సాక్షి,హైదరాబాద్ : బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో ఎక్స్ వేదికగా నిర్వహించే ‘ఆస్క్ కేటీఆర్’ క్యాంపెయిన్‌లో యూజర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
ఇందులో భాగంగా పాదయాత్రపై కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. ‘‘పార్టీ కార్యకర్తల ఆకాంక్షలతో భవిష్యత్‌లో పాదయాత్ర చేస్తా. రాష్ట్రవ్యాప్తంగా విస్త్రృతంగా పాదయాత్ర చేస్తా. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపం. కాంగ్రెస్ పాలనలో నష్టం నుంచి రాష్ట్రం కోలుకోవడం అసాధ్యం. బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం’’ అని కేటీఆర్ తెలిపారు.
కేసీఆర్ వ్యూహాలతో కేటీఆర్ పాదయాత్ర
ఎన్నికల్లో పరాజయం. ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరడం.రోజురోజుకి పార్టీ బలహీన పడుతుండడంతో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సరికొత్త వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్ ఆ హామీల్ని నిలబెట్టుకోలేదని, దాంతో ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని అంచనా వేస్తున్న కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.దీనికి సంబంధించి ఆయన ఈ మధ్యనే ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని గులాబీ పార్టీనేతలు చెప్పుకుంటున్నారు.
పార్టీని ఉద్యమ పార్టీగా మలచి,ప్రజల అభిమానం గెలుచుకుని రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన కేసీఆర్ తిరిగి పార్టీని బలోపేతం చేయడం కోసం పాదయాత్రకి ప్రణాళిక సిద్ధం చేశారట. ఇందులో భాగంగా కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో మమేకమై, ప్రజల సమస్యలను తెలుసుకుని అధికార పార్టీని నిలదీస్తారని ఇందు కోసం ఆయా ప్రాంతాల్లో నేతలు వ్యవహరించాల్సిన తీరును ఇప్పటికే వివరించారని, త్వరలోనే కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నారని తెలుస్తోంది. అందుకు ఊతం ఇచ్చేలా ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో కేటీఆర్ ప్రకటనతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment