బెంగాల్ వైద్యురాలిపై హత్యాచార ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న తరుణంలో.. ఘటన జరిగిన కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా ఓ యువకుడు మరణించాడు. అయితే తన కొడుకు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని అతడి తల్లి ఆరోపిస్తోంది.
వివరాలు.. కోల్‌కతాకు 25 కి. మీ దూరంలో ఉన్నహుగ్లీలోని కొన్నాగర్‌లో 28 ఏళ్ల యువకుడు విక్రమ్ భట్టాచాజీ నివాసముంటున్నాడు. ఇటీవల అతడిని ట్రక్కు ఢీకొట్టడంతో ఆర్‌జీకర్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే చికిత్స పొందుతూ శుక్రవారం బిక్రమ్ మరణించాడు. అయితే ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు అందుబాటులో లేరని, కొడుక్కి చికిత్స అందించడంలో ఆలస్యం చేయడం వల్లే మరణించినట్లు అతని తల్లి ఆరోపించింది.
ఆసుపత్రికి వచ్చిన సమయంలో డాక్టర్ అందుబాటులో లేరు. చాలా సమయం వృధా అయింది. ఆ లోపు అతని సర్జరీ పూర్తి కావాల్సి ఉంది. కనీసం అత్యవసర వైద్యుడు కూడా లేడు’ అని ఆమె వాపోయింది. అయితే, ఆర్‌జి కర్ ఆసుపత్రి అధికారులు మాత్రం మృతుడి కుటుంబ వాదనలను తోసిపుచ్చారు.
శుక్రవారం ఉదయం విక్రమ్‌ను ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు వెంటనే ట్రామా కేర్‌కు తీసుకెళ్లారని వైద్య సూపరింటెండెంట్ కమ్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సప్తర్షి ఛటర్జీ పేర్కొన్నారు. అతని శరీరంపై తలపై పెద్ద గాయం అయ్యిందని, సీటీ స్కాన్ కోసం తీసుకెళ్లినట్లు చెప్పారు. అయితే సీటీ స్కాన్ చేస్తున్నప్పుడు విక్రమ్ ఆరోగ్యం క్షీణించి మరణించినట్లు తెలిపాడు.
కాగా గత నెలలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణమైన అత్యాచారం, హత్యపై ఆర్‌జీ కర్ హాస్పిటల్ వైద్యులు నిరంతరం నిరసనలు చేస్తున్న తరుణంలో.. ఈ ఘటన చోటుచేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment