రేషన్ కిరోసిన్‌కు రెక్కలు
ఆరు నెలల్లో రెండు సార్లు పెరిగిన ధర
తాజాగా లీటరుపై రూ.2 వడ్డన
జిల్లా పేదలపై నెలకు రూ.4.32 లక్షల భారం
గీసుకొండ : పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో సామాన్యులు నిత్యావసర వస్తువుల కొనుగోలుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రేషన్ షాపుల ద్వారా సరఫరా చేసే కిరోసిన్ లీటరుకు రూ.2 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల క్రితమే లీటరు కిరోసిన్‌కు రూ.2 పెంచిన ప్రభుత్వం మళ్లీ రూ. 2 పెంచడంతో కిరోసిన్ వినియోగించే పేదలపై అధికభారం పడనుంది. ధర పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఈనెల నుంచే అమలులోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. రేషన్ సరుకులు పేదలకు సరిగా అందేలా చూడటానికి సంస్కరణలు ప్రవేశపెడుతున్నామని చెబుతున్న ప్రభుత్వం మరో దారిలో వాటి ధరలను పెంచుతుండటం విమర్శలకు తావిస్తోంది. తద్వారా సామాన్య ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు.
గతం నుంచి ధర పెరుగుదల ఇలా..
గతంలో లీటర్ కిరోసిన్‌ను ప్రభుత్వం రూ.15కు అందజేసింది. దీనిని రూ.2 పెంచి రూ.17తో ఇటీవల వరకు కిరోసిన్ సరఫరా చేశారు. తాజాగా మరో రూ. 2 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా లీటరు కిరోసిన్‌కు రూ.19 చెల్లించాల్సి వస్తుంది. ఇలా ఆరు నెలల్లోనే రెండు సార్లు పెంచడంతో పేదలపై లీటరుకు రూ. 4 భారం పడినట్లయింది. ప్రస్తుత పరిస్థితుల్లో నిరుపేదలు దీపాలు, వంట తయారీ, పవర్‌స్రేయర్ల వాడకానికి అధికంగా కిరోసిన్‌ను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ధర పెంచడం వారికి ఆశనిపాతంలా మారనుంది. కాగా, కిరోసిన్ ధర పెరుగుదలతో వరంగల్ రూరల్ జిల్లాలోని పేదలపై ప్రతి నెల రూ.4,32,984 అదనంగా భారం పడనున్నట్లు గణాంకాలు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 464 రేషన్ షాపులు ఉండగా 2,19,462 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి.
అక్రమాలను నిరోధిస్తే మేలు..
రాష్ట్రప్రభుత్వం పేదల అవసరాలకు కిరోసిన్ సరఫరా చేస్తుండగా.. ఇందులో ఎక్కువ శాతం పక్కదారి పడుతోందని తెలుస్తోంది. ఆహార భద్రత కార్డులు ఉన్న వారికి రాయితీపై లీటరు చొప్పున, గ్యాస్ లేనివారికి రెండు లీటర్ల చొప్పున కిరోసిన్‌ను ప్రతి నెలా ప్రభుత్వం అందిస్తోంది. కిరోసిన్ అధికంగా అవసరం ఉన్న నిరుపేదలు మాత్రమే రేషన్ షాపుల నుంచి తీసుకువెళ్తున్నారు. ఇక ఎక్కువవగా వ్యవసాయ అవసరాలైన ఆయిల్ ఇంజన్లు, పవర్ స్పేయ్రర్లు, తైవాస్ స్పేయ్రర్లు నడిపేందుకు కిరోసిన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కిరోసిన్ హ్యాకర్లు కేవలం కొద్దిమంది లబ్ధిదారులకే కిరోసిన్ ఇచ్చి మిగతా వారికి మొండిచేయి చూపిస్తున్నారు. అలా మిగిలిన కిరోసిన్‌ను నల్లబజార్‌కు తరలిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. హాకర్ల నుంచి రూ.25 నుంచి రూ.30వరకు లీటర్ చొప్పున కిరోసిన్ కొనుగోలు చేసే బయటి వ్యాపారులు లీటరుకు రూ.35 నుంచి రూ. 40 వరకు విక్రయిస్తున్నారు. ఇలాంటి అక్రమాలను నిరోధించేందుకు రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తే అక్రమాలకు చెక్ పెట్టవచ్చునని.. తద్వారా తరచూ ధర పెంచకుండా నిరుపేదలను భారం నుంచి కాపాడొచ్చని పలువురు భావిస్తున్నారు.