రోడ్డును తొలిచే దగ్గరో లేదా కొత్తగా ఇల్లు కట్టే చోట రాతిని బద్దలు చేయడానికి వాడే మెకానికల్ గడ్డపలుగు / గునపం లాంటివి వాడినప్పుడు అది దడదడలాడుతూ చేతులను వణికిస్తుంటుంది. ఆన్ చేసిన ట్రాక్టర్ స్టీరింగుపై చేతులు ఆన్చినా అదీ చేతుల్ని దడదడలాడిపోయేలా చేస్తుంది. ఇలాంటి పరికరాలు చాలాకాలం వాడుతూ ఉండే వృత్తుల్లో ఉన్నవాళ్లలో కొందరికి వచ్చే జబ్బు పేరే ‘వైబ్రేషన్ ఇండ్యూస్‌డ్ వైట్ ఫింగర్ డిసీజ్’.
కేవలం అలాంటి గడ్డపలుగు మాత్రమే కాదు... పవర్ డ్రిల్స్, జాక్ హ్యామర్స్, పెద్ద పెద్ద చెట్లను నరికేసే చైన్ సాల వంటి వాటిని వాడేవారిలోనూ ఇది రావడం సహజం. ఈ జబ్బుకు ‘హ్యాండ్ ఆర్మ్ వైబ్రేషన్ సిండ్రోమ్ (హావ్స్) అనీ, డెడ్ ఫింగర్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇది ‘రేనాడ్స్ డిసీజ్’ అనే రక్తనాళాలలనూ, నరాలను దెబ్బతీసే ఒక కండిషన్ తాలూకు తర్వాతి రూపం (సెకండరీ ఫార్మ్) అని కూడా భావిస్తున్నారు. కొంతమంది వ్యక్తుల్లో ‘వైట్ ఫింగర్ డిసీజ్’కు తోడ్పడే జన్యువును సైతం ఇటీవలే శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఈ ‘వైబ్రేషన్ ఇండ్యూస్‌డ్ వైట్ ఫింగర్ డిసీజ్’ ప్రధానంగా వేళ్లలోని రక్తనాళాలు, నరాలు, కండరాలూ, కీళ్లతో పాటు చేతులు, మణికట్టు వంటి వాటిపై తన దుష్ప్రభావం చూపుతుంది. మొదట్లో వేళ్ల చివర్లు తిమ్మిరిగా అనిపిస్తాయి. అటు తర్వాత అవి తెల్లగా పాలియినట్లుగా అవుతాయి. జబ్బు తీవ్రత బాగా పెరిగినప్పుడు వేళ్లు వేళ్లన్నీ తెల్లగా మారిపోతాయి. అందుకే ఈ జబ్బుకు ‘వైట్ ఫింగ్ డిసీజ్’ అని పేరు. అయితే... అలా తెల్లగా మారిన కొద్దిసేపటి తర్వాత రక్తం వేళ్ల చివరికి వేగంగా ప్రవహించడం వల్ల అవి ఎర్రగా కూడా మారవచ్చు.
ఒకసారి వచ్చిందంటే... ఆ తర్వాత అత్యంత త్వరలోనే తాము చేసే పనిని మానేయాల్సిన (రిటైర్ అవ్వాల్సిన) పరిస్థితి ఉంటుంది. చికిత్సలో భాగంగా కొన్నిసార్లు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులు వాడుతున్నప్పటికీ... దీనికి సరైన చికిత్స అంటూ నిర్దిష్టంగా ఏదీ లేదు. అందుకే తీవ్రంగా / విపరీతంగా కంపిస్తూ పనిచేసే ఉకపరణాలతో పనిచేసేవారు తమ పని గంటలను తగ్గించుకుంటూ రావడమే ఓ మంచి నివారణ చర్య.
(చదవండి: యూత్‌ఫుల్‌గా కనింపించేలా చేసే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే..? వేటిలో ఉంటాయంటే..!)
Comments
Please login to add a commentAdd a comment