జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన 40 మంది యువ రైతులు ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు స్టడీ టూర్‌గా తీసుకెళ్లారు. జనవరి 7న వెళ్లిన రైతులు 11న తిరిగివచ్చారు. అక్కడ వారు చూసిన పంటలు, సాగు విధానాలను ఉద్యానవనశాఖ అధికారి నర్సయ్యతో పాటు వివరించారు. మహారాష్ట్రలో అరటి, దానిమ్మ, గోధుమ, చెరుకు, పత్తి, అల్లం పంటలు ఎక్కువగా కనిపిస్తాయని, నీటి ఎద్దడి ఎక్కువ కావడంతో వారికి ప్రతీ నీటిబొట్టూ విలువైనదేనని గమనించామని చెప్పారు. అరటి, దానిమ్మ, చెరుకు, అల్లం పంటలను డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పండిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు అక్కడి రైతులు. జల్‌గాం ప్రాంతంలో వర్షం నీటిని నిల్వ చేసి ఆ నీటితో వివిధ రకాల పద్ధతుల్లో గుట్టలపై పంటలు పండిస్తున్న తీరు అద్భుతం.
డ్రిప్, స్ప్రింక్లర్ సిస్టమే...
ఆ రాష్ట్రంలోని ఉద్యాన పంటలన్నీ డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారానే పండిస్తారు. డ్రిప్‌లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతి, పైపుల మందం, డ్రిప్ ద్వారానే ఆటోమేటిక్‌గా రసాయన ఎరువులు ఇచ్చే విధానాన్ని అక్కడి అధికారులు రైతులకు వివరించారు. డ్రిప్ పైప్ నుంచి పెద్ద పెద్ద ప్రాజెక్టుల కోసం ఉపయోగించే రకరకాల పైపులను తయారు చేసే విధానాన్ని వివరించారు. అరటిలో టిష్యూకల్చర్ మొక్కల తయారీపై రైతులకు అవగాహన కల్పించారు. ఉల్లి, ఎల్లి, కొత్తిమీర.. చివరకు రోడ్డు వైపున పెట్టిన చెట్లకు కూడా నీటిని డ్రిప్ ద్వారానే అందిస్తున్నారు.
పండ్లతోటల్లో నీటియాజమాన్యం పంపింగ్ మొత్తం సోలార్ సిస్టమ్ ద్వారానే పనిచేస్తుంది. ఏ మోటార్‌కు కూడా విద్యుత్ ఉపయోగించరు. మామిడిలో ప్రయోగాలు చూసి ఆశ్చర్యపోయామని రైతులు తెలిపారు. సాధారణంగా ఎకరాకు 40 మామిడి చెట్లు పెంచితే... హెడెన్స్ పద్ధతిలో 161 చెట్లు, ఆల్ట్రా హైడెన్స్ పద్ధతిలో ఎకరాకు 674 చెట్లు పెంచుతున్న తీరు అద్భుతమని పేర్కొన్నారు.
నీటి యాజమాన్యం అద్భుతం
మహారాష్ట్రలో చాలా మంది రైతులు డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతిలోనే పంటలు సాగుచేస్తున్నారు. నీటి వనరులు తక్కువగా ఉన్నప్పటికీ ప్రతీ నీటిబొట్టు వృథా కాకుండా వినియోగిస్తున్న తీరు అద్భుతంగా అనిపించింది.
- అయిలవేని గంగాధర్, తాటిపల్లి
గుట్టల్లోనే సాగు
మనం ఎందుకూ పనికిరావని విడిచిపెట్టిన గుట్టల్లాంటి ప్రదేశాల్లోనే అక్కడ రకరకాల పంటలు పండిస్తున్నారు. అరటి, దానిమ్మ, చివరకు పత్తి పంట కూడా డ్రిప్ పద్ధతి ద్వారానే సాగవుతోంది. నీటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసింది.
- మామిడి రమేశ్, తొంబరావుపేట
ఆచరణ సాధ్యమే
అక్కడి వ్యవసాయ పద్ధతులు చూసిన తర్వా త ఎలాంటి కష్టసాధ్యమైన పని అయినా... ఆచరణ సాధ్యమే అనిపిస్తోంది. డ్రిప్ పద్ధతి లో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంట పండించొచ్చు. దిగుబడి కూడా ఎక్కువగానే వస్తుంది. - నక్క రామచంద్రం, కన్నాపూర్
రైతుల్లో ఉత్సాహం
గుట్టల్లో నీళ్లు లేకున్నా మహారాష్ట రైతులు వ్యవసాయం చేస్తున్నారు. అన్నీ ఉన్నా మనమెందుకు సరిగా వ్యవసాయం చేయడం లేదనే తాపత్రయం రైతుల్లో కనిపించింది. సబ్సిడీపై అందిస్తున్న డ్రిప్, స్ప్రింక్లర్లను వినియోగించుకునే ఇక్కడ అలా సాగుచేసుకోవాలని సూచించాం.
- నర్సయ్య, ఉద్యానశాఖాధికారి
ఆధునిక సాగు.. లాభాలు బాగు..
Published Mon, Jan 13 2014 4:28 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement
Advertisement