
నవ్విన ధాన్యరాశి: పల్లె సౌందర్యపు కథలు
కథా సంపుటి
ఏది మంచి కథ అవుతుంది? అన్న ప్రశ్నకు ఇదమిద్ధమైన జవాబు చెప్పడం కష్టమేమో కానీ కాలానికి నిలిచేది సరి అయిన కథ అని చెప్పుకోవచ్చునేమో! అందుకే ఒక కథ ప్రచురితమైనప్పుడు గొప్పగా అనిపించినా అదే కథ తర్వాతి కాలంలో అంతే అనుభూతిని ఇవ్వని సందర్భాలుంటాయి. ఆ దృష్టితో బేరీజు వేసినప్పుడు నిన్నటి తరం కథకులు సి.వేణు (అసలు పేరు సీకల వేణుగోపాల్ రెడ్డి) కథలు ఈ నాటికీ మన మనసుల్ని తట్టి పలకరిస్తున్నాయి కనుక అవి మంచి కథల కిందే లెక్క.
మధురాంతకం రాజారాం మిత్రుడయిన సి.వేణు చిత్తూరు జిల్లా రచయితల సంఘం ద్వారా సాహిత్యాన్ని పరిపుష్టం చేస్తూ వచ్చారు. ఇప్పటికీ ఎనభై ఎనిమిదేళ్ళ ముదిమి వయసులో కూడా కథ అంటే ప్రాణం పెడతారు. అందుకే ‘నవ్విన ధాన్యరాశి’ పేరుతో వారి పాతకథల్ని, తర్వాతి కాలంలో రాసిన కథల్ని సంకలనంగా తీసుకొచ్చారు. ఇటీవల రచయితల మధ్యే దాన్ని ఆవిష్కరింపజేశారు. 1962లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక కథల పోటీ నిర్వహించినప్పుడు సి.వేణు కథ ‘నవ్విన ధాన్యరాశి’ మొదటి బహుమతి పొందింది. కథ పేరు ఎంత హాయిగా వుందో కథ మాత్రం అంత విషాదం. ఒక పల్లెటూరి యువకుడికి, యువతికి మధ్య జరిగిన ప్రేమకథ ఇది. ఆ ప్రేమను సహించలేని యువతి తండ్రి కక్ష బూనటం, పంటకుప్పలని తగలబెట్టడం, తోటల్ని నరకడం చివరికి ఆ ప్రేమికులిద్దరూ అసువులు బాయటంతో కథ ముగుస్తుంది. రచయితలోని సౌందర్యదృష్టి కథకో శాశ్వతత్వాన్ని కల్పించింది. ఒకనాటి పల్లె సౌందర్యాన్ని ఈ వాక్యాలెంతగా పట్టుకుంటాయో చూడండి. ‘పడమరగా పల్లెను ఒరుసుకుంటూ పోయే కొండవాగు, గుట్టపై నుండి దట్టంగా పెరిగిన చెట్లు, మెట్లు మెట్లుగా నీలాల నింగికి నిచ్చెన నిలబెట్టినట్లు పర్వతసానువులు’... వేణు గారి వచనం కొంత గ్రాంథికం, కొంచెం కవిత్వం, కొంచెం పల్లెజనుల స్వచ్ఛమయిన భాషతో మూడుపాయలుగా సాగుతుంది.
మరొక ఆకుపచ్చని జ్ఞాపకం ‘మారెమ్మ గుడి’ కథ. భూస్వాములు పాలేర్లను ఎంతగా పీల్చి విప్పి చేసేవారో రసాత్మకంగా చెప్పే కథ. భూస్వాముల వైకుంఠపాళిలో పావుగా మారి ప్రేయసిని పోగుట్టుకున్న మల్లన్న కథ ఇది. స్వంతభూమి కోసం తపించి ఆ మట్టిలోనే కలిసిపోవాలనుకునే నారాయుడనే రైతు కూలీ చివరికి చితాభస్మంగా తను తపించిన భూమిలో విసిరివేయబడటం మనకు దుఃఖం కలిగిస్తుంది. సి.వేణు కథలన్నీ అప్పటి కాలం నాటి దౌష్ట్యాన్ని, దుఃఖాన్ని, మానవత్వాన్ని పెనవేసుకుంటూ సాగుతాయి. ప్రతికథలోనూ రచయిత ఆత్మ తొంగి చూస్తూ ఉంటుంది.
ఈతరం పాఠకులకి సి.వేణు అంటే ఎవరో తెలియకపోవచ్చు. కానీ కథలంటే ఇష్టపడే ఈ తరం పాఠకులు కొంచెం ఓపిక చేసుకుని చదవగలిగితే అచ్చమయిన పల్టె అనేది ఒకప్పుడు ఎలా ఉండేదో తెలుసుకుంటారు. అంతేకాదు రచయితలోని సౌందర్య దృష్టి కథనొక కళాత్మక చిత్రంలా ఏ విధంగా మారుస్తుందో ఆ కథలు చూసి అర్థం చేసుకుంటారు. కథ ఒక చరిత్రని ఎలా రికార్డు చేస్తుందో, ఒక పూరా జ్ఞాపకాన్ని ఎలా తవ్వితోడుతుందో కూడా తెలుస్తుంది.
ఈ పుస్తకంలో సి.వేణు కథల్ని పరిచయం చేయడానికి మధురాంతకం నరేంద్ర, పలమనేరు బాలాజీ, టి.ఎస్.ఏ. కృష్ణమూర్తి రాసిన వ్యాసాలు ఈ కథల్లోని అంతః సౌందర్యాన్ని పాఠకులకు విశదపరుస్తాయి. సి.వేణు కథల్లోనే కాదు, అన్వర్ ముఖచిత్రం వల్ల అందంగా వున్న ఈ సంకలనంలో కూడా ఒక సౌందర్యం తళుకులీనుతూ మనల్ని ఆకర్షిస్తుంది. ఒక సౌందర్య పిపాసకుడి అన్వేషణకు ప్రతిరూపం ‘నవ్విన ధాన్యరాశి’.
- సి.ఎస్. రాంబాబు 9490401005