తిరుపతి: వర్షాలు కొనసాగుతుండడంతో జనం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. తిరుపతి నగరంలో పలు కాలనీలకు చుట్టూ నీరు చేరడంతో ద్వీపాల(చుట్టూ నీళ్లు)ను తలపిస్తున్నాయి. గురువారం సాయంత్రం రెండుగంటల పాటు కుండపోతగా కురిసిన వర్షానికి భీతావాహులయ్యారు. సరిగ్గా పాఠశాలలలు, కళాశాలలు, కార్యాలయా ల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఎక్కడిక్కడే జనం నిలిచిపోయారు. ఆటోలు సైతం వెళ్లలేని విధంగా రోడ్లను వర్షపునీరు ముంచెత్తింది. ఉదయం కాస్త తెరిపివ్వడంతో పలు ప్రయివేటు పాఠశాలలు యధావిధిగా నడిచాయి. ఊహించని రీతిలో సాయంత్రం వర్షం ముంచెత్తడంతో ఇళ్లకు ఏలా వస్తారోనని తల్లిదండ్రులు తీవ్ర అందోళనకు గురయ్యారు. దాదాపు 48 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఆటోనగర్, ఆశోక్ నగర్ ప్రాంతాల్లో భారీగా ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
డ్రైన్లు పొంగిపారుతుండడంతో వాహనదారులు, ప్రయాణికులు హడలిపోతున్నారు. జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని జనం భయాందోళనకు గురవుతున్నారు. శ్రీకాళహస్తి నియోజక వర్గంలో 70 గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. శుక్రవారం కూడా జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఎస్వీయూ పరిధిలో మూడో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేశారు.
మందకొడిగా సహాయక చర్యలు...
జిల్లాలో చేపట్టిన పునరావాస కార్యక్రమాలు మందకోడిగా సాగుతున్నాయి. 8,465 కుటుంబాలు వర్షాల ప్రభావానికి గురైనట్లు గుర్తించిన అధికారులు ఇప్పటి వరకు వెయ్యి కుటుంబాలకు మించి బియ్యం, కిరోసిన్, చక్కెర, పామాయిల్, కందిపప్పు అందించలేకపోయారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడం, వరద ముంచెత్తడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా నదులు పొంగి పారుతుండడం, ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. కల్యాణి డ్యాం నీటి మట్టం 893 అడుగులకు చేరింది.
అధికారుల అంచనా ప్రకారం..
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 14 మంది మృతి చెందారు. 305 ఇళ్లు పూర్తిగా, 1345 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 83.580 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లు దెబ్బతినడంతో రూ. 16.67 కోట్ల నష్టం వాటిల్లింది. 31.3 కి.మీ.మేర పంచాయతీ రోడ్లు దెబ్బతిన్నాయి. 45 చెరువులకు గండ్లు పడగా రూ.1.5కోట్ల నష్టం వాటిల్లింది. కూరగాయలు 567.50 హెక్టార్లు, పూలతోటలు 138.20 హెక్టార్లు, బొప్పాయి 33, అరటి పంటలకు 31.40 హెక్టార్టలో దెబ్బతిన్నాయి. ఇందుకు సంబంధించి రూ.1.12కోట్ల నష్టం వాటిల్లింది.
1658 ఎకరాల్లో వరి, 952 ఎకరాల్లో వేరుశెనగ, 15 ఎకరాల్లో కంది, 12 ఎకరాల్లో జొన్న, ఇతర పంటలు కలిపి మొత్తంగా 2,637 ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో రూ. 4.47 కోట్ల నష్టం వాటింది. ఈ మేరకు అధికారులు ప్రాథమిక అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు.
పొంచి ఉన్న అంటు వ్యాధులు....
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు అప్పటికే పేరుకు పోయిన చెత్త చెదారంతోపాటు జంతు వధశాలల వ్యర్థాలు కుళ్లి వర్షపు నీటితోపాటు రోడ్లపైకి చేరాయి. ప్రస్తుత వర్షానికి మరింత కుళ్లి నివాస ప్రాంతాల వీధుల్లోకి చేరుతున్నాయి. దోమల బెడద కూడా ఉండడంతో ఎప్పుడు ఏవ్యాధులు చుట్టుముడతాయోనని జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చేబుతున్న మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి.
వడమాలపేటలో అత్యధిక వర్షం
చిత్తూరు (అగ్రికల్చర్): జిల్లాలో గురువారం కూడా వర్షం కురిసింది. అత్యధికంగా వడమాలపేట మండలంలో 64.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా సత్యవేడు మండలంలో 2.4 మిల్లీ మీటర్ల వర్షపాతం న మోదైంది. పెనుమూరులో 59.6, రేణిగుంట 54.6, తిరుపతి అర్బన్ 53.2, రామచంద్రాపురం 52.6, బీఎన్ కండ్రిగ 52.4, వెదురుకుప్పం 50.4, చ ంద్రగిరి 48.8, ఏర్పేడు 46.2, తొట్టంబేడు 40.8, కార్వేటినగరం 36.2, నగరి 35.2, శ్రీకాళహస్తి 31.4, తవణంపల్లి 27.4, బంగారుపాళెం 27.2, చిత్తూరు 26.6, నారాయణవనం 26.4, కేవీబీ పురం 26.2, గంగాధరనెల్లూరు 26.2, పూతలపట్టు 25, నిమ్మనపల్లె 24.6, సదుం 24.2, ఎస్‌ఆర్‌పురం 23.2, సోమల 22.4, పుత్తూరు 22.4, కురబలకోట 21.2, నిండ్ర 21.2, పాకాల 19.8, మదనపల్లె 18.6, పెద్దపంజాణి 18.4, వాల్మీకిపురం 18.2, పిచ్చాటూరు 17.4, యాదమరి 17.4, పుంగనూరు 17.2, గుడిపాల 17.2, వరదయ్యపాళెం 15.8, పులిచెర్ల 15.4, ఐరాల 15.2, కెవి పల్లె 15, పెద్దమండ్యం 14.6, బెరైడ్డిపల్లె 13.2, కలికిరి 12.8, పలమనేరు 12.4, బి.కొత్తకోట 12.2, పీలేరు 12.2, రొంపిచెర్ల 12.2, పాలసముద్రం 11.4, మొలకలచెరువు 11.2, రామసముద్రం 11.2, తంబళ్లపల్లె 11, గంగవరం 10.6, చౌడేపల్లె 10.2, చిన్నగొట్టిగల్లు 10.2, ఎర్రావారిపాళెం 10, నాగలాపురం 9.6, పీటీఎం 9.2, కలకడ 9.2, వి.కోట 9, తిరుపతి రూరల్ 8.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
వాన దాడి
Published Fri, Nov 20 2015 2:10 AM | Last Updated on Sun, Sep 3 2017 12:43 PM
Advertisement
Advertisement