Support farmers
-
ప్రభుత్వం అయితే మాత్రం!
‘నోరు లేనివాళ్లు ఉండరు. నోరు మెదపని వాళ్లే ఉంటారు..’ అంటారు అరుంధతీ రాయ్. ప్రస్తుతం జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు రాయ్. ప్రభుత్వం అయితే మాత్రం! మనకు అనంగీకారాలు ఉండకూడదా? మనం నోరెత్తకూడదా.. అని ప్రశ్నిస్తున్నారు. అరుంధతీ రాయ్ రచయిత్రి. 1997లో ఆమె రాసిన తొలి నవల ‘గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’తోనే ఇప్పటికీ ఆమె గుర్తుకు వస్తారు. ముఖ్యంగా ఆమె ఉద్యమ రచయిత్రి. మార్పు కోసమే ఆమె చేసే ప్రతి రచనా, రాసే ప్రతి వ్యాసం, మాట్లాడే ప్రతి మాటా! ఆమెను గుర్తు చేసే అంతకుముందరి విషయం మరొకటి కూడా ఉంది. 1989లో ‘ఇన్ విచ్ యానీ గివ్స్ ఇట్ దోజ్ వన్స్’ అనే టీవీ చిత్రానికి స్క్రీన్ ప్లే రైటర్‌గా ఆమెకు జాతీయ అవార్డు వచ్చింది. ఆ అవార్డును 2016లో ఆమె ప్రభుత్వానికే తిరిగి ఇచ్చేశారు! దేశంలో పెరిగిపోతున్న మతపరమైన అసహనాన్ని నిరసిస్తూ ఆమె అలా చేయడం కూడా రాయ్‌ని సామాజిక బాధ్యత స్వీకరించిన రచయిత్రిగా నిలబెట్టింది. తాజాగా ఆమె సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి సంఘీభావం ప్రకటించడంతో మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ‘‘పోరు జరుగుతున్నప్పుడు, ఆందోళన వ్యక్తం అవుతున్నప్పుడు, ప్రదర్శనల నినాదాలు మిన్నంటుతున్నప్పుడు, కొందరు చనిపోతున్నప్పుడు.. మౌనం వహించడం నేరం’’ అంటారు అరుంధతీ రాయ్. ఇప్పుడు ఆమె మాట్లాడుతున్నది కచ్చితంగా రైతు ఉద్యమం గురించే. నోరు విప్పని ప్రముఖుల గురించే. పౌరస్వేచ్ఛను, మానవ హక్కులను రాజకీయ నిర్ణయాలు ఎలా ధ్వంసం చేస్తున్నాయో ఒక సామాజిక, ఉద్యమ కార్యకర్తగా ఆమె నిరంతరం తన వ్యాసాలలో, ప్రసంగాలలో వివరిస్తూ ఉంటారు. అరుంధతి ప్రజానుకూలవాది. గత రెండున్నర దశాబ్దాలుగా ఆమె పార్లమెంటు బయట.. ‘ఏకవ్యక్తి విపక్షం’గా వ్యవహరిస్తున్నారు! ఆమెలో బెరుకుదనం ఉండదు. ఆమె మాటలో మృదుత్వం ఉండదు. మంచి అనుకున్నదాన్ని ఎంత బలంగా ప్రచారం చేస్తారో.. చెడు అనుకున్నదాన్ని అంత ఘాటుగా విమర్శిస్తారు. అరుంధతీ రాయ్ తండ్రి బెంగాలీ హిందువు. తల్లి మలయాళీ సిరియన్ క్రిస్టియన్. కలకత్తాలో ఉండేవారు. ఆమెకు రెండేళ్లప్పుడు తల్లిదండ్రులు విడిపోయారు. తండ్రిని వదిలి తమ్ముడితో పాటు తల్లితో కేరళ వచ్చేసింది. తర్వాత కొన్నాళ్లు ఊటీలో అరుంధతి తాతగారి ఇంట్లో ఉంది ఆ కుటుంబం. అక్కడి నుంచి మళ్లీ కేరళకు. అరుంధతి చదువు కూడా ఆమె కుటుంబం లాగే ఒక చోట స్థిరంగా సాగలేదు. కొట్టాయంలో కొంత, నీలగిరులలో కొంత పూర్తయింది. ఢిల్లీ ‘స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్’ నుంచి పట్టా తీసుకుంది. అక్కడే ఆమెకు సహ ఆర్కిటెక్ట్ గెరాడ్ డా కన్హాతో పరిచయం అయింది. ఇద్దరూ కొన్నాళ్లు ఢిల్లీలో, గోవాలో సహజీవనం చేశారు. తర్వాత విడిపోయారు. తిరిగి ఢిల్లీ వచ్చాక, 1984లో ఆమెకు ప్రదీప్ క్రిషన్ కలిశారు. ప్రదీప్‌కు సినిమాలు తీయాలని. ఈమెకు సమాజాన్ని మార్చాలని. ఇద్దరూ కలిసి సమాజాన్ని మార్చే సినిమా ఒకటి తీశారు. ‘మెస్సీ సాహిబ్’. దానికి అవార్డు వచ్చింది. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొద్దికాలానికే అరుంధతికి సినిమాలు, టీవీ సీరియళ్లు బోర్ కొట్టేశాయి. వాటిని వదిలేసి రకరకాల ఉద్యోగాలు చేశారు. ఏరోబిక్ క్లాసులు నడిపారు. ప్రదీప్‌తో విడిపోయారు. బాల్యంలోని తన జ్ఞాపకాలను రాయడం మొదలుపెట్టారు. ఆ జ్ఞాపకాలే చివరికి ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ అయ్యాయి. -
ఎంపీలను అడ్డుకున్న పోలీసులు
న్యూఢిల్లీ/రాంపూర్: వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు ఢిల్లీ శివార్లలోని ఘాజీపూర్ నిరసన కేంద్రం వద్దకు వెళ్లిన విపక్ష పార్టీల ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై అడ్డుగా పెట్టిన బారికేడ్లను దాటి, రైతులను కలుసుకునే అవకాశం ఎంపీలకు కల్పించలేదు. శిరోమణి అకాలీదళ్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫెరెన్స్ సహా 10 విపక్ష పార్టీలకు చెందిన 15 మంది ఎంపీలు గురువారం ఘాజీపూర్ సరిహద్దుకు వెళ్లారు. ఎంపీల బృందంలో శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్, సుప్రియ సూలే(ఎన్సీపీ), కణిమొళి(డీఎంకే), తిరుచ్చి రవి(డీఎంకే), సౌగత రాయ్(టీఎంసీ) తదితరులు ఉన్నారు. అనంతరం ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఘాజీపూర్ భారత్– పాకిస్తాన్ సరిహద్దులా ఉందని, రైతులు జైళ్లో ఉన్న ఖైదీలుగా ఉన్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. రైతులను కలుసుకునేందుకు ప్రజా ప్రతినిధులమైన తమను పోలీసులు అనుమతించలేదని వివరించారు. గురువారం లోక్‌సభ భేటీ ముగిసిన అనంతరం ఎంపీలు సుప్రియ సూలే, సౌగత రాయ్ స్పీకర్‌కు స్వయంగా ఈ లేఖను అందజేశారు. మరోవైపు, ఢిల్లీ–యూపీ మార్గంలో ఉన్న ఘాజీపూర్ కేంద్రం వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయినా, వేలాది మంది రైతులు తీవ్ర చలిని తట్టుకుంటూ నిరసన కొనసాగిస్తున్నారు. ఢిల్లీ– మీరట్ హైవేపైనే కొందరు విశ్రమిస్తున్నారు. మరోవైపు, జనవరి 26న రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో చెలరేగిన ఆందోళనల సమయంలో మృతి చెందిన రైతు నవ్రీత్ సింగ్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పరామర్శించారు. ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఉన్న దిబ్డిబ గ్రామంలో నవ్రీత్సింగ్ కుటుంబ సభ్యులను ఆమె ఓదార్చి, వారితో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, నిరసన తెలుపుతున్న రైతులను ఉగ్రవాదులని, వారి ఉద్యమాన్ని రాజకీయ కుట్ర అని అవమానించడం ఆపేయాలని ప్రియాంక డిమాండ్ చేశారు. రైతులు, పేదల బాధను గుర్తించలేని నాయకులతో ఎలాంటి ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు. నవ్రీత్ సింగ్ త్యాగం వృధా పోదని వారి కుటుంబసభ్యులకు చెప్పడానికే తాను ఇక్కడికి వచ్చానన్నారు. దిబ్డిబ వెళ్తుండగా, ప్రియాంక వాహన శ్రేణిలో ప్రమాదం చోటు చేసుకుంది. కాన్వాయ్‌లోని 4 వాహనాలుæ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. -
రేటుపైనా వేటు!
వరుస వైపరీత్యాలు.. ఎరువులు, విత్తనాల సమస్యలు.. రుణాలు రీషెడ్యూల్ కాక తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు.. ఇలా ఎన్నో అవరోధాలను అధిగమించి.. ఆరుగాలం శ్రమించి వరి పండించిన ఖరీఫ్ రైతు చివరికి ధర విషయంలోనూ దగాకు గురవుతున్నాడు. ప్రధానంగా లెవీ సేకరణ నిబంధనలను ప్రభుత్వం మార్చేయడం.. ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు ముందుకు రాకపోవడం.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు చాలాచోట్ల ఇంకా ప్రారంభం కాకపోవడంతో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఎక్కడా లభించడం లేదు. దిగుబడులు తగ్గిన నేపథ్యంలో కనీసం మద్దతు ధరైనా లభిస్తే కొంతలో కొంతైనా గట్టెక్కవచ్చన్న అన్నదాత ఆశలు హరించుకుపోతున్నాయి. శ్రీకాకుళం అగ్రికల్చర్:ఖరీఫ్‌లో వరి సాగు చేసిన రైతులు మద్దతు ధరకు నోచుకోక దిగాలు పడుతున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా ఆ రేటు ఎక్కడా లభించడం లేదు. ఎఫ్‌సీఐ లెవీ సేకరణ నిబంధనలు మార్చి 25 శాతం మా త్రమే లెవీగా తీసుకుంటామని ప్రకటించడం రైతు ల పాలిట శాపంగా పరిణమించింది. మిగతా బియ్యం తామెక్కడ అమ్ముకోగలమంటూ మిల్లర్ల మిల్లర్లు చేతులెత్తేస్తుండటంతో రైతులకు మద్దతు ధర లభించడం కష్టంగా మారింది. ఎలా చూసినా నష్టమే ఖరీఫ్ ధాన్యం ఏ గ్రేడ్ రకానికి క్వింటాలు రూ. 1400 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించింది. అంటే బస్తా(75కేజీలు)కు రూ. 1050 రావాల్సి ఉంది. అలాగే సాధారణ రకానికి రూ. 1360గా నిర్ణయించడంతో బస్తాకు రూ. 1020 రావల్సి ఉంది. జిల్లా రైతులు ఈ ఏడాది ఎక్కువగా స్వర్ణ, 1001 రకాలు సాగు చేశారు. సాధారణ రకమైన ప్రభుత్వం ప్రకటించిన మేరకు బస్తాకు రూ. 1020 రేటు అందాల్సి ఉండగా.. ప్రస్తుతం పొలం వద్ద రూ. 820కి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అదే మిల్లుకు చేర్చితే రూ. 870 వరకు ఇస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న ధాన్యంలో 24 శాతం వరకు తేమ ఉంటున్నందునే ధర తగ్గించి కొంటున్నామని వ్యాపారులు చెబుతున్నారు. తేమ 20 శాతం లోపు ఉంటే బస్తాకు మరో రూ. వంద వరకు ఆదనంగా చెల్లిస్తున్నారు. ఇలా అయినా రైతులకు మద్దతు ధర దూరమే. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా బస్తాకు రూ. 200 తక్కువగా లభిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చాలా మంది అమ్మడం మాని ధర పెరుగుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. వ్యాపారుల ఇష్టారాజ్యం ప్రభుత్వం ఈ ఏడాది జిల్లాలో 100 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించింది. వరి కోతలు దాదాపు చివరి దశకు చేరుకున్నా ఇప్పటి వరకు సగం కేంద్రాలు కూడా ప్రారంభం కాలేదు. ప్రారంభమైన కేంద్రాల్లో పాత నిబంధనలనే అమలు చేస్తున్నారు. ప్రధానంగా తేమ 17 శాతం లోపు ఉంటేనే కొనుగోలు చేయాలని, లేకుంటే కేంద్రం నిర్వాహకులు నష్టపోతారని ఉన్నతాధికారులు హెచ్చరించారు. సాధారణంగా ఖరీఫ్ ధాన్యంలో కనీసం 20 శాతం తేమ ఉంటుంది. పైగా తాలుతప్పులు ఒక శాతం మించకూడదనే మరో నిబంధన ఉంది. సుడి దోమ, ఇతర తెగుళ్లు ఆశించడం వల్ల తాలు గింజలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. వీటిన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోళ్లు దాదాపు అసాధ్యమే. ఇదే అవకాశంగా తేమ వంకతో ధాన్యం వ్యాపారులు మద్దతు ధరను గాలికి వదలి, ఇష్టారాజ్యంగా తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. ఆది నుంచీ ఒడిదుడుకులే.. ఈ ఏడాది ఖరీఫ్ సాగు ఆది నుంచి ఒడిదుడుకులతోనే సాగుతోంది. వర్షాభావం వల్ల సాగు ఆలస్యమైంది. పంట చేతికందే సమయంలో హుద్‌హుద్ తుపాను, ఆ వెంటనే సుడిదోమ తెగులు నిలువునా ముంచేశాయి. వీటన్నింటి వల్లా రైతులు ఎకరాకు 10 నుంచి 15 బస్తాల వరకు దిగుబడి కోల్పోయారు. జిల్లాలో సగటు దిగుబడి 28 బస్తాలు కాగా.. చాలా చోట్ల 10 నుంచి 15 బస్తాలకే పరిమితమవుతోంది. అంటే పరిస్థితి ఎంత నిరాశాజనకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెట్టుబడి కూడా ఈ ఏడాది రెట్టింపైంది. దోమ, తెగుళ్ల అదుపునకు రైతులు వేలాది రూపాయలు వెచ్చించారు. చివరికి ఇప్పుడు కనీస మద్దతు ధర కూడా రాకపోవడంతో గగ్గోలు పెడుతున్నారు.