చస్తే.. చావే!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: బతకాలంటే కూడు, గూడు, గుడ్డ అవసరం. చచ్చాక ఆరడుగుల నేల తప్పనిసరి. ఆ అవసరాల తీర్చుకోవటానికి ప్రతి మనిషి నిత్యం సమస్యలతో సావాసం చేస్తుంటారు. క్షణం తీరికలేకండా గడుపుతుంటారు. కోట్లు సంపాదించిన వారైనా.. అడుక్కుతినే వారైనా చివరకు తనువు చాలించాల్సిందే. తనువు చాలించాక ఆరడుగుల నేల అవసరం. మృతదేహాన్ని పూడ్చిపెట్టేందుకు ఏర్పాటు చేసిన శ్మశాన వాటికలు సైతం పలుకుబడి, అధికారం ఉన్న కొందరు ఆక్రమించుకుని అనుభవిస్తున్నారు.
జిల్లాలో అనేక గ్రామాల్లో శ్మశానాలు లేకపోగా.. మరి కొన్ని ప్రాంతాల్లో ఉన్న శ్మశానాలు ఆక్రమణలకు గురయ్యాయి కొన్ని పల్లెల్లో శ్మశానాలకు దారుల్లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సైదాపురం మండలం తురుమెళ్లలో ఆదివారం స్థానికులకు ఎదురైన సంఘటనే నిదర్శనం. తురుమెళ్ల అరుంధతి వాడకు చెందిన పసుపల వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో మరణించాడు.
అతన్ని పూడ్చిపెట్టడానికి ఆరడుగుల నేల దొరకలేదు. శ్మశాన వాటికను స్థానిక టీడీపీ నేత ఒకరు ఆక్రమించి సాగు చేస్తున్నాడు. అధికార పార్టీ నాయకుడు కావడంతో అందులోకి వెళ్లేందుకు దళితులు సాహసించలేకపోయారు. అరుంధతివాడ వాసులంతా చర్చింకుని ఒక్కటిగా వెళ్లి అంత్యక్రియలు జరిపిం చారు. శ్మశాన వాటికకు వెళ్లేందుకూ దారి సౌకర్యం లేకపోవటంతో తీవ్ర ఇబ్బం దుల పడాల్సి వచ్చింది.
శ్మశానాలను వదలని కబ్జాకోరులు...
నెల్లూరు నగరంలోని బొడిగాడితోట శ్మశాన వాటిక ఆక్రమణకు గురైంది. అందులో నివాస గృహాలు సైతం ఏర్పాటు చేసుకున్నారు. ఆక్రమణలను గురించి ప్రశ్నించే వారు గాని.. చర్యలు తీసుకునే ధైర్యం గానీ అధికారులు చేయలేకపోతున్నారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం కొండూరుపాళెం, పెనుబలి శ్మశాన వాటికలకు దారుల్లేవు. విడవలూరు మండలం భద్రాచలంలో శ్మశాన వాటికకు వెళ్లాలంటే ప్రవహిస్తున్న వాగును దాటుకుని వెళ్లాల్సి ఉంది.
కొడవలూరు మండలం నార్త్‌రాజుపాళెంలో శ్మశాన స్థలం లేకపోవటంతో రైల్యేట్రాక్ పక్కనే పూడ్చిపెడుతున్నారు. వెంకటగిరి పట్టణం చెవిరెడ్డిపల్లిలో శ్మశానం దారి ఆక్రమణకు గురైంది. దీంతో దారిలోనే మృతులకు అంత్యక్రియలు జరుపుతున్నారు. బాలాయపల్లి మండలం వెంకిరెడ్డిపల్లి, పాతవూరు, అంబలపూడి శ్మశాన స్థలాలను ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారు. దీంతో ఈ ప్రాంతాల్లో ఎవరైనా మరణిస్తే పంట పొలాల్లోనే పూడ్చిపెట్టాల్సిన దుస్థితి.
నిండలి గ్రామంలో శ్మశానానికి కేటాయించిన మూడు ఎకరాల్లో రెండు ఎకరాలు భూమి ఆక్రమణకు గురైంది. ముత్తుకూరు మండలంలోని గురవయ్యసాల, వెంకనపాళెం, మామిడిపూడి దళితవాడకు శ్మశానాలు లేవు. రిలయన్స్, జెన్‌కో కాలనీలకు దారి సౌకర్యాలు లేవు. పొదలకూరు శ్మశానం ఆక్రమణలకు గురైంది. విరువూరు, కాకాణి నగర్‌లకు శ్మశానం లేదు. మనుబోలు, బద్దెవోలు గ్రామాల శ్మశానాలు ఆక్రమణలకు గురయ్యాయి.
తోటపల్లి గూడూరు, వెంకటాచలం మండలంలోని నక్కావారిపాళెం, ముంగలదొరువు, వెంకటాచలం, మంగళంపాడు గ్రామాలకు శ్మశానాలు లేవు. సూళ్లూరుపేట మండలంలో దాదాపు అన్ని గ్రామాల్లో శ్మశానాలు ఆక్రమణలకు గురయ్యాయి. సుగ్గుపల్లి, అబాక, నెల్లూరుపాడు, పుదిరి గ్రామాల్లోని శ్మశానాలకు దారుల్లేవు. సూళ్లూరుపేట టౌన్‌లోని శ్మశాన వాటి ఆక్రమణకు గురైంది. కావలి పరిధిలో వైకుంఠపురం, గౌరవరం శ్మశాన వాటికలు ఆక్రమణకు గురైతే.. రుద్రకోట తదితర ప్రాంతాల్లోని శ్మశాన వాటికలకు దారుల్లేవు.
ఇంకా గూడూరు, ఉదయగిరి, ఆత్మకూరు నియోజక వర్గాల పరిధిలోని అనేక గ్రామాల్లోని శ్మశానాలు ఆక్రమణలకు గురైతే.. మరి కొన్నిచోట్ల దారులు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికులు అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి శ్మశాన వాటిక సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.