిశోర్, పామిడి

మీ సమస్యకు కిడ్నీ మార్పిడి చేయించుకోవడమే ఉత్తమ పరిష్కారం. దాతలుగా తోబుట్టువులు లేదా తలిదండ్రులను తీసుకోవాల్సి ఉంటుంది. డోనర్స్‌కి అన్ని పరీక్షలూ చేయించి, ఒక కిడ్నీ డొనేట్ చేయడం వల్ల వారికి ఏ సమస్యా ఉండదని నిర్థారణ అయ్యాకే వారిని దాతలుగా అంగీకరిస్తారు. ఆ తర్వాత వారికి ఏ విధమైన సమస్యలూ ఉండవు. కిడ్నీ దాతలు, స్వీకర్తకు రక్తసంబంధీకులు లేదా దగ్గరి బంధువులు అయితేనే కిడ్నీ ఎక్కువ రోజులపాటు పని చేసే అవకాశం ఉంటుంది. కిడ్నీమార్పిడి చికిత్స తర్వాత కూడా రెగ్యులర్‌గా మందులు వాడాల్సి ఉంటుంది. ఒకవేళ దాతలు లభ్యం కాకపోతే రెగ్యులర్‌గా డయాలసిస్ చేయించాల్సి ఉంటుంది. హోమ్ డయాలసిస్ లేదా హాస్పిటల్ డయాలసిస్ చేయించుకుంటూ అవయవ మార్పిడికోసం నమోదు చేయించుకోవాలి.
 
 
నా వయసు 32సంవత్సరాలు. మూత్రంలో మంట, జ్వరం తరచు వస్తోంది. మందులు వాడినప్పుడు తగ్గుతోంది. మానేయగానే నెలలోపే తిరిగివస్తోంది. ఇలా జరక్కుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
 -డి.కృష్ణబాబు, జనగామ

మీరు రిక రెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ఇలా మళ్లీ మళ్లీ రావడానికి కారణాలేమిటో పరివీలించాలి. సుగర్ ఉన్నట్లయితే కూడా ఇన్ఫెక్షన్ తరచు రావడానికి అవకాశాలున్నాయి. ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోండి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి, స్టోన్స్ కానీ, మూత్రనాళాల్లో వాపు గానీ ఉన్నాయేమో చూడాలి. యాంటీబయాటిక్స్ పూర్తి కోర్సు వాడకున్నా కూడా ఇన్ఫెక్షన్ మళ్లీ తిరగబెడుతుంది. ఏ కారణం లేకుండా మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్ వస్తుంటే మూడు నెలల వరకు తక్కువ డోసులో యాంటీబయాటిక్స్ వాడాలి. ఇన్ఫెక్షన్ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, నీరు ఎక్కువగా తీసుకోవాలి (రోజుకు రెండు నుంచి మూడులీటర్లకు తగ్గకూడదు). మూత్రం వచ్చినప్పుడు ఆపుకోకుండా వెంటనే విసర్జించాలి.


నా వయసు 58. నాకు షుగర్ వల్ల కిడ్నీలు పని చేయడం లేదు. రెండు సంవత్సరాలుగా డయాలిసిస్ చేయించుకుంటున్నాను. ఇప్పటివరకు మూడుసార్లు ఫిస్టులా ఆపరేషన్ చేయించుకున్నాను. ఏదీ పని చేయడం లేదు. నాకు డయాలిసిస్ చేయించుకుంటున్నప్పుడు చలి వణుకు వస్తోంది. ప్రత్యామ్నాయ పద్ధతులేమైనా ఉన్నాయా?
 - నరసింహమూర్తి, పామూరు

 మీకు ఇప్పుడు ఉన్న కాథెటర్‌కు ఇన్ఫెక్షన్ ఉంది. మొదట ఈ ఇన్ఫెక్షన్ తగ్గడానికి మందులు వాడాల్సి వుంటుంది. ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత పీమ్ కాథ్ ద్వారా డయాలిసిస్ చేయించుకోవడం మంచిది. ఇలా ఫిస్టులా ఉన్నప్పుడు హోమ్ డయాలిసిస్ (సిఏపీడీ) చే యించుకోవడం మంచిది. సిఏపీడీ వల్ల ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. ఇంట్లోనే చేసుకోవచ్చు. రెగ్యులర్‌గా చేసుకునే జాబ్ కూడా చేసుకోవచ్చు. క్వాలిటీ ఆఫ్ లైప్ బాగుంటుంది. హోమ్ డయాలిసిస్ ఖర్చు కూడా హాస్పిటల్ డయాలిసిస్ కంటే తక్కువగానే ఉంటుంది.
 
డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్
నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్,  హైదరాబాద్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement