న్యూఢిల్లీ: బాంబు బెదిరింపులతో యావత్ దేశం హడలిపోతోంది. విమానాలు, హోటళ్లు, విద్యాసంస్థలు.. ఇలా ప్రతిచోటా బాంబులు పెట్టినట్టు ఈమెయిల్, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బెదిరింపుల వరద ముంచెత్తుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు బాంబు బెదిరింపు హెచ్చరికలు ఎక్కువగా వస్తుండటంతో పోలీసు బృందాలు, బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేయడం.. బాంబు లేదని నిర్ధారించడం ప్రహసనంగా మారింది.
ఈనేపథ్యంలో బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పోలీసులు గుర్తించారు.ఈ బూటకపు బెదిరింపుల వెనక గోండియాకు చెందిన 35 ఏళ్ల వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు తెలిపారు. అయితే నిందితుడు గతంలో ఉగ్రవాదంపై ఓ పుస్తకాన్ని రచించడం గమనార్హం. నిందితుడిని జగదీష్ యూకీగా గుర్తించామని, ఓ కేసులో 2021లో అరెస్ట్ కూడా అయినట్లు నాగ్‌పూర్ సిటీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని. అతడిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్లు చెప్పారు.
జగదీశ్ యూకీ అనే వ్యక్తి ఇ-మెయిల్ ద్వారా పలు ఎయిర్‌లైన్స్‌లకు నకిలీ బాంబు బెదిరింపులు పంపించాడు. దీని కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీంతోపాటు ప్రధానమంత్రి కార్యాలయం, రైల్వే మంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం కార్యాలయాలతోపాటు పలు ఎయిర్‌లైన్స్ కార్యాలయాలకు, డీజీపీ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్‌పీఎఫ్)తో సహా వివిధ ప్రభుత్వ సంస్థలకు బెదిరింపు మెయిల్స్ పంపినట్లు డీసీపీ శ్వేతా ఖేద్కర్ వెల్లడించారు.
సోమవారం నాగ్‌పూర్ పోలీసులు ముంబైలోని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు సైతం బెదిరింపులు రావడంతో ఆయన నివాసం వెలుపల భద్రతను పెంచారు. తాను తెలుసుకున్న రహస్య ఉగ్రవాద కోడ్‌పై సమాచారం ఇచ్చేందుకు అవకాశం ఇవ్వకపోతే నిరసన తెలుపుతానంటూ నిందితుడు బెదిరింపు మెయిల్‌లో పేర్కొన్నాడు. ఉగ్రవాద బెదిరింపులపై తనకున్న అవగాహన గురించి చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కావాలని కూడా అభ్యర్థించారు.
Comments
Please login to add a commentAdd a comment