బల్లికురవ: ఆత్మహత్యాయ్నతం చేసిన ఓ యువకుడి ప్రాణాలను వలంటీర్ కాపాడాడు. ప్రాథమిక చికిత్స చేసి సకాలంలో ఆస్పత్రికి తరలించాడు. ఈ ఘటన బాపట్ల జిల్లా బల్లికురవ మండలం రామాంజనేయపురంలో శనివారం జరిగింది. కుంచాల సుభాషిణి, కనకారావు దంపతుల కుమారుడు గోపీచంద్ (17) ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాడు. కనకారావు ఐదేళ్లుగా గ్రామంలో లేడు. సుభాషిణి తన తండ్రి వెంకటేశ్వర్లు వద్ద ఉంటూ తనకున్న పొలంతోపాటు కుమారుని సాయంతో గొర్రెలను మేపుతోంది.
ఈ క్రమంలో వెంకటేశ్వర్లు అనారోగ్యం బారిన పడ్డాడు. గోపీచంద్ గొర్రెల కాపలాకు వెళ్లకుండా జులాయిగా తిరుగుతుండడంతో అతడిని సుభాషిణి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన గోపీచంద్ ఇంట్లోనే పురుగుమందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న కుమారుడిని గమనించిన తల్లి వెంటనే ఇరుగుపొరుగు వారిని పిలిచింది. అక్కడే ఉన్న సీ వన్ క్లస్టర్ వలంటీర్ బత్తుల రమేశ్‌బాబు..గోపీచంద్ పురుగుమందు తాగినట్లు గుర్తించాడు.
బీఎస్సీ నర్సింగ్ చదివిన వలంటీర్.. గోపీచంద్‌కు ప్రాథమిక చికిత్స చేసి తాగిన పురుగు మందును కక్కించాడు. మెరుగైన చికిత్స కోసం 35 కి.మీ దూరంలో ఉన్న నరసరావుపేట వైద్యశాలకు తీసుకెళ్లేందుకు అంబులెన్స్ రావడం ఆలస్యమవుతుందని భావించి మరొకరి సహాయంతో బైక్‌పైనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సకాలంలో వైద్యం అందడంతో గోపీచంద్ ప్రాణాపాయస్థితి నుంచి బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. యువకుడి ప్రాణాలను కాపాడిన వలంటీర్‌ను గ్రామ సచివాలయ కార్యదర్శి షేక్.బాజీ, ఎంపీడీవో హనుమారెడ్డి, ఈవోఆర్డీ దాసరి సుమతి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment