Hampered
-
ఢీ..డిష్యుం..డిష్యుం..!
కుత్బుల్లాపూర్: కారు, బైక్ ఢీ కొన్నాయి.. అంతలో కారులో ఉన్న ఓ వ్యక్తి కిందకు దిగి బైక్‌పై వచ్చిన వ్యక్తిని కొట్టాడు. అంతే సదరు బైకిస్ట్‌కు చెందిన వ్యక్తులు అక్కడికి చేరుకుని కారులో ఉన్న నలుగురిని చితకబాదారు..పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సుచిత్ర నుంచి కుత్బుల్లాపూర్ వెళ్లే రోడ్డులో జయ రాంనగర్ వద్ద కారు, బైక్ ఢీకొనడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి స్థానికుడు కావడంతో అతడి స్నేహితులు అక్కడికి చేరుకుని కారులో ఉన్న వారిని బయటికి లాగి చితకబాదారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు గొడవ పోలీస్‌స్టేషన్ కు చేరింది. -
రేషన్ కిరోసిన్‌కు రెక్కలు
ఆరు నెలల్లో రెండు సార్లు పెరిగిన ధర తాజాగా లీటరుపై రూ.2 వడ్డన జిల్లా పేదలపై నెలకు రూ.4.32 లక్షల భారం గీసుకొండ : పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో సామాన్యులు నిత్యావసర వస్తువుల కొనుగోలుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రేషన్ షాపుల ద్వారా సరఫరా చేసే కిరోసిన్ లీటరుకు రూ.2 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల క్రితమే లీటరు కిరోసిన్‌కు రూ.2 పెంచిన ప్రభుత్వం మళ్లీ రూ. 2 పెంచడంతో కిరోసిన్ వినియోగించే పేదలపై అధికభారం పడనుంది. ధర పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఈనెల నుంచే అమలులోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. రేషన్ సరుకులు పేదలకు సరిగా అందేలా చూడటానికి సంస్కరణలు ప్రవేశపెడుతున్నామని చెబుతున్న ప్రభుత్వం మరో దారిలో వాటి ధరలను పెంచుతుండటం విమర్శలకు తావిస్తోంది. తద్వారా సామాన్య ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. గతం నుంచి ధర పెరుగుదల ఇలా.. గతంలో లీటర్ కిరోసిన్‌ను ప్రభుత్వం రూ.15కు అందజేసింది. దీనిని రూ.2 పెంచి రూ.17తో ఇటీవల వరకు కిరోసిన్ సరఫరా చేశారు. తాజాగా మరో రూ. 2 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా లీటరు కిరోసిన్‌కు రూ.19 చెల్లించాల్సి వస్తుంది. ఇలా ఆరు నెలల్లోనే రెండు సార్లు పెంచడంతో పేదలపై లీటరుకు రూ. 4 భారం పడినట్లయింది. ప్రస్తుత పరిస్థితుల్లో నిరుపేదలు దీపాలు, వంట తయారీ, పవర్స్రేయర్ల వాడకానికి అధికంగా కిరోసిన్‌ను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ధర పెంచడం వారికి ఆశనిపాతంలా మారనుంది. కాగా, కిరోసిన్ ధర పెరుగుదలతో వరంగల్ రూరల్ జిల్లాలోని పేదలపై ప్రతి నెల రూ.4,32,984 అదనంగా భారం పడనున్నట్లు గణాంకాలు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 464 రేషన్ షాపులు ఉండగా 2,19,462 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. అక్రమాలను నిరోధిస్తే మేలు.. రాష్ట్రప్రభుత్వం పేదల అవసరాలకు కిరోసిన్ సరఫరా చేస్తుండగా.. ఇందులో ఎక్కువ శాతం పక్కదారి పడుతోందని తెలుస్తోంది. ఆహార భద్రత కార్డులు ఉన్న వారికి రాయితీపై లీటరు చొప్పున, గ్యాస్ లేనివారికి రెండు లీటర్ల చొప్పున కిరోసిన్‌ను ప్రతి నెలా ప్రభుత్వం అందిస్తోంది. కిరోసిన్ అధికంగా అవసరం ఉన్న నిరుపేదలు మాత్రమే రేషన్ షాపుల నుంచి తీసుకువెళ్తున్నారు. ఇక ఎక్కువవగా వ్యవసాయ అవసరాలైన ఆయిల్ ఇంజన్లు, పవర్ స్పేయ్రర్లు, తైవాస్ స్పేయ్రర్లు నడిపేందుకు కిరోసిన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కిరోసిన్ హ్యాకర్లు కేవలం కొద్దిమంది లబ్ధిదారులకే కిరోసిన్ ఇచ్చి మిగతా వారికి మొండిచేయి చూపిస్తున్నారు. అలా మిగిలిన కిరోసిన్‌ను నల్లబజార్‌కు తరలిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. హాకర్ల నుంచి రూ.25 నుంచి రూ.30వరకు లీటర్ చొప్పున కిరోసిన్ కొనుగోలు చేసే బయటి వ్యాపారులు లీటరుకు రూ.35 నుంచి రూ. 40 వరకు విక్రయిస్తున్నారు. ఇలాంటి అక్రమాలను నిరోధించేందుకు రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తే అక్రమాలకు చెక్ పెట్టవచ్చునని.. తద్వారా తరచూ ధర పెంచకుండా నిరుపేదలను భారం నుంచి కాపాడొచ్చని పలువురు భావిస్తున్నారు. -
ఆస్తమాకూ ఆధునిక చికిత్స...
హోమియో కౌన్సెలింగ్ నా వయస్సు 65. నేను చాలా సంవత్సరాలుగా ఆస్తమాతో బాధపడుతున్నాను. డాక్టరు గారి సూచనల మేరకు మందులు వాడుతున్నాను. వారు ఈ సమస్య పూర్తిగా తగ్గడానికి చికిత్స అందుబాటులో లేదని చెప్పారు. చల్లటి వాతావరణం ఏర్పడితే ఈ సమస్య తీవ్రతరం అయి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. హోమియో చికిత్స ద్వారా ఈ సమస్య పూర్తిగా నయం అయే అవకాశం ఉందా? సలహా ఇవ్వగలరు. - పాలడుగు పుల్లయ్య, ఆదోని మీరు ఆందోళన చెందకండి. ఆస్తమా వ్యాధి హోమియో చికిత్స ద్వారా సంపూర్ణంగా నయం అవుతుంది. ఆస్తమా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. సాధారణంగా మనం ఊపిరి పీల్చుకున్న గాలి వాయుద్వారాల ద్వారా ఊపిరితిత్తులకు చేరుతుంది. అదేవిధంగా బయటకు వెళ్లిపోతుంది. ఈ వాయుద్వారాలు శోధకు గురి అయి వాపు చెందడం ద్వారా అవి సన్నగా, ఇరుకుగా మారి ఎక్కువగా శ్లేష్మాన్ని ఉత్పత్తి చేయటాన్ని ఆస్తమా అని అంటారు. మన శరీరానికి సరిపడని పదార్థాలు గాలి ద్వారా పీల్చుకున్నప్పుడు వాయుద్వారాలు వాటికి బలంగా స్పందిస్తాయి. ఇలా స్పందించిన వాయుద్వారాల కండరాలు బిగుసుకుపోతాయి. దీని వల్ల వాయుద్వారాలు కాస్త సన్నగా మారతాయి. అవి శోధకు గురయి వాపు చెందడం ద్వారా సాధారణ స్థాయికి మించి శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తాయి. దాంతో అవి మరింత ఇరుకుగా మారి గాలి ప్రసరణకు ఆటంకాలు ఏర్పరచడం వల్ల ఆస్తమా లక్షణాలు ఏర్పడతాయి. కారణాలు: ఆస్తమా కలగడానికి గల కారణాలలో ఇంతవరకు స్పష్టత లభించడం లేదు. కానీ జన్యుపరమైన అంశాలు, వంశపారంపర్యత, వాతావరణం వంటి అంశాల సమ్మేళనంతో ఈ వ్యాధి కలుగుతుందని భావిస్తున్నారు. ఆస్తమాని ప్రేరేపించే అంశాలు: ఇవి అందరిలోనూ ఒకేరకంగా ఉండవు. పూలమొక్కల నుండి వెలువడే పుప్పొడి రేణువులు, జంతుకేశాలు, దుమ్ము, బొద్దింకలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, జలుబు, శారీరక శ్రమ, వ్యాయామాల వల్ల చల్లగాలి లేదా చల్లటి వాతావరణం, వాతావరణ కాలుష్యం, పొగతాగటం, కెమికల్స్, వృత్తిరీత్యా దుమ్ములో గడపవలసి రావటం, ఆస్పిరిన్, బీటా బ్లాకర్స్ వంటి మందులు, ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే ప్రిజర్వేటివ్స్, అధిక మానసిక ఒత్తిడి వంటివన్నీ ఆస్తమాను ప్రేరేపిస్తాయి. లక్షణాలు: ఇవి ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వేర్వేరుగా ఉంటాయి. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, ఛాతీ బిగువుగా లేదా నొప్పిగా అనిపించటం, శ్వాస బయటకు వదిలినప్పుడు పిల్లికూతల వంటి శబ్దాలు వినిపించడం, దగ్గు. (ఆస్తమా వల్ల కలిగే దగ్గు రాత్రివేళలో, తెల్లవారు ఝామున అధికంగా ఉంటుంది). శ్వాస ఆడకపోవడం, దగ్గు వల్ల నిద్రకు ఇబ్బందికరంగా మారడం వంటివి. హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్ అందించే అధునాతనమైన జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ చికిత్సా విధానం ద్వారా ఎలాంటి శ్వాస సంబంధిత వ్యాధులనైనా సమర్థంగా నయం చేయడం జరుగుతుంది. రోగి మానసిక, శారీరక తత్వాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స అందించడం ద్వారా వ్యాధిని పూర్తిగా తగ్గించవచ్చు. అంతేకాకుండా హోమియో మందుల ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపరచడం ద్వారా ఆస్తమా ప్రేరేపకాలు ఎదురైనప్పటికీ సమస్య మళ్లీ పునరావృతం కాకుండా సంపూర్ణంగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండి. హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ కిడ్నీ మార్పిడే ఉత్తమం నా వయసు 26 సంవత్సరాలు. ఈ మధ్య ఆకలి లేకపోవడం, నీరసంగా ఉంటే పరీక్షలు చేయించుకున్నాను. క్రియాటినిన్ 14 ఎంజీ, యూరియా 320 మి.గ్రా. ఉంది. స్కానింగ్‌లో సీకేడీవీ అని చెప్పారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవాలని చెప్పారు. కిడ్నీ మార్పిడి కాకుండా ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు దాతలు ఎవరు ఉండవచ్చు? - రత్నకిశోర్, పామిడి మీ సమస్యకు కిడ్నీ మార్పిడి చేయించుకోవడమే ఉత్తమ పరిష్కారం. దాతలుగా తోబుట్టువులు లేదా తలిదండ్రులను తీసుకోవాల్సి ఉంటుంది. డోనర్స్‌కి అన్ని పరీక్షలూ చేయించి, ఒక కిడ్నీ డొనేట్ చేయడం వల్ల వారికి ఏ సమస్యా ఉండదని నిర్థారణ అయ్యాకే వారిని దాతలుగా అంగీకరిస్తారు. ఆ తర్వాత వారికి ఏ విధమైన సమస్యలూ ఉండవు. కిడ్నీ దాతలు, స్వీకర్తకు రక్తసంబంధీకులు లేదా దగ్గరి బంధువులు అయితేనే కిడ్నీ ఎక్కువ రోజులపాటు పని చేసే అవకాశం ఉంటుంది. కిడ్నీమార్పిడి చికిత్స తర్వాత కూడా రెగ్యులర్‌గా మందులు వాడాల్సి ఉంటుంది. ఒకవేళ దాతలు లభ్యం కాకపోతే రెగ్యులర్‌గా డయాలసిస్ చేయించాల్సి ఉంటుంది. హోమ్ డయాలసిస్ లేదా హాస్పిటల్ డయాలసిస్ చేయించుకుంటూ అవయవ మార్పిడికోసం నమోదు చేయించుకోవాలి. నా వయసు 32సంవత్సరాలు. మూత్రంలో మంట, జ్వరం తరచు వస్తోంది. మందులు వాడినప్పుడు తగ్గుతోంది. మానేయగానే నెలలోపే తిరిగివస్తోంది. ఇలా జరక్కుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? -డి.కృష్ణబాబు, జనగామ మీరు రిక రెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ఇలా మళ్లీ మళ్లీ రావడానికి కారణాలేమిటో పరివీలించాలి. సుగర్ ఉన్నట్లయితే కూడా ఇన్ఫెక్షన్ తరచు రావడానికి అవకాశాలున్నాయి. ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోండి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి, స్టోన్స్ కానీ, మూత్రనాళాల్లో వాపు గానీ ఉన్నాయేమో చూడాలి. యాంటీబయాటిక్స్ పూర్తి కోర్సు వాడకున్నా కూడా ఇన్ఫెక్షన్ మళ్లీ తిరగబెడుతుంది. ఏ కారణం లేకుండా మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్ వస్తుంటే మూడు నెలల వరకు తక్కువ డోసులో యాంటీబయాటిక్స్ వాడాలి. ఇన్ఫెక్షన్ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, నీరు ఎక్కువగా తీసుకోవాలి (రోజుకు రెండు నుంచి మూడులీటర్లకు తగ్గకూడదు). మూత్రం వచ్చినప్పుడు ఆపుకోకుండా వెంటనే విసర్జించాలి. నా వయసు 58. నాకు షుగర్ వల్ల కిడ్నీలు పని చేయడం లేదు. రెండు సంవత్సరాలుగా డయాలిసిస్ చేయించుకుంటున్నాను. ఇప్పటివరకు మూడుసార్లు ఫిస్టులా ఆపరేషన్ చేయించుకున్నాను. ఏదీ పని చేయడం లేదు. నాకు డయాలిసిస్ చేయించుకుంటున్నప్పుడు చలి వణుకు వస్తోంది. ప్రత్యామ్నాయ పద్ధతులేమైనా ఉన్నాయా? - నరసింహమూర్తి, పామూరు మీకు ఇప్పుడు ఉన్న కాథెటర్‌కు ఇన్ఫెక్షన్ ఉంది. మొదట ఈ ఇన్ఫెక్షన్ తగ్గడానికి మందులు వాడాల్సి వుంటుంది. ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత పీమ్ కాథ్ ద్వారా డయాలిసిస్ చేయించుకోవడం మంచిది. ఇలా ఫిస్టులా ఉన్నప్పుడు హోమ్ డయాలిసిస్ (సిఏపీడీ) చే యించుకోవడం మంచిది. సిఏపీడీ వల్ల ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. ఇంట్లోనే చేసుకోవచ్చు. రెగ్యులర్‌గా చేసుకునే జాబ్ కూడా చేసుకోవచ్చు. క్వాలిటీ ఆఫ్ లైప్ బాగుంటుంది. హోమ్ డయాలిసిస్ ఖర్చు కూడా హాస్పిటల్ డయాలిసిస్ కంటే తక్కువగానే ఉంటుంది. డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
వాన దాడి
తిరుపతి: వర్షాలు కొనసాగుతుండడంతో జనం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. తిరుపతి నగరంలో పలు కాలనీలకు చుట్టూ నీరు చేరడంతో ద్వీపాల(చుట్టూ నీళ్లు)ను తలపిస్తున్నాయి. గురువారం సాయంత్రం రెండుగంటల పాటు కుండపోతగా కురిసిన వర్షానికి భీతావాహులయ్యారు. సరిగ్గా పాఠశాలలలు, కళాశాలలు, కార్యాలయా ల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఎక్కడిక్కడే జనం నిలిచిపోయారు. ఆటోలు సైతం వెళ్లలేని విధంగా రోడ్లను వర్షపునీరు ముంచెత్తింది. ఉదయం కాస్త తెరిపివ్వడంతో పలు ప్రయివేటు పాఠశాలలు యధావిధిగా నడిచాయి. ఊహించని రీతిలో సాయంత్రం వర్షం ముంచెత్తడంతో ఇళ్లకు ఏలా వస్తారోనని తల్లిదండ్రులు తీవ్ర అందోళనకు గురయ్యారు. దాదాపు 48 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఆటోనగర్, ఆశోక్ నగర్ ప్రాంతాల్లో భారీగా ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైన్లు పొంగిపారుతుండడంతో వాహనదారులు, ప్రయాణికులు హడలిపోతున్నారు. జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని జనం భయాందోళనకు గురవుతున్నారు. శ్రీకాళహస్తి నియోజక వర్గంలో 70 గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. శుక్రవారం కూడా జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఎస్వీయూ పరిధిలో మూడో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేశారు. మందకొడిగా సహాయక చర్యలు... జిల్లాలో చేపట్టిన పునరావాస కార్యక్రమాలు మందకోడిగా సాగుతున్నాయి. 8,465 కుటుంబాలు వర్షాల ప్రభావానికి గురైనట్లు గుర్తించిన అధికారులు ఇప్పటి వరకు వెయ్యి కుటుంబాలకు మించి బియ్యం, కిరోసిన్, చక్కెర, పామాయిల్, కందిపప్పు అందించలేకపోయారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడం, వరద ముంచెత్తడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా నదులు పొంగి పారుతుండడం, ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. కల్యాణి డ్యాం నీటి మట్టం 893 అడుగులకు చేరింది. అధికారుల అంచనా ప్రకారం.. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 14 మంది మృతి చెందారు. 305 ఇళ్లు పూర్తిగా, 1345 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 83.580 కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ రోడ్లు దెబ్బతినడంతో రూ. 16.67 కోట్ల నష్టం వాటిల్లింది. 31.3 కి.మీ.మేర పంచాయతీ రోడ్లు దెబ్బతిన్నాయి. 45 చెరువులకు గండ్లు పడగా రూ.1.5కోట్ల నష్టం వాటిల్లింది. కూరగాయలు 567.50 హెక్టార్లు, పూలతోటలు 138.20 హెక్టార్లు, బొప్పాయి 33, అరటి పంటలకు 31.40 హెక్టార్టలో దెబ్బతిన్నాయి. ఇందుకు సంబంధించి రూ.1.12కోట్ల నష్టం వాటిల్లింది. 1658 ఎకరాల్లో వరి, 952 ఎకరాల్లో వేరుశెనగ, 15 ఎకరాల్లో కంది, 12 ఎకరాల్లో జొన్న, ఇతర పంటలు కలిపి మొత్తంగా 2,637 ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో రూ. 4.47 కోట్ల నష్టం వాటింది. ఈ మేరకు అధికారులు ప్రాథమిక అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. పొంచి ఉన్న అంటు వ్యాధులు.... వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు అప్పటికే పేరుకు పోయిన చెత్త చెదారంతోపాటు జంతు వధశాలల వ్యర్థాలు కుళ్లి వర్షపు నీటితోపాటు రోడ్లపైకి చేరాయి. ప్రస్తుత వర్షానికి మరింత కుళ్లి నివాస ప్రాంతాల వీధుల్లోకి చేరుతున్నాయి. దోమల బెడద కూడా ఉండడంతో ఎప్పుడు ఏవ్యాధులు చుట్టుముడతాయోనని జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చేబుతున్న మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. వడమాలపేటలో అత్యధిక వర్షం చిత్తూరు (అగ్రికల్చర్): జిల్లాలో గురువారం కూడా వర్షం కురిసింది. అత్యధికంగా వడమాలపేట మండలంలో 64.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా సత్యవేడు మండలంలో 2.4 మిల్లీ మీటర్ల వర్షపాతం న మోదైంది. పెనుమూరులో 59.6, రేణిగుంట 54.6, తిరుపతి అర్బన్ 53.2, రామచంద్రాపురం 52.6, బీఎన్ కండ్రిగ 52.4, వెదురుకుప్పం 50.4, చ ంద్రగిరి 48.8, ఏర్పేడు 46.2, తొట్టంబేడు 40.8, కార్వేటినగరం 36.2, నగరి 35.2, శ్రీకాళహస్తి 31.4, తవణంపల్లి 27.4, బంగారుపాళెం 27.2, చిత్తూరు 26.6, నారాయణవనం 26.4, కేవీబీ పురం 26.2, గంగాధరనెల్లూరు 26.2, పూతలపట్టు 25, నిమ్మనపల్లె 24.6, సదుం 24.2, ఎస్ఆర్పురం 23.2, సోమల 22.4, పుత్తూరు 22.4, కురబలకోట 21.2, నిండ్ర 21.2, పాకాల 19.8, మదనపల్లె 18.6, పెద్దపంజాణి 18.4, వాల్మీకిపురం 18.2, పిచ్చాటూరు 17.4, యాదమరి 17.4, పుంగనూరు 17.2, గుడిపాల 17.2, వరదయ్యపాళెం 15.8, పులిచెర్ల 15.4, ఐరాల 15.2, కెవి పల్లె 15, పెద్దమండ్యం 14.6, బెరైడ్డిపల్లె 13.2, కలికిరి 12.8, పలమనేరు 12.4, బి.కొత్తకోట 12.2, పీలేరు 12.2, రొంపిచెర్ల 12.2, పాలసముద్రం 11.4, మొలకలచెరువు 11.2, రామసముద్రం 11.2, తంబళ్లపల్లె 11, గంగవరం 10.6, చౌడేపల్లె 10.2, చిన్నగొట్టిగల్లు 10.2, ఎర్రావారిపాళెం 10, నాగలాపురం 9.6, పీటీఎం 9.2, కలకడ 9.2, వి.కోట 9, తిరుపతి రూరల్ 8.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. -
చీకటి రాజ్యం
నిండుకున్నవీధిదీపాలు, క్లాంపులు బడ్జెట్ ఘనం..ఖర్చు అంతంత మాత్రం చాలా చోట్ల వెలగని సెంట్రల్ డివైడర్ లైట్లు రోడ్డు ప్రమాదాల బారిన ప్రజలు పట్టించుకోని ఉన్నతాధికారులు నగరంలో చాలా ప్రాంతాలు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారుు. రాత్రి పూట వీధిదీపాలు వెలగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే నగరంలో దొంగతనాలు జోరుగా సాగుతున్నారుు. దీనికి తోడు అసాంఘిక శక్తుల ఆగడాలు మితిమీరుతున్నారుు. చాలా రహదారుల్లో అడుగడుగునా వెలసిన గోతులు ఒకవైపు... అలముకుంటున్న చీకట్లు మరోవైపు... వెరసి వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అరండల్‌పేట: నగరంలో మొత్తం 19,250 వీధిదీపాలు ఉన్నాయి. వీటి నిర్వహణకు(విద్యుత్ చార్జీల చెల్లింపు, సిబ్బంది వేతనాలతో కలిపి) నెలకు రూ. 20లక్షలు చొప్పున ఏడాదికి రూ. 2.40కోట్లు వ్యయమవుతోంది. 2014-15 నగరపాలకసంస్థ వార్షిక బడ్జెట్లో రూ. 75 లక్షలు ఖర్చుచేయాలని నిర్ణయించారు. ఆ నిధులతో వీధిదీపాలు, క్లాంపులు, ఇతర మెటీరియల్ కొనుగోలు చేయూలని నిర్ణరుుంచారు. అరుుతే కొన్ని నెలలుగా నగరంలో వీధిదీపాలు, క్లాంపులు, ఇతర పరికరాలు నిండుకున్నాయి. ఇప్పటి వరకు కార్పొరేషన్ ఎలక్ట్రికల్ విభాగం తరఫున కేవలం రూ. 12 లక్షలు మాత్రమే ఖర్చుచేశారు. మిగిలిన నిధులు సద్వినియోగం చేసుకొనే అవకాశం ఉన్నా ఇప్పటి వరకు పరికరాలకు సంబంధించి టెండర్లు పిలవనేలేదు. నగరపాలకసంస్థ పరిధిలోకి వచ్చిన పది విలీన గ్రామాల్లో సైతం పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. గోరంట్ల, నగరాలులో వీధిదీపాలు అసలు వెలగడం లేదు. ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం గోరంట్ల ప్రధాన రోడ్డులో లైట్లు వెలగకపోవడంతో రోడ్డు ప్రమాదం సంభవించింది. దీనిపై ఇప్పటికే అక్కడి స్థానికులు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా సమస్యను పరిష్కరించడం లేదు. అలాగే రెడ్డిపాలెం, అడవి తక్కెళ్లపాడు, బుడంపాడు, ఏటుకూరు, నల్లపాడు గ్రామాల్లో వీధులు అంధకారంలో ఉన్నాయి. నగరంలోని తూర్పు నియోజకవర్గం పరిధి ఆనందపేట 2, 5 లైన్లు, పాతగుంటూరు యాదవబజారు, ఆదిత్యనగర్ 1, 2 లైన్లు, శారదాకాలనీ 5, 6 లైన్లు, మంగళదాస్‌నగర్, కొత్తపేట, ఆర్టీసీకాలనీ, శ్రీనగర్ 4, 7 లైన్లలో వీధిదీపాలు వెలగడం లేదు. పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని హౌసింగ్‌బోర్డు కాలనీ 1, 4, 5 లైన్లు, శ్యామలాగనర్ 10, 11 లైన్లు, కొరిటెపాడు, స్తంభాలగరువు, ఎస్వీఎన్కాలనీ, పట్టాభిపురం, నల్లచెరువు, ఆర్ అగ్రహారం, శ్రీనివాసరావుతోట 60 అడుగుల రోడ్డు, కేవీపీకాలనీ తదితర ప్రాంతాల్లో వీధిదీపాలు వెలగడం లేదు. టెండర్లవిషయంలోనూ నిర్లక్ష్యం వీధిదీపాల కొనుగోలుకు సంబంధించి టెండర్లు పిలవడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా కొనుగోలు చేయడంతో ఒక్కొక్క టెండరు ఖరారు చేసేందుకు నెలల తరబడి సమయం పడుతోంది. ఇది ఒక కారణమైతే, కార్పొరేషన్ పరిధిలో వీధిదీపాల అవసరాన్ని అంచనా వేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. అదేసమయంలో కొంతమంది ఎలక్ట్రికల్ సిబ్బంది ఆయా వీధుల్లో వీధిదీపాలు పనిచేయడం లేదని ఫిర్యాదులు వచ్చినా స్పందించడం లేదు. ఉన్నతాధికారుల దృష్టికి సైతం వీటిని తీసుకువెళ్లడం లేదు. త్వరితగతిన పరిష్కరిస్తాం వీధిదీపాల సమస్య నా దృష్టికి వచ్చింది. ఇది నగరంలో ఎంత తీవ్రంగా ఉందో గుర్తించాం. వెంటనే షార్ట్ టెండర్లు పిలిచి వీధిదీపాలు, ఇతర సామగ్రి కొనుగోలు చేస్తాం. ఎక్కడా ప్రజలకు సమస్యలు తలెత్తకుండా వెంటనే చర్యలు తీసుకుంటాం. - డి.మరియన్న, ఎస్ఈ -
చస్తే.. చావే!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: బతకాలంటే కూడు, గూడు, గుడ్డ అవసరం. చచ్చాక ఆరడుగుల నేల తప్పనిసరి. ఆ అవసరాల తీర్చుకోవటానికి ప్రతి మనిషి నిత్యం సమస్యలతో సావాసం చేస్తుంటారు. క్షణం తీరికలేకండా గడుపుతుంటారు. కోట్లు సంపాదించిన వారైనా.. అడుక్కుతినే వారైనా చివరకు తనువు చాలించాల్సిందే. తనువు చాలించాక ఆరడుగుల నేల అవసరం. మృతదేహాన్ని పూడ్చిపెట్టేందుకు ఏర్పాటు చేసిన శ్మశాన వాటికలు సైతం పలుకుబడి, అధికారం ఉన్న కొందరు ఆక్రమించుకుని అనుభవిస్తున్నారు. జిల్లాలో అనేక గ్రామాల్లో శ్మశానాలు లేకపోగా.. మరి కొన్ని ప్రాంతాల్లో ఉన్న శ్మశానాలు ఆక్రమణలకు గురయ్యాయి కొన్ని పల్లెల్లో శ్మశానాలకు దారుల్లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సైదాపురం మండలం తురుమెళ్లలో ఆదివారం స్థానికులకు ఎదురైన సంఘటనే నిదర్శనం. తురుమెళ్ల అరుంధతి వాడకు చెందిన పసుపల వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో మరణించాడు. అతన్ని పూడ్చిపెట్టడానికి ఆరడుగుల నేల దొరకలేదు. శ్మశాన వాటికను స్థానిక టీడీపీ నేత ఒకరు ఆక్రమించి సాగు చేస్తున్నాడు. అధికార పార్టీ నాయకుడు కావడంతో అందులోకి వెళ్లేందుకు దళితులు సాహసించలేకపోయారు. అరుంధతివాడ వాసులంతా చర్చింకుని ఒక్కటిగా వెళ్లి అంత్యక్రియలు జరిపిం చారు. శ్మశాన వాటికకు వెళ్లేందుకూ దారి సౌకర్యం లేకపోవటంతో తీవ్ర ఇబ్బం దుల పడాల్సి వచ్చింది. శ్మశానాలను వదలని కబ్జాకోరులు... నెల్లూరు నగరంలోని బొడిగాడితోట శ్మశాన వాటిక ఆక్రమణకు గురైంది. అందులో నివాస గృహాలు సైతం ఏర్పాటు చేసుకున్నారు. ఆక్రమణలను గురించి ప్రశ్నించే వారు గాని.. చర్యలు తీసుకునే ధైర్యం గానీ అధికారులు చేయలేకపోతున్నారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం కొండూరుపాళెం, పెనుబలి శ్మశాన వాటికలకు దారుల్లేవు. విడవలూరు మండలం భద్రాచలంలో శ్మశాన వాటికకు వెళ్లాలంటే ప్రవహిస్తున్న వాగును దాటుకుని వెళ్లాల్సి ఉంది. కొడవలూరు మండలం నార్త్‌రాజుపాళెంలో శ్మశాన స్థలం లేకపోవటంతో రైల్యేట్రాక్ పక్కనే పూడ్చిపెడుతున్నారు. వెంకటగిరి పట్టణం చెవిరెడ్డిపల్లిలో శ్మశానం దారి ఆక్రమణకు గురైంది. దీంతో దారిలోనే మృతులకు అంత్యక్రియలు జరుపుతున్నారు. బాలాయపల్లి మండలం వెంకిరెడ్డిపల్లి, పాతవూరు, అంబలపూడి శ్మశాన స్థలాలను ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారు. దీంతో ఈ ప్రాంతాల్లో ఎవరైనా మరణిస్తే పంట పొలాల్లోనే పూడ్చిపెట్టాల్సిన దుస్థితి. నిండలి గ్రామంలో శ్మశానానికి కేటాయించిన మూడు ఎకరాల్లో రెండు ఎకరాలు భూమి ఆక్రమణకు గురైంది. ముత్తుకూరు మండలంలోని గురవయ్యసాల, వెంకనపాళెం, మామిడిపూడి దళితవాడకు శ్మశానాలు లేవు. రిలయన్స్, జెన్కో కాలనీలకు దారి సౌకర్యాలు లేవు. పొదలకూరు శ్మశానం ఆక్రమణలకు గురైంది. విరువూరు, కాకాణి నగర్‌లకు శ్మశానం లేదు. మనుబోలు, బద్దెవోలు గ్రామాల శ్మశానాలు ఆక్రమణలకు గురయ్యాయి. తోటపల్లి గూడూరు, వెంకటాచలం మండలంలోని నక్కావారిపాళెం, ముంగలదొరువు, వెంకటాచలం, మంగళంపాడు గ్రామాలకు శ్మశానాలు లేవు. సూళ్లూరుపేట మండలంలో దాదాపు అన్ని గ్రామాల్లో శ్మశానాలు ఆక్రమణలకు గురయ్యాయి. సుగ్గుపల్లి, అబాక, నెల్లూరుపాడు, పుదిరి గ్రామాల్లోని శ్మశానాలకు దారుల్లేవు. సూళ్లూరుపేట టౌన్‌లోని శ్మశాన వాటి ఆక్రమణకు గురైంది. కావలి పరిధిలో వైకుంఠపురం, గౌరవరం శ్మశాన వాటికలు ఆక్రమణకు గురైతే.. రుద్రకోట తదితర ప్రాంతాల్లోని శ్మశాన వాటికలకు దారుల్లేవు. ఇంకా గూడూరు, ఉదయగిరి, ఆత్మకూరు నియోజక వర్గాల పరిధిలోని అనేక గ్రామాల్లోని శ్మశానాలు ఆక్రమణలకు గురైతే.. మరి కొన్నిచోట్ల దారులు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికులు అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి శ్మశాన వాటిక సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.