
భారతీయ లలిత కళలను పరిరక్షిం చడానికి కొత్త ప్రణాళికలు వేయవల సిన అవసరం ఎంతైనా ఉంది. సమాజంలో కళలకు మనుగడ లేకపోతే మానవీయ ప్రవర్తన క్రమంగా దిగ జారి పోతుంది. కళా సాహిత్య సంస్కృతులకు చేయూత నీయడం మనందరి బాధ్యత. కళా పరిరక్షణకు రెండు దారులున్నాయి. తాత్కాలిక ప్రోత్సాహం, దీర్ఘకాలిక కార్యాచరణ. కళ మానవ సమాజంలో అనివార్య అంతర్భాగం. మనుషులు మసిలే సంఘంలో కళలు సర్వదా అలరిస్తూ ఉండాలి. మానవులందరూ ఐక్యతగా, సంతోషంగా లేకపోతే ఎంత గొప్ప కళ అయినా దాని ప్రయో జనం నెరవేరదు. ప్రస్తుత పరిస్థితుల్లో కళాకారుడు బతికి బట్ట కట్టకపోతే కళ కనుమరుగయే ప్రమాదం ఉంది. అందుకే కళాకారులకు అండదండలు అందించేందుకు ఆలోచనలు చేయవలసిన అవసరముంది. నిర్మల్, కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలను కాపాడుకోవాలి. అయితే వీరు బొమ్మల తయారీకి విని యోగించే ‘పొనికి’ కర్ర లభ్యత తగ్గిపోతోంది. వేలాది మంది కళాకారుల, శ్రామికుల బతుకుదెరువు ఈ కర్రపై ఆధారపడి ఉంది. కర్ర కోసమై ప్రత్యేకంగా కొన్ని ఎకరాల్లో ఈ చెట్లను పెంపు చేయాలి.
అట్లాగే అవిభక్త అదిలాబాద్ జిల్లాలో నివసించే రెండు లక్షల అరవై వేల గోండు తదితర ఆదివాసీల కోసం సంప్ర దాయ సిద్ధంగా తయారు చేసే ‘డోక్రా’ లోహ కళాకృతుల తయారీకి ఉపయోగించే ఇత్తడి, కలప ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. అందువల్ల ఈ కళను వృత్తిగా గల ‘ఓజా’ అనే ఉపజాతివారు ఆ సంప్రదాయ వృత్తికి దూరమవుతు న్నారు. కానీ, ప్రాచీన కళలను పోగొట్టు కోవడంతో మనం గొప్ప సాంస్కృతి వైభవాన్ని కోల్పోతాం. వీటి పునఃప్రతిష్ట కోసం నవంబర్ 1 నుండి జరుగనున్న ఆరో ‘కారా’ ఉత్స వాలలో ఈ సంగీతవాద్యాలు, కళాకృతులు ప్రదర్శనకు ఏర్పాట్లు జరిగాయి. భారతదేశంలో కళాభివ్యక్తీకరణకు అనేక రూపాలు, విధానాలు ఉన్నాయి. అలాగే ప్రజల అభిరుచి, అవసరాలు కూడా అంతే వైవిధ్యంగా ఉన్నాయి. ఒక నాటి పంచాణం వారు తయారు చేసిన పనిముట్లు, కొలత పాత్రలు, విగ్రహాలు, దైవరూపాలు, కులం, తెగల సంకేతాల వంటివి ఈనాడు అపురూప కళాఖండాలుగా పరిగణించడం చూస్తున్నాం.
ఆదిమ మానవుడు ఆనాడు ఆయా పరిసరాలలోగల అటవీ జంతువుల బొమ్మలు గుహలలో చిత్రించారు. ఈనాడు అవి ఎంతో కొత్త శైలిలో కనిపిస్తాయి. ఆధునిక చిత్రరంగానికి వారసత్వపు ఊపిరినిస్తున్నాయి. అలాగే లోహ చిత్రాకృతులు, పంట పండించేప్పుడు వాడే పరికరాలు, వస్తువులు, ధాన్యం కుండలు, పూజాసామగ్రి అన్నింటిలోనూ ఆనాటి కళాత్మక వ్యక్తీకరణలు దర్శనమిస్తాయి. ఆదిలాబాద్‌లోని గోండు గిరి జనుల కోసం ‘ఓజా’ అనే చిన్న తెగదారు ‘డోక్రా’ శైలిలో ఇత్తడిని కరిగించి, మైనం సాంచాలు తీసి బొమ్మలు, విగ్ర హాలు తయారు చేస్తారు. నాలుగువేల ఏళ్ల క్రితంనాటి ఈ సంప్రదాయిక శైలి ఇప్పుడు అంతరించిపోయే ప్రమాదంలో పడింది. మన దేశంలో బెంగాల్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో తయారయ్యే ఈ కళారూపాల గురించి ఎక్కువగా తెలియదు.
ఈ ప్రదర్శనలో వీటితోపాటు తాళపత్ర గ్రంథాలు, రెండు వందల ఏళ్లనాటి చుట్టలు, విలక్షణ రాతప్రతులను కూడా ప్రదర్శిస్తున్నారు. ఇటీవలే శుష్కించిపోయిన రాతప్రతులను సరిచేయించడం జరిగింది. విభిన్న రూపాలలో, కళాత్మక తయారీలో ఉన్న గ్రంథాలను చూపించడానికిగాను ఒక ప్రత్యేక ప్రదర్శన స్థలాన్ని ఏర్పాటు చేయబడింది. గతంలోని మన లేఖన సంప్రదాయ తీరుతెన్నులను కళ్లకు కట్టినట్టు చూపే ప్రయత్నాలు సైతం జరిగాయి. తాళపత్ర గ్రంథాలు తదితర లేఖన సామగ్రి ఎంత చూడముచ్చటగా తయారు చేసేవారో తెలుసుకోవచ్చు. వీటికి తోడుగా ఏనాడూ కనీవినీ ఎరుగని మనం కోల్పోయిన లేదా అంతరించే దశలో ఉన్న ఆదివాసీ, జానపద సంగీతవాద్యాల ఆది ధ్వనులకు మూల మైన వాద్యాల ప్రదర్శన ఉంటుంది.
మన దేశంలో వాద్యం ఒక్కటే విడిగా మనలేదు. సంగీత కళాకారుడనేవాడు గురువుగా, వైద్యుడిగా, కుల సమూహ పెద్దగా చదువు వచ్చినవాడై ఉంటాడు. సంగీత వాద్యం ప్రదర్శనగా, వీరగాథగా, మౌఖిక సాహిత్యగనిగా ఉంటుంది. ఇలాంటి ఎన్నోరకాల అంశాలని చేర్చి ఒక విభాగంగా వాద్యాల ప్రదర్శన ఏర్పాటు చేయడమైనది. వీటితోపాటు సుదీర్ఘకాలం వ్యయప్రయాసలకోర్చి సుప్రసిద్ధ పరిశోధకులు ఆచార్య జయధీర్ తిరుమలరావు సేకరించిన ఎన్నో సాంస్కృ తిక, సాహిత్య అంశాలను ఇక్కడ చూడవచ్చు.
బి. నర్సన్
వ్యాసకర్త కవి, విమర్శకులు ‘ 94401 28169
(నవంబర్ 1 నుండి 8 వరకు సప్తపర్ణి, హైదరాబాద్‌లో
‘కారా’ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాల సందర్భంగా)
Comments
Please login to add a commentAdd a comment