సాక్షి, అమరావతి: ఖజానా నుంచి రూ.371 కోట్లు దోచేసిన కేసులో రిమాండ్‌పై జైల్లో ఉన్న చంద్రబాబుకు కంటి ఆపరేషన్ కోసమే కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇస్తే విజయోత్సవాలు, ర్యాలీలు ఎందుకు నిర్వహిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలను నిలదీశారు.
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రోగిగా జైలు నుంచి బయటకు వస్తున్నారా లేక ఏదైనా యుద్ధంలో గెలిచి వీరయోధుడిగా వస్తున్నాడనుకుంటున్నారా అని ఎద్దేవా చేశారు. కంటి చికిత్స కోసం నాలుగు వారాల తాత్కాలిక బెయిల్‌పై చంద్రబాబు బయటకు వస్తున్నారని.. చికిత్స తర్వాత ఈ నెల 28న సాయంత్రం 5 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోవాల్సిందేనన్నారు.
ఈ మాత్రానికే రాజమండ్రి నుంచి రోడ్ షో నిర్వహించడానికి, సంబరాలు చేసుకోవడానికి సిగ్గుండాలని టీడీపీ నేతలకు చురకలంటించారు. స్కిల్ స్కాంలో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబు అని స్పష్టం చేశారు. ఈ కేసులో సీఐడీ పోలీసులు సమర్పించిన ఆధారాలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు చంద్రబాబును రిమాండ్‌పై జైలుకు పంపిందని గుర్తు చేశారు.
సానుభూతి కోసమే నాటకాలని ఒప్పుకోండి
చంద్రబాబు జైలుకెళ్లడంతో ప్రజల్లో పెద్దఎత్తున సానుభూతి వస్తుందని టీడీపీ నేతలు ఆశపడ్డారని.. తీరా పరిస్థితి చూసి భంగపడ్డారంటూ సజ్జల వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ప్రజల్లో ఎలాంటి స్పందన కనిపించకపోవడంతో చర్మవ్యాధులే ప్రాణాంతకమైనట్టు చూపుతూ చంద్రబాబుకు ఆరోగ్యం క్షీణిస్తోందంటూ టీడీపీ సానుభూతి డ్రామాలకు తెరతీసిందన్నారు. చంద్రబాబు ఆరోగ్యం, భద్రతపై ఆయన కుటుంబ సభ్యులు రోజుకో అబద్ధం చెబుతూ జైలు అధికారులు, ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు.
చెప్పుకోవడానికి కూడా న్యూసెన్స్‌గా అనిపించే చర్మ వ్యాధులు చంద్రబాబుకు ఉన్నాయనే అంశాన్ని ఆయన కుటుంబ సభ్యులే ప్రపంచానికి చెప్పి.. ఏసీ కావాలని కోర్టును అడిగారని దెప్పిపొడిచారు. జైలులో చంద్రబాబు ఉండే బ్యారక్‌లో ఏసీ ఏర్పాటుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆయనను బయటకు తెచ్చుకోవడానికి అడ్డదారుల్లో ఆలోచన చేశారని మండిపడ్డారు. రోగాల్ని చూపి సానుభూతి డ్రామాలాడి మొత్తానికి చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్ తెచ్చుకున్నారు కనుక.. ఇప్పటికైనా తాము నాటకాలు ఆడామని ప్రజల ముందు ఒప్పుకోవాలని చంద్రబాబు కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలను సజ్జల డిమాండ్ చేశారు.
నిర్దోషిగా బయటకొచ్చారా.. నిజం గెలిచిందనడానికి
స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయన న్యాయవాదులు వాదనలు వినిపించకుండా కంటి చికిత్సను సాకుగా చూపి తాత్కాలిక బెయిల్‌పై వాదనలు వినిపించారని సజ్జల గుర్తు చేశారు. కంటి చికిత్స కోసమే.. మానవీయ కోణంలో షరతులతో కూడిన బెయిల్ ఇస్తే నిజం గెలిచిందంటూ చంద్రబాబు కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు సంబరాలు జరుపుకోవడం వెనుక అర్థమేమిటని ప్రశి్నంచారు. చంద్రబాబు నిర్దోíÙగా బయటకొస్తున్నారా నిజం గెలిచిందనడానికి అని నిలదీశారు.
ఇలా చెప్పుకోవడానికి టీడీపీ నేతలకు సిగ్గు అనిపించడం లేదా అని చురకలంటించారు. ‘చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి సీమెన్స్ సంస్థతో చేసుకున్నది ఫేక్ అగ్రిమెంటా? కాదా?, చేసుకున్న ఒప్పందం ప్రకారం 90 శాతం అంటే రూ.3,000 కోట్లు సీమెన్స్ సంస్థ పెట్టుబడి పెట్టకుండానే.. 10 శాతం మొత్తం అంటే, 370 కోట్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు రిలీజ్ చేశాడా? లేదా?, సీమెన్స్ సంస్థ ప్రభుత్వం నుంచి మాకెటువంటి సొమ్ము అందలేదని చెప్పిందా? లేదా?, చంద్రబాబు తన సొంత మనుషుల్ని బయటినుంచి తెచ్చుకుని స్కిల్ స్కామ్‌కు పాత్రధారులుగా పెట్టుకున్నాడా? లేదా?, 13 చోట్ల చంద్రబాబు సంతకాలు ఉన్నాయా? లేవా?, చంద్రబాబు రిలీజ్ చేయమంటేనే.. ఖజానా నుంచి ఫండ్స్ రిలీజ్ చేస్తున్నామని ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు నోట్ ఫైల్స్ రాశారా? లేదా?
ప్రభుత్వం రిలీజ్ చేసిన ఫండ్స్‌లో రూ.240 కోట్లు షెల్ కంపెనీలకు వెళ్లాయని కేంద్ర జీఎస్టీ విజిలెన్స్ సంస్థ బయటపెట్టిందా? లేదా?, షెల్ కంపెనీలకు వెళ్లిన ఫండ్స్ క్యాష్ రూపంలో తిరిగి చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా చేరాయని ఐటీ దాడుల్లో రుజువైందా? లేదా?, ఈ విషయం పూర్తి నిర్థారణ కోసం పెండ్యాల శ్రీనివాస్‌ను పట్టుకుంటే అసలు వాస్తవాలు తెలుస్తాయనడం నిజమా? కాదా?, పెండ్యాల శ్రీనివాస్ కోసం సీఐడీ నోటీసులు జారీ చేస్తే.. ఆయన్ను అమెరికాకు పంపడం ద్వారా తప్పు చేసినట్టుగా చంద్రబాబు అంగీకరించారా? లేదా?’ అంటూ టీడీపీ నేతలపై ప్రశ్నల వర్షం కురిపించారు.
అందరూ నీ తండ్రిలా ఉంటారు అనుకుంటే ఎలా లోకేశ్!
చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నన్ని రోజులూ ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు చేసిన విషప్రచారం అంతాఇంతా కాదని సజ్జల గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారంటూ లోకేశ్ చౌకబారు మాటలు మాట్లాడారన్నారు. ‘అందరూ నీ తండ్రిలా ఉంటారనుకుంటే ఎలా’ అని లోకేశ్‌పై మండిపడ్డారు. ఆదినుంచీ వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి విష సర్పాలను పెంచి పోషించిందే చంద్రబాబు అని మండిపడ్డారు. నిజంగా సీఎం వైఎస్ జగన్ వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఉంటే 52 రోజుల తర్వాత చంద్రబాబు జైలు నుంచి ఎలా బయటకొస్తాడని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ మంజూరు
Comments
Please login to add a commentAdd a comment