హంత‌కుడు ఎవ‌రు? | Famous writer Rajasekara murder | Sakshi
Sakshi News home page

హంత‌కుడు ఎవ‌రు?

Published Sun, Nov 18 2018 2:03 AM | Last Updated on Sun, Nov 18 2018 2:03 AM

Famous writer Rajasekara murder - Sakshi

ప్రముఖ రచయిత రాజశేఖరం హత్య వార్త ఆనాటి దినపత్రికలో చదివాడు ప్రైవేటు డిటెక్టివ్‌ శ్రీకర్‌.  దినపత్రిక టీ పాయ్‌మీద గిరాటు వేసి ఉన్నపళంగా  పోలీస్‌ స్టేషన్‌కు బయలుదేరాడు. హత్యా ప్రాంతం ఒన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోకి వస్తుంది. ఆ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ చరణ్‌ తను కలిసి ఇదివరకు రెండు మూడు క్లిష్టమైన కేసులు పరిష్కరించారు. శ్రీకర్‌ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ గురించి వాకబు చేస్తూ.. ‘‘ఎవరైనా అనుమానస్తులున్నారా.. కూపీ లాగావా’’ అంటూ తనూ అదే చిరునవ్వు ప్రదర్శించాడు.  ‘‘రాజశేఖర్‌ ముఖంపై దిండు బలంగా అదిమి ఊపిరాడకుండా చేశారని పోస్టుమార్టం రిపోర్ట్‌ వచ్చింది’’ అన్నాడు చరణ్‌.శ్రీకర్‌కు తాను సేకరించిన కొన్ని ఆధారాలు చూపించాడు.‘‘కాని ఇవి మార్ఫింగ్‌ ఫోటోలేమోనని నా అనుమానం. పైగా అవి పూర్తిగా నేరాన్ని రుజువు చేసేలా లేవు. అందుకే ఇంకా ఎవరినీ అరెస్ట్‌ చేయలేదు.. పైగా ఫోటో తీశారూ అంటే మరో మనిషి ఆ గదిలో ఉన్నట్లేగా.. ఎవరో అతను తెలిస్తే గాని కేసు ముందుకు సాగదు’’ అని వివరిస్తూ..తన కెదురుగా నిలబడ్డ అనుమానితుడిని చూపించాడు. ‘‘ఇతను రాజశేఖరం వద్ద టైపిస్టుగా పనిచేసే కుమార్‌.. ఇంటరాగేషన్‌ చేస్తున్నాను’’అన్నాడు చరణ్‌.‘‘రాజశేఖరం గారిని ఎందుకు చంపావ్‌.. ఈ ఫోటోలో ఉన్నది నువ్వేగా..’’ అంటూ ప్రశ్నించాడు శ్రీకర్‌. ‘‘సార్‌! నేను హత్య చేయలేదు సర్‌.. నేను రాజశేఖర్‌ గారి ముఖం మీద ఉన్న దిండును తీసి చూశానంతే’’  గజ, గజ వణకుతూ అన్నాడు కుమార్‌. 

‘‘సార్‌.. నేనూ ఒక రచయితనే. ‘జయసుధ’ అనే కలం పేరుతో కథలు రాస్తున్నది నేనే అని చాలా మందికి తెలియదు. ప్రముఖ రచయిత రాజశేఖరం  ఒక వేదికపై పరిచయమయ్యారు. వారన్నా.. వారి రచనలన్నా నాకు చాలా ఇష్టం.  నా రచనా శైలి బాగుంటుందని తనకు సాయం చెయ్యమని కోరారు. వారు కథకు ప్లాట్‌ ఇస్తే నేను కథగా..స్క్రిప్ట్‌గా.. నవలగా డెవలప్‌ చేసే వాణ్ణి. ఇద్దరం చర్చించుకొని తుది నిర్ణయం తీసుకున్నాక రాజశేఖరం  పర్సనల్‌ కంప్యూటర్లో టైప్‌ చేసి పదిలపరచే వాణ్ణి. వారి సహచర్యం వల్ల  మరిన్ని మెలకువలు నేర్చుకుంటూ నా రచనలను కూడా కొనసాగిస్తున్నాను. వారికి వచ్చే పారితోషికంలో కొంత నాకు ముట్ట చెప్పే వారు. అది నేనూహించినదాని కంటే ఎక్కువ మొత్తం. అలా వారి ఉప్పు తినే నేను వారికి ముప్పు తలపెడ్తానా.. సర్‌’’ అని వాపోయాడు కుమార్‌.‘‘కేవలం కథలవరకేనా.. లేక వారి కుటుంబ కథల్లో కూడా తలదూర్చే వాడివా’’ కాస్త వ్యంగ్యంగానే  అడిగాడు శ్రీకర్‌.  ‘‘నా కంత సాన్నిహిత్యం లేదు సార్‌.. నాకు తెలిసినంత వరకు వారికి పెద్ద కుటుంబం అంటూ ఏదీ లేదు. చుట్టాలు, పక్కాలు  వచ్చిన జాడ కనబడేది కాదు. వారి సతీమణి పది సంవత్సరాల క్రితమే కాలం చేశారట. వారికి ఏకైక సంతానం విశాల్‌. తల్లి లేని పిల్లవాడు కదా అని కాస్త గారాబమెక్కువనుకుంటాను’’‘‘ఎందుకలా అనుకుంటున్నావ్‌’’ ‘‘విశాల్‌ చదివేది ఇంటర్‌ రెండవ సంవత్సరమే గాని డబ్బు మంచినీళ్ళ ప్రాయంలా ఖర్చు చేస్తుంటాడని రాజశేఖరంగారు అప్పుడప్పుడు చెప్పే వారు’’  ‘‘ఇంట్లో ఇంకా ఎవరెవరుంటారు’’‘‘వంట మనిషి రాములమ్మ. ఆమె భర్త రంగయ్య తోట పని చూసుకుంటూ ఉంటాడు’’    శ్రీకర్‌ మనసుకు ఎందుకో కుమార్‌ నిర్దోషని తోచింది. 

ఆ మరునాడు ఉదయమే తన ఫోన్లో మెసేజ్‌ చూసుకొని శ్రీకర్‌ ఆఫీసుకు వెళ్ళాడు కుమార్‌. ‘‘నీకు వివాహమయ్యిందా..’’ అడిగాడు శ్రీకర్‌.‘‘వివాహమయ్యింది సర్‌.. ఒక పాప గూడా.. ఉంది’’ ‘‘పాప వయసెంత.. బడికి వెళ్తుందా..’’‘‘లేదు సర్‌.. ఆరేళ్ళ ప్రాయం..’’ అంటూ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఆగిపోయాడు. అది గమనించిన శ్రీకర్‌ ‘‘చూడు కుమార్‌.. నావద్ద ఏదీ దాచిపెట్టొద్దు’’‘‘రహస్యమేమీ లేదు సార్‌..’’ నీళ్ళు నములసాగాడు. ‘‘మీ పాపకు గుండెలోని చిన్న రంధ్రం గురించి డాక్టర్లు ఏమన్నారు’’ అని శ్రీకర్‌ ప్రశ్నించే సరికి గతుక్కుమన్నాడు కుమార్‌.‘‘సార్‌.. ఆ విషయం చెబితే.. డబ్బు కోసం నేనే హత్య చేసానని మీకు అనుమానం వస్తుందని చెప్పాలా వద్దా.. అని సందేహించాను సర్‌. డాక్టర్లు మరి కొన్ని పరీక్షలు చేస్తే గాని చెప్పలేమన్నారు. నిజం దాచినందుకు క్షమించండి సర్‌.. ప్లీజ్‌’’ అని వేడుకున్నాడు కుమార్‌. ‘‘రాజశేఖరంగారు సినిమాలకు కూడా రాస్తుంటారు కదా.. ఆ రంగంలో ఎవరైనా పోటీదారులున్నారా..’’‘‘పోటీదారుల సంగతి తెలియదు గాని సార్‌.. కథలకు ఎంతో డిమాండు ఉన్నదన్న విషయం తెలుసు’’‘‘రాజశేఖరంగారు హత్య కాబడ్డ రోజు నువ్వు ఎక్కడున్నావు?’’ ‘‘సార్‌ గది పక్కనే నాకూ ఒక గది ఇచ్చారు. ఎవరైనా సార్‌తో మాట్లాడ్డానికి వచ్చినప్పుడు నేను నా గదిలోకి వెళ్ళి కథలు పూర్తి చేస్తుంటాను.ఆ రోజు ఉదయమే వారి అబ్బాయి విశాల్‌ వచ్చాడు సర్‌. కాలేజీ మమ్మల్ని బొటానికల్‌ టూర్‌ కోసం బెంగళూరు తీసుకెళ్తుంది. అలాగే మైసూర్‌ కూడా విహార యాత్రకు వెళ్ళి వద్దామని అంటున్నారు.పదివేలు కావాలని అడిగి తీసుకున్నాడు.రాత్రి భోజనం  తరువాత సరిచేసిన ఆ నాలుగు కథలను ప్రింటౌట్‌ తీసి తప్పులుంటే సరిచెయ్యండని సార్‌కిచ్చి.. నేను నా గదిలోకి వెళ్ళి పడుకున్నాను.తెల్లవారుజామున లేచి ఫైనల్‌ ప్రింటౌట్‌ కాపీలు తీయాల్సి ఉంది.  మధ్యరాత్రి నన్నెవరో పిలిచినట్లు వినిపించింది. లేచి గబగబా వెళ్లి సార్‌ గది తట్టాను. సాధారణంగా సార్‌ తలుపు  గడియపెట్టుకోరు. గదిలోకి వెళ్లి చూస్తే సార్‌ ముఖంపై దిండు ఉంది. పక్కన టీపాయ్‌ పైన మేము తయారు చేసిన కథలు.. కంప్యూటరూ.. సార్‌ సెల్‌ ఫోన్‌  కనపడలేదు. నాకు అనుమానమేసి సార్‌ దిండును పైకి తీశాను. సార్‌ కనుగుడ్లు నిలబడి ఉన్నాయి. భయంతో రంగయ్యా! అంటూ గట్టిగా అరిచాను. ఎవరూ రాలేదు. భయమేసింది. లేని శక్తి కూడగట్టుకొని ఔట్‌హౌస్‌కు  పరుగెత్తి,. తలుపుబాదాను. రంగయ్య తలుపు తీశాడు. విషయం చెప్పే సరికి రంగయ్య, రాములమ్మ ఇద్దరూ పరుగు పరుగున నా వెనకాలే వచ్చారు.ఉలుకూ.. పలుకూ.. లేని సార్‌ను చూసి ఏడ్వసాగారు. వెంటనే రాజశేఖరం  ఫ్యామిలీ డాక్టరుకు ఫోన్‌ చేశాను.  డాక్టరు  వచ్చి సార్‌ను పరీక్షించాడు. చనిపోయి దాదాపు గంట కావస్తోందని.. పోలీసులకు ఫోన్‌ చేశాడు. కొద్దిసేపటికి ఇన్‌స్పెక్టర్‌ చరణ్‌ గారు తన బృందంతో వచ్చారు. బాడీని పోస్ట్‌మార్టంకు పంపారు. నిన్న ఉదయమే బాడీని నాకప్పగించారు’’ అని కుమార్‌ చెప్తుంటే ఆవేదన అడ్డుపడింది. ఆగిపోయి మౌనంగా రోదించసాగాడు.

‘‘నేను కాలేజీకి ఫోన్‌ చేసి విషయం చెప్పి విశాల్‌ను అర్జెంటుగా వెనక్కి పంపించమన్నాను. అసలు వారు ఎలాంటి విహారయాత్రలకూ పిల్లలను తీసుకెళ్ళలేదట’’ శ్రీకర్‌ భృకుటి ముడిపడింది. వెంటనే ఇద్దరూ కలిసి రాజశేఖరం ఇంటికి వెళ్ళారు. విశాల్‌ గది చూద్దామని లోనికి వెళ్తుంటే.. శ్రీకర్‌ సెల్‌ ఫోన్‌ మోగింది.. ఆన్‌ చేశాడు. ‘‘హల్లో చరణ్‌..’’ అన్నాడు శ్రీకర్‌. అందులో నేనుచెప్పిన విషయం ఏమయ్యింది? అనే అర్థం ప్రస్ఫుటమవుతోంది.‘‘నేనొక మొబైల్‌ నంబరిస్తాను.ఆ నంబరుకే రాజశేఖరం గత రెండు రోజులుగా పలుమార్లు మాట్లాడాడు. కాని ఆ నంబర్‌ ఎవరి పేరుమీద రిజిస్టర్‌ అయిందో.. వివరాలు లేవు’’ఇన్‌స్పెక్టర్‌ చరణ్‌ గొంతు అస్పష్టంగా కుమార్‌కు వినవస్తోంది. ‘‘ఈ నంబర్‌ ఎవరిదో తెలుసా’’ అంటూ కుమార్‌కు చూపిస్తూ అడిగాడు. ‘‘రచయిత సుందరం నంబర్‌. అప్పుడప్పుడు కథల విషయంలో ఇరువురు చర్చించుకునే వారు’’‘‘ఈ విషయం నాకు ముందెందుకు చెప్పలేదు.. పోటీదారులెవరూ తెలియదన్నావ్‌’’ అంటూ రెట్టించాడు శ్రీకర్‌. ‘‘ఇతనూ ఒక రచయితనే కదా అనుకున్నాను సర్‌’’‘‘మరి రచయితల్లోనే కదా.. పోటీ తత్వముండేది. ఏదైనా నా వద్ద దాచొద్దని చెప్పాను. సుందరం రచయిత  అనే విషయం చెప్పలేదు. అంటే నిన్నూ అనుమానించక తప్పదు’’ గంభీరంగా అన్నాడు శ్రీకర్‌.దెబ్బకు ఠారెత్తి పోయాడు కుమార్‌. విశాల్‌ గదిలో కొన్ని రహస్యపు కాగితపు ముక్కలు దొరికాయి. వాటిని వాసన చూశాడు శ్రీకర్‌. ఏదో అనుమాన మేసింది.రాములమ్మను ఒంటరిగా మరో గదిలోకి పిలిచి విచారించాడు. తన అనుమానం నిజమయ్యింది. నిజనిర్థారణ కోసం తన అసిస్టెంట్‌ అనిల్‌కు ఫోన్‌ చేద్దామనుకునే సరికి అనిల్‌ ప్రత్యక్షమయ్యాడు ‘‘సార్‌.. మీ అనుమానం నిజమే. నేను కాలేజీకి వెళ్ళి విశాల్‌ గురించి వాకబు చేశాను. విహార యాత్ర అబద్ధం.. విశాల్‌ అలా అబద్ధాలాడుతూ తన తండ్రి దగ్గర డబ్బు పట్టిస్తాడని.. అ డబ్బుతో మాదక ద్రవ్యాలు కొంటాడని అతని స్నేహితులు కొందరు చెప్పారు. అతని మొబైల్‌  సిగ్నల్స్‌..శంషాబాద్‌ ప్రాంతంలో ఉన్నట్లు తెలుపుతోంది.అదే ప్రాంతంలో సుందరం   ఫామ్‌హౌస్‌ ఉంది’’ అన్నాడు అనీల్‌.‘‘కమాన్‌ క్విక్‌..’’ అంటూ వేగంగా కారు వైపు కదిలాడు శ్రీకర్‌. ‘‘భేష్‌.. ఇప్పటికైనా అక్కరకొచ్చే ఒక ఇన్‌ఫర్మేషనిచ్చావ్‌’’ అనిల్‌ పరుగెత్తి కారు డ్రైవ్‌ చేద్దామని సీట్లో కూర్చున్నాడు. శ్రీకర్‌ కారు ముందు సీట్లో.. కుమార్‌  వెనక సీట్లో కూర్చున్నారు.


కారు వాయువేగంగా కదిలింది. ‘‘చరణ్‌.. శంషాబాద్‌ సుందరం ఫామ్‌హౌస్‌కు వెళ్తున్నా. అర్జెంటుగా పోలీసు ఫోర్స్‌ను తీసుకొని వచ్చేయ్‌’’ అంటూ ఫోన్‌ కట్‌ చేశాడు.‘‘సర్‌.. అక్కడే సుందరంగారు కథలు చెప్తుంటే అతని అసిస్టెంట్‌ భూషణం టైప్‌ చేస్తుంటాడు’’ అంటూ మరికొంత సమాచారమిచ్చాడు కుమార్‌.‘‘భూషణం ఎలాంటి వాడు.. నీకేమైనా తెలుసా’’ కూపీ లాగాడు శ్రీకర్‌.‘‘అంతగా పరిచయం లేదు సర్‌.  అతను నా కంటే ముందు రాజశేఖరంగారి వద్ద  పనిచేసే వాడట. అతని ప్రవర్తన నచ్చక పంపించేశానని సార్‌ ఒకసారి అన్నారు. ప్రస్తుతం సుందరం దగ్గర పనిచేస్తున్నాడు’’ మళ్ళీశ్రీకర్‌  ఏమంటాడో.. భూషణం గురించి ముందు చెప్పక పోవడమూ తప్పు చేశానని గిల్టీగా ఫీలయ్యాడు కుమార్‌.‘‘అదే కుమార్‌.. నీలో ఉన్న పెద్ద తప్పు. ఏదైనా అడగంది చెప్పడం లేదు. నేర పరిశోధన సమయంలో ఏ విషయమూ దాచొద్దు. సరే అయిందేదో అయింది. నాకు భూషణం మీద అనుమానంగా ఉంది. అనిల్‌ త్వరగా పోనీయ్‌’’ అంటూ వేగిర పెట్టాడు శ్రీకర్‌. వారు ఫామ్‌హౌస్‌ చేరుకునే సరికి చరణ్‌ తన బృందంతో అప్పుడే జీపు దిగుతున్నాడు.చరణ్‌ సంకేతాలందుకొని పోలీసులు తలుపులు బద్దలుకొట్టారు. ఎదురుగా ముగ్గురు రౌడీలు.. పోలీసులను చూడగానే కాళ్ళకు బుద్ధి చెప్పబోయారు. నలుగురు పోలీసులు చుట్టుముట్టి రౌడీలను అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒకరు భూషణం.. కుమార్‌ గుర్తించాడు.‘‘విశాల్‌ ఎక్కడ’’ అని గద్దించాడు ఇన్‌స్పెక్టర్‌ చరణ్‌. భూషణాన్ని సోదా చేసి సెల్‌ ఫోన్‌ లాక్కున్నాడు. భూషణం పక్క గదిలోకి కదిలాడు. అంతా వెంబడించారు. మంచంపై విశాల్‌ మత్తుగా నిద్రపోతున్నాడు. ఇంతగా అలజడి అయినా విశాల్‌ లేవక పోవడం.. అధిక మొత్తంలో మాదక ద్రవ్యం కన్‌జ్యూమ్‌ చేసి ఉంటాడని భావించాడు చరణ్‌. శ్రీకర్, అనిల్‌  పక్క గది లోకి వెళ్ళి సోదా చేసారు. రాజశేఖరం గారి పర్సనల్‌ కంప్యూటర్‌.. కథలు దొరికాయి. వాటిని తీసుకొచ్చి చరణ్‌కు అందజేశారు.చరణ్‌ భూషణం సెల్‌ ఫోన్‌ లోని ఫొటోలు చూపించాడు. ఇద్దరూ.. చిరునవ్వు నవ్వుకున్నారు. ఇద్దరు పోలీసులను విశాల్‌ దగ్గర కాపలా పెట్టి లేచాక స్టేషన్‌కు తీసుకురమ్మన్నాడు చరణ్‌.‘‘చరణ్‌.. అనిల్, కుమార్‌లను కూడా ఇక్కడే ఉండనిద్దాం. విశాల్‌ లేచాక ముందుగా రాజశేఖరం గారి అంతిమ సంస్కారం పోలీసుల పర్యవేక్షణలో చేయిద్దాం. కుమార్, అనిల్‌ ఆ పని చూసుకుంటారు. నేను నీతో స్టేషన్‌కు వస్తాను’’ అని అనుమతి అడిగాడు శ్రీకర్‌. చరణ్‌ ఓకే.. అన్నట్టుగా తలూపాడు. ఇద్దరు రౌడీలను, భూషణంను పోలీసు జీపు ఎక్కించారు పోలీసులు.చరణ్, శ్రీకర్‌ అంతా కలిసి అదే జీబులో వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు బయలుదేరారు.

ఇన్‌స్పెక్టర్‌ చరణ్‌ తనదైన శైలిలో లాఠీ ఝళిపించే సరికి భూషణం గుండె అదిరి పోయింది. లాఠీ రుచి చూడక ముందే..‘‘సర్‌.. నిజం చెబుతాను’’ అంటూ చరణ్‌ కాళ్ళపై పడిపోయాడు భూషణం.     శ్రీకర్‌ కనుసైగ చూసి మీడియాను రమ్మన్నాడు చరణ్‌. ఫామ్‌హౌస్‌ నుంచి వస్తుంటే దారిలో శ్రీకర్‌ మీడియాకు ప్రముఖ రచయిత రాజశేఖరం హంతకుడు దొరికాడని చెప్పడం విన్నాడు. మీడియా ముందు భూçషణం నోరు విప్పాడు.‘‘కుమార్‌ కంటే ముందు రచయిత రాజశేఖరం గారి దగ్గర నేను అసిస్టెంట్‌గా పని చేసేవాడిని. మాది చాలా పెద్ద కుటుంబం. ఖర్చుల కోసం అడ్డదార్లు తొక్కాల్సి వచ్చేది. నాకు కథలు రాయడం రాదు. కేవలం కంప్యూటర్‌లో టైప్‌ చేసే వాణ్ణి. ఒకసారి రాజశేఖరంగారి ఒక కథా వస్తువును రచయిత సుందరం గారికి లీక్‌ చేశాను. తను అధిక మొత్తంలో డబ్బు ఇచ్చాడు. కథలకు అంత డబ్బు వస్తుందని నాకు మొదటి సారిగా తెలిసింది. ఆ కథను డెవలప్‌ చేసి సుందరం గారు ఒక నిర్మాతకు అమ్మాడు. అది సినిమాగా తీశారు. విజయం సాధించింది. ఆ కథ నాదంటూ రాజశేఖరం నిర్మాతతో గొడవకు దిగాడు. అప్పుడు నా విషయం బయట పడింది. నన్ను అందరి ముందూ తిట్టి ఉద్యోగంలో నుంచి తీసేశాడు రాజశేఖరం. సుందరంగారు నన్ను చేరదీశారు. రాజశేఖరం గారి కథలతో మూడు సినిమాలు అత్యంత ప్రజాదరణ పొందడం.. సుందరంగారి కథలతో సినిమాలు అట్టర్‌ ఫ్లాప్‌ కావడం.. ఆలోచనలో పడ్డాం. నాకు విశాల్‌ సంగతి పూర్తిగా తెలుసు. అతను మత్తు మందుకు బానిస. అది రాజశేఖరం గారికి తెలియదు. పూర్తిగా కథల్లో మునిగి పోయి విశాల్‌ గురించి పెద్దగా పట్టించుకునే వాడు కాదు. కొడుకుపై నమ్మకమెక్కువ. విశాల్‌ను బుట్టలో వేసుకున్నాను. ముందుగా కొంత మత్తుమందు ఉచితంగా ఇచ్చాను. దాంతో నన్ను పూర్తిగా నమ్మాడు. డబ్బు కోసం మీ నాన్న గారిని  బలవంత పెట్టొద్దు. ఎంత కావాలన్నా అంత  బ్రౌన్‌ షుగర్‌ నీకందిస్తారని నమ్మబలికి సుందరం గారికి పరిచయం చేశాను. రాజశేఖరం గారు కుమార్‌ సాయంతో మరి కొన్ని కథలు సిద్ధం చేస్తున్నారని విశాల్‌ ద్వారా తెలుసుకున్నాను. ఈసారి కథలతో బాటు ఏ ఆధారాలు లేకుండా ల్యాప్‌టాప్‌ను కూడా తస్కరించాలని.. సుందరం గారికి నా పథకం చెప్పాను.మరో పథకం కూడా వేసి.. సినీ జగత్తులో నాకు మరో పోటీ దారుడు లేకుండా చేయి. నీకూ పగ చల్లారినట్టు ఉంటుంది. కుమార్‌ను కూడా లేపెయ్యి. కోటి రూపాయలిస్తానని ఆశ చూపారు సుందరంగారు. కోటి రూపాయలంటే మాటలా! ఒక్క దెబ్బకు రెండు పిట్టలను పడగొట్టాలనుకున్నాను.

తను విహార యాత్రకు వెళ్లాడని తెలుసు.. ఎవరికీ అనుమానం రాదని ఆ రాత్రి రమ్మన్నాడు విశాల్‌. విశాల్‌ చెప్పిన సమయానికి వారి ఇంటికి వెళ్ళాను. విశాల్‌ నన్ను తన గదిలో కూర్చోమన్నాడు. తను రాజశేఖరం గదికి వెళ్ళి కథలు.. పర్సనల్‌ కంప్యూటర్, సెల్‌ ఫోన్‌ తెచ్చిచ్చాడు. వానిని ఒక బ్యాగులో సర్దుకొని రెండుబ్రౌన్‌ షుగర్‌ పాకెట్లిచ్చాను. దాన్ని చూడగానే ఆవురావురుమంటూ లాగించాడు విశాల్‌. అతను అలా ఒరిగి పోగానే నేను రాజశేఖరం గదిలోకి వెళ్ళి దిండు ముఖాన పెట్టి ఊపిరాడకుండా అదిమి పట్టాను. కాసేపటికి ప్రాణాలు పోయాయని నిర్ధారించుకున్నాక ‘కుమార్‌.. కుమార్‌’ అంటూ గట్టిగా పిలిచాను. కుమార్‌ వస్తున్నట్లు గమమనించి వెళ్ళి ఆల్మారా వెనుకాల దాక్కున్నాను. కుమార్‌ వచ్చి రాజశేఖరాన్ని చూస్తుంటే  సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీశాను.  కుమార్‌ రంగయ్య కోసం ఔట్‌ హౌస్‌కు పరుగెత్తడం చూసి విశాల్‌ను ఎత్తుకొని, బ్యాగు తీసుకొని బయట పడ్డాను. ఇంటికి కాస్తా దూరంగా పార్క్‌ చేసిన కారులో శంషాబాద్‌ ఫామ్‌హౌస్‌కు చేరుకున్నాను.తెల్లవారు జామున విశాల్‌ లేచాడు. కాని ఇంకా పూర్తిగా మత్తు వదలినట్లుగా లేదు. వాళ్ల నాన్న గారిని కుమార్‌ హత్య చేశాడని అనుకుంటున్నారంతా. నీవేలి ముద్రలు టీపాయ్‌ మీద పడి ఉంటాయి. విహార యాత్రకు వెళ్ళినవాడి వేలి ముద్రలెలా వచ్చాయనే అనుమానం రావచ్చు. నీ విహార యాత్ర అబధ్ధమని తేలితే నిన్నూ అరెస్టు చేయవచ్చు. ఎందుకైనా మంచిది. నువ్వు ఇప్పుడప్పుడే బయటికి వెళ్ళొద్దని భయపెట్టి.. బలవంతంగా మత్తు మందు ఇంజక్షన్‌ చేశాను. ఫొటోల ప్రింటౌట్‌లను మరుసటి రోజు ఉదయమే ఎస్సై గారి క్వార్టర్‌ గుమ్మం ముందు వేయించాను. కాని నా ఫోన్లో ఫొటోలు డిలీట్‌ చెయ్యడం మరిచాను’’ అంటూ తల దించుకున్నాడు భూషణం. ‘‘మావాళ్ళు సుందరాన్ని అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకు వస్తున్నామని ఇప్పుడే ఫోన్‌ వచ్చింది. తప్పు చేసిన వారెవరూ చట్టం నుండి తప్పించుకో లేరు. ఈ కేసులో శ్రీకర్, అనిల్‌తో బాటు కుమార్‌ గూడా నా కెంతగానో సహకరించారు. వారికి నా ధన్యవాదాలు’’ అంటూ విలేకరుల ముందు తన వినమ్రతను చాటుకున్నాడు చరణ్‌.             
- క్రైమ్‌ స్టోరీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement