ఈ విషయం చాలామందికి తెలీదు... | chitram bhalare vichitram brami dialogue | Sakshi
Sakshi News home page

ఈ విషయం చాలామందికి తెలీదు...

Published Mon, May 11 2015 12:15 AM | Last Updated on Sun, Sep 3 2017 1:48 AM

ఈ విషయం చాలామందికి తెలీదు...

ఈ విషయం చాలామందికి తెలీదు...

హిట్ క్యారెక్టర్
‘చిత్రం భళారే విచిత్రం’ సినిమా పేరు చెప్పగానే బ్రహ్మానందం చేసిన బ్రహ్మం పాత్ర గుర్తుకొచ్చి తీరాల్సిందే.  బ్రహ్మానందం టాప్‌టెన్ కేరెక్టర్స్‌లో ఇది కనుక పెట్టకపోయుంటే ‘నీ ఎంకమ్మా...’ అని మనం తిట్లు తినాల్సిందే!
 
చిత్రం... భళారే విచిత్రం! (1992)
డెరైక్ట్ చేసింది: పీయన్ రామచంద్రరావు
సినిమా తీసింది: ఆర్వీ విజయ్ కుమార్
మాటలు రాసింది: తోటపల్లి మధు

 
బ్రహ్మం మామూలు తిండిపోతు కాదు... వీర మహా తిండిపోతు. ఓ రకంగా బకాసురుడికి జిరాక్సు కాపీ. కిచెన్‌లోకెళ్తే ప్రపంచమే మరిచిపోతాడు. రూమ్మేట్స్‌కి వంట చేసిపెట్టడమే అతని తక్షణ కర్తవ్యం. నోరిప్పితే చాలు తిండిగోలే.
 
అనగనగా ఓ బ్యాచ్‌లర్ రూమ్.
ఓనర్ జి.గరుడాచలం కన్నుగప్పి ఇద్దరుంటామని చెప్పి నలుగురు తిష్ట వేస్తారక్కడ.
 నలుగురూ నాలుగు రకాలు. వీళ్లల్లో బూందీ బ్రహ్మానందం మాత్రం సమ్‌థింగ్ స్పెషల్. ఇంటి పేరు నిలబెట్టిన ఘనుడతడు.
 మన బ్రహ్మానికి చిర్రెత్తిపోతే చాలు...
 ‘‘మా తాతగాడు అలా చేసుండకపోతే నాకీ కర్మ పట్టి ఉండేది కాదు’’ అని ఆక్రోశిస్తుంటాడు.
 ఇంతకూ వాళ్ల తాత ఏం చేశాడో,  ఏం చేయలేదో అని తెగ క్యూరియాసిటీ వచ్చేస్తుంది కదూ.

నిజంగానే వాళ్ల తాతకు అంత దృశ్యం లేదు. వాళ్ల తాత బిర్లాలా బిజినెస్ చేసుంటే, ఈ బ్రహ్మంగాడు మైసూర్ మహారాజులాగా బతికేసేవాడట. అదండీ వాడి బాధ.
 ఈ వెధవ జీవితాన్ని... ఛండాలపు లైఫ్‌ని...
 దరిద్రపు జిందగీని ఎన్నాళ్లు అనుభవించాలన్నదే వాడి చింత. అయ్యయ్యో... అసలు విషయం మరిచిపోయాం. ఈ బ్రహ్మంగాడికి ఇంకో పిచ్చి కూడా ఉందండోయ్.
 
అది మామూలు పిచ్చి కాదు. భక్తి పిచ్చి. దేవుడు ఫొటో కనిపిస్తే చాలు పూనకం వచ్చేస్తుంది. ముద్దులు పెడుతూ... చేతులూపుతూ... చప్పట్లు కొడుతూ పులకించి పోతుంటాడు. ఇతని సంగతి తెలిసినవాళ్లకు ఓకే గానీ, తెలియని వాళ్లు మాత్రం చాలా అపార్థం చేసేసుకుంటారు. ఒకాయనైతే తన పెళ్లాన్ని పిలుస్తున్నాడనుకుని కొట్టినంత పనిచేసేశాడు.
 ఈ బ్రహ్మంగాడికి అక్క లేదు కానీ, తిక్క ఉంది. చీటికీ మాటికీ ‘నీ ఎంకమ్మా...’ అనే ఊతపదం వాడుతూ తన అసహనాన్ని టన్నుల కొద్దీ ప్రదర్శిస్తుంటాడు.
         
 దోమ కుట్టనివాడు ఎవడైనా ఉంటాడేమో కానీ, ప్రేమ కుట్టనివాడు ఎవ్వడూ ఉండడు. మన బ్రహ్మమైనా అంతే మరి.
 ఆ రోజు ఏం జరిగిందంటే -
 పార్కు దగ్గర వేరుశెనక్కాయల బండి కనబడుతుంది. నోరూరిపోతుంది మన వాడికి. పావలాకో రూపాయికో కొనుక్కుని తింటే జిహ్వ చాపల్యం తీరి చావదాయె. అందుకే హోల్‌సేల్‌గా బండి మొత్తం బేరమాడతాడు. ఈలోగా గజలక్ష్మి వచ్చి మొత్తం కొని పారేస్తుంది.
 ఆ అమ్మాయిని చూడగానే మన బ్రహ్మానికి కళ్లు చెదిరిపోతాయ్. గుండె అదిరిపోతుంది.

బాపు బొమ్మలాగా... సారీ... కుదేసిన బస్తాలాగా... ఆవిరి కుడుములాగా ఇంతటి అందం... మందం ఉన్న అమ్మాయి ఈ సిటీలో ఉందని నాకిన్నాళ్లూ తెలియలేదే అని తెగ వాపోతాడు.
 మొత్తానికి వేరుశెనక్కాయల బండి కలిపింది ఇద్దర్నీ. ఓ మంచి బెంచీ చూసుకుని... ఇద్దరూ ఎదురూ బొదురూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ వేరుశెనక్కాయలు తింటుంటారు.
 ‘‘బైదిబై... మిరియాల చారుమీద మీ అభిప్రాయం’’ అడుగుతాడు బ్రహ్మం.
 గజలక్ష్మి చాలా ముద్దుగా ‘‘బెల్లం వేస్తే ఇష్టం’’ అంటుంది.
 
‘‘ఐసీ... మరి చిక్కుడు కాయ పులుసులో టమోటా కలిపితే?’’
 ‘‘బెల్లం వేస్తే ఇష్టం’’
 ‘‘వంకాయను చీరి, కొబ్బరి కూరి లైట్‌గా నెయ్యిలో వేస్తే?’’
 ‘‘బెల్లం వేస్తే ఇష్టం’’
 ‘‘బెల్లం అంటే అంతిష్టమా?’’
 ఫైనల్‌గా అడుగుతాడు బ్రహ్మం.
 గజలక్ష్మి తన కళ్లను గారెల్లాగా తిప్పుతూ ‘‘బెల్లమంటే ప్రాణం’’ అంటుంది.
 కళ్లూ కళ్లూ ప్లస్సు... వాళ్లూ వీళ్లూ మైనస్... అన్న రీతిలో బ్రహ్మం, గజలక్ష్మిల ప్రేమ 360 చెకోడీలు, కిలోన్నర పకోడీలుగా వర్థిల్లడం మొద‘లవ్’తుంది.
         
బ్రహ్మచారులకి రూము దొరకడం గగనం కాబట్టి... ఫ్యామిలీ అని అబద్ధమాడి మన బ్రహ్మంతో సహా అతని ఫ్రెండ్స్ అందరూ తలా ఒక వేషం వేస్తారు. మన బ్రహ్మం మాత్రం మావగారి వేషం. సాదాసీదా మావగారు కాదండోయ్. మేడిన్ అమెరికా.  ‘రక్త కన్నీరు’ నాగభూషణం తరహాలో ‘‘అమెరికాలో అయితే ఓకే... ఇండియాలో అయితే ఎలా?’’ అంటుంటాడు చీటికీ మాటికీ. ఆత్మకూరు, అమలాపురం కూడా తెలీని మన బ్రహ్మంగాడు అమెరికా గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? జస్ట్ ఒకసారి ఊహించుకోండి.
 అటువైపు ప్రేమ తిప్పలు... ఇటు వైపు రూము తిప్పలు... ఫైనల్‌గా బ్రహ్మం కథ సుఖాంతమవుతుంది.బ్రహ్మంతో గజలక్ష్మి పెళ్లికి వాళ్ల నాన్న ఓకే అంటాడు. లడ్డూలో జీడిపప్పులాగా - పెసరట్టులో ఉప్మాలాగా -ఉల్లిగారెలో అల్లం చట్నీలాగా - ఇద్దరూ కలిసిపోతారు.
 దాంతో ‘శుభం’ కార్డు పడుతుంది.
- పులగం చిన్నారాయణ
 
పాపులర్ డైలాగ్
 ‘‘కొత్తావకాయా...
 అయ్యో... అదంటే నాకు ప్రాణం.
 అమెరికాలో అదే ఫాలో అయ్యేవాణ్ణి.
 బ్రేక్‌ఫాస్ట్‌లో అవకాయ బద్ద...
 లంచ్‌లో ఆవకాయ బద్ద...
 డిన్నర్‌లో ఆవకాయ బద్ద...’’
 
నా స్థాయిని పెంచిన పాత్ర
కమెడియన్‌గా నా స్థాయిని పెంచిన పాత్ర ఇది. ‘నీ ఎంకమ్మ’ అనే ఊతపదాన్ని ఇప్పటికీ జనాలు మరిచిపోలేదు. ఈ సినిమా సెకండాఫ్‌లో నేను మహానటులు నాగభూషణం గారిని ఇమిటేట్ చేశాను. ఈ సినిమా చూసి ఆయన స్వయంగా ఫోన్ చేసి మరీ మెచ్చుకున్నారు. ఆ ప్రశంసను ఎప్పటికీ మరచిపోలేను.
 - బ్రహ్మానందం
 
ఈ విషయం చాలామందికి తెలీదు...
ఓ మరాఠీ సినిమా నచ్చి, దాని ఆధారంగా సినిమా తీయాలనుకున్నారు దర్శకుడు పీఎన్ రామచంద్రరావు.  పెళ్లిసందడి, ప్రేమపురాణం నాటికలు మిక్స్ చేసి ఈ స్క్రిప్టు రాశా. ఈ  నాటికలు  రాసింది నేనే.  గిరిబాబు చేసిన డిపార్ట్‌మెంటల్ స్టోర్స్ ప్రొప్రయిటర్ పాత్ర, ‘గాడిద గుడ్డు’ అనే ఊతపదం ‘పెళ్లిసందడి’లోనిదే. ఇక ‘ప్రేమపురాణం’ నాటికను మద్రాసులో కళాసాగర్ సంస్థ ఆధ్వర్యంలో ఉగాదికి ప్రదర్శించాం.   నేను బూందీ బ్రహ్మానందం పాత్ర చేశాను. దాన్నే ఈ సినిమాలో పెట్టాం. మేం విజయవాడలో ఉన్నప్పుడు గుండు హనుమంతరావు మా దగ్గరకొచ్చి మిమిక్రీ చేసేవాడు. అందులో దేవుళ్ల పిచ్చి ఐటమ్ బాగా పేలేది. దాన్నే ఈ సినిమాలో ఉపయోగించా. ద్వితీయార్ధంలో బ్రహ్మానందం ఓల్డ్ గెటప్‌కు రావు గోపాలరావు ఇమిటేషన్ పెడదామనుకున్నారు.

నేనేమో ‘రక్తకన్నీరు’ నాగభూషణం పేరు చెప్పా. బ్రహ్మనందం కూడా రావుగోపాలరావు ఇమిటేషనే పెడదామన్నారు. దాంతో సాయిబాబా బొమ్మ ముందు రెండు చీటీలు రాసి బ్రహ్మానందంతో తీయిస్తే, నాగభూషణం పేరు వచ్చింది. ఇక్కడ నేను చేసిన చిట్కా ఏమంటే - రెండు చీటీల్లోనూ నాగభూషణం పేరే రాశాను. ఈ నాగభూషణం ఇమిటేషన్‌కు బ్రహ్మానందంకు మిమిక్రీ నాగేశ్వరరావు డబ్బింగ్ చెప్పారు. ఈ విషయం చాలామందికి తెలియదు. ‘కృష్ణా జిల్లాలో లారీ క్లీనర్లు ఎక్కువగా ‘నీ ఎంకమ్మా’ అనే ఊతపదం వాడుతుంటారు. రాజశేఖర్ నటించిన ‘పాప కోసం’లో బ్రహ్మానందంది లారీ క్లీనర్ పాత్ర. దానికి ‘నీ ఎంకమ్మా’ అనే ఊతపదం పెట్టా. ఆ సినిమా ప్లాప్ కావడంతో ఊతపదం పేలలేదు. అందుకే ఇందులో పెట్టా.
- తోటపల్లి మధు, రచయిత

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement