చిన్నారుల ఊపిరితిత్తులకు గాలిని తీసుకెళ్లే చిన్న గాలిగొట్టాల్ని బ్రాంకియోల్స్ అంటారు. ఇన్ఫెక్షన్లు లేదా ఇతర కారణాలతో వీటిల్లో వాపు వస్తే దాన్నిబ్రాంకియోలైటిస్‌గా చెప్పవచ్చు. సాధారణంగా ఇది నెలల వయసుగల పిల్లలు మొదలుకొని రెండేళ్ల వరకు చాలా తరచుగా కనిపిస్తుంది. పిల్లల్లో బ్రాంకియోలైటిస్‌కు చాలా కారణాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రధాన గాలిగొట్టం (ట్రాకియా) లేదా నోరు, ముక్కు, గొంతుల్లో వచ్చే ఇన్ఫెక్షన్లు కిందికి వ్యాపించడం వల్ల ఈ సమస్య రావచ్చు. వైరస్‌లలో రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్, రైనో వైరస్, ఎడినో వైరస్, ఇన్‌ఫ్లుయెంజా, కరోనా లాంటి వైరస్‌లు, కొన్నిసార్లు కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు కూడా బ్రాంకియోలైటిస్‌కు కారణం కావచ్చు.
ముప్పు ఎవరిలో ఎక్కువ?
- నెలలు నిండకముందే పుట్టిన చిన్నారులు
- తల్లిపాలపై పెరగని పిల్లల్లో
- ఇంతకుమునుపే ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పిల్లలు
- డే కేర్ సెంటర్‌లోని పిల్లలు... మొదలైనవారిలో.
లక్షణాలు...
- బ్రాంకియోలైటిస్ లక్షణాలు దాదాపు ఓ వారం పాటు పిల్లలను బాధిస్తాయి. ఇవి ఫ్లూ లక్షణాలను పోలి ఉంటాయి. కొన్నిసార్లు తీవ్రమైన దగ్గుతో శ్వాస సరిగా అందక పిల్లలు బాధపడుతుంటారు. సాధారణంగా కనిపించే లక్షణాలివి...
- దగ్గు, పిల్లికూతలు
- ముక్కు కారడం
- ఊపిరి సాఫీగా అందకపోవడం
- పిల్లలు ఛాతీ పట్టేసినట్లుగా బాధపడటం
- జ్వరం, ఆకలి తగ్గడం
- చిరాకు / చికాకు కొన్నిసార్లు వాంతులు కావడం ∙ఆరు నెలల కంటే తక్కువ వయసున్న పిల్లలు పాలు సరిగా తాగలేకపోవడం, ఎక్కువగా ఏడవటం లాంటివి.
నిర్ధారణ... ∙
- ఛాతీ ఎక్స్–రే
కొన్ని రకాల రక్తపరీక్షలు
- ముక్కు, గొంతు నుంచి సేకరించిన స్వాబ్‌ను పరీక్షించడం ద్వారా వైరలా లేక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా అన్నది చాలావరకు నిర్ధారణ చేయవచ్చు.
- నివారణ: ∙పిల్లలు తమ చేతుల్ని తరచూ శుభ్రంగా కడుక్కునేలా చూడటం
- పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవడం
- అవసరాన్ని బట్టి కొందరికి ఫ్లూ టీకాలు ఇప్పించడం
- చల్లగాలికి ఎక్స్‌పోజ్ కాకుండా చూడటం ∙చల్లటి పదార్థాలు, కూల్‌డ్రింక్స్ తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
చికిత్స:
- చాలావరకు వైరల్ ఇన్ఫెక్షన్‌లే బ్రాంకియోలైటిస్‌కి కారణం కాబట్టి లక్షణాల ఆధారంగా సపోర్టివ్ ట్రీట్‌మెంట్ ఇస్తారు. అంటే... తగినన్ని నీళ్లు తాగించడం, కాస్త పెద్ద పిల్లలైతే ద్రవాహారాలు ఇవ్వడం, పాలు పట్టేముందర వారి నోరు, ముక్కుల్లో ఉండే చిక్కటి స్రావాలను ‘బల్బ్ సిరంజీ’తో బయటకు తొలగించడం, నిద్రపోతున్నప్పుడు బాగా శ్వాస అందేలా తలను కాస్త ఎత్తుగా ఉంచడం, జ్వరం ఉంటే టెంపరేచర్ తగ్గించే మందులు, యాంటిహిస్టమైన్స్, కాఫ్ సిరప్, నెబ్యులైజేషన్ వంటివి కొంతవరకు ఉపయోగపడతాయి. బ్లడ్ రిపోర్టులు, ఎక్స్–రే బట్టి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ ఇస్తారు.
- పిల్లలు బాగా డల్‌గా ఉండటం, పాలు, ఆహారం తీసుకోవడం బాగా తగ్గడం, పిల్లలకు ఊపిరి అందనప్పుడు / తమంతట తామే శ్వాస తీసుకోలేనప్పుడు ఇది కాస్త ప్రమాదకరమైన పరిస్థితి అని గ్రహించి, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అక్కడ డాక్టర్లు వారికి... ∙రక్తనాళం ద్వారా ఫ్లూయిడ్స్ ఎక్కించడం
- ఆక్సిజన్ అందకపోతే ఆక్సిజన్ పైప్‌తో ఆక్సిజన్ అందించడం ∙పిల్లల ఊపిరితిత్తుల్లో, ముక్కులోని చిక్కటి స్రావాలను (సక్షన్ ద్వారా) బయటకు పంపడం వంటి ప్రక్రియలతో చికిత్స అందిస్తారు.ఆక్సిజన్ అందకపోతే వెంటిలేటర్ మీద ఉంచాల్సి వస్తుంది.
డాక్టర్ సత్యనారాయణ కావలి, కన్సల్టెంట్ పీడియాట్రీషియన్.
(చదవండి: చీలమండ నొప్పి తగ్గాలంటే...)
Comments
Please login to add a commentAdd a comment