అనుబంధం.. నిర్బంధం..
ఆయన ఆశయాలే అక్షరాలు.
ఉద్యమాల లక్ష్యాలే ఆయనకు ఊపిరి. కలం పట్టినా, గళం ఎత్తినా పాలకవర్గాల వెన్నులో చలిపుడుతుంది. విప్లవ రచయితగా జనానికి తెలిసినవరవరరావు అనుబంధం, నిర్బంధం.. సిటీతోనే. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా, ఓల్డ్‌సిటీ నివాసిగా, నగర జైళ్లలో విచారణ ఖైదీగా.. ఇలా ఎన్నో జ్ఞాపకాలకు హైదరాబాద్ వేదికైంది. ‘సిటీ ప్లస్’ పలకరింపుతో గుర్తొచ్చినవి ఆయన మాటల్లోనే..
అది 1953. నేనప్పుడు ఏడో
తరగతి చదువుతున్నాను. వరంగల్ జిల్లా చినపెండ్యాల నుంచి హైదరాబాద్ మొదటిసారి వచ్చాను. అక్క ఇంటికి వచ్చిన నేను హుస్సేన్‌సాగర్, నిజాంసాగర్ చూపించమని మా బావను అడిగాను. నిజాంసాగర్ ఇక్కడ ఉండదని చెప్పిన బావ హుస్సేన్‌సాగర్ చూపించాడు. ఆ మర్నాడు బావ ఇంకేం చూస్తావ్..? అని అడిగాడు. దాశరథి, సి. నారాయణరెడ్డిని చూపించమన్నాను.
సిటీలో అభ్యుదయం
అప్పట్లో నగరంలో ఆంధ్ర అభ్యుదయ ఉత్సవాలు ఘనంగా జరిగేవి. గొప్ప గొప్ప వాళ్లు నటించేవాళ్లు. ఈ నాటకాలను చూడ్డానికి జనం ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్లు. ఆ నాటకాలు జరిగే చోటుకు బావ నన్ను తీసుకెళ్లారు. బావకు దాశరథి సుపరిచితమే. దగ్గరకు తీసుకెళ్లి మరీ పరిచయం చేశారు. అదేసమయంలోఅక్కడికొచ్చిన సినారెను చూసి ఎంతో సంతోషించాను.
ఓయూకి వెళ్తే విద్యార్థినే..
చిన్నతనంలో అతిథిగా హైదరాబాద్ వచ్చిన నేను.. తర్వాత విద్యార్థిగా ఉస్మానియా క్యాంపస్ చేరాను. ఓయూలో పుస్తకాలే కాదు.. అక్కడి ప్రకృతి నా భావాలకు ప్రేరణ ఇచ్చింది. పచ్చని చెట్టు.. రాతి గట్టు.. పున్నాగ పూలు.. ఇవన్నీ నా కవితా వస్తువులయ్యాయి. నాలోని విప్లవ భావాలకు సిరా అద్దాయి. క్యాంపస్‌లో చిగురించిన స్నేహబంధం నా పథం అభ్యుదయం వైపు సాగేలా చేసింది. క్యాంపస్ అంటే ఎంతో గౌరవం. అక్కడికి వెళ్తే ఇప్పటికీ విద్యార్థిగానే ఫీలవుతాను.
సిటీ చుట్టొచ్చేవాళ్లం..
కాలినడకన సిటీ చుట్టి రావడం ఓ సరదా. సెలవొస్తే నగ్నముని (అప్పట్లో ఆయన కేశవరావే) వచ్చి పిలిచేవాడు. ఇద్దరం ఓయూ నుంచి బయల్దేరి కోఠి, అబిడ్స్, నాంపల్లి, అసెంబ్లీ అలా వెళ్లేవాళ్లం. ఫుట్‌పాత్‌పై అమ్మే పుస్తకాల్లో నచ్చినవి తీసుకుని రాత్రికల్లా క్యాంపస్ చేరే వాళ్లం. వారానికి కనీసం నాలుగైదు సినిమాలు చూసే వాళ్ళం. దిల్‌షాద్, రాయల్, కమల్ థియేటర్స్, సికింద్రాబాద్‌లో ప్లాజా టాకీస్.. ఏ ఒక్కటీ విడిచిపెట్టలేదు. హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ ఇలా అన్ని భాషల సినిమాలూ చూసే వాళ్లం. రూమ్‌కు వచ్చిన తర్వాత సినిమా కథ, కథనంపై చర్చలు కూడా సాగేవి. మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ఓయూలో నా రూమ్మేట్. ఇద్దరి భావాలు భిన్నంగా ఉన్నా.. మా మధ్య స్నేహ పూర్వక
చర ్చలు సాగేవి.మలక్‌పేటతో అనుబంధం
ఈ మధ్య మలక్‌పేట నుంచి ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు ఓ ముస్లిం పెద్దమనిషి నన్ను అమాంతం కౌగిలించుకుని ఏడ్చాడు. దాదాపు రెండు దశాబ్దాలు అక్కడే ఉండటంతో అందరూ ఆత్మీయంగా ఉండేవారు. ఒకసారి నాపై హత్యాయత్నం జరిగింది. ఇద్దరు వ్యక్తులు రెక్కీ చేశారు. అప్పుడూ అక్కడి ప్రజలే మమ్మల్ని అప్రమత్తం చేశారు. గతంలో విప్లవ కవులపై నిర్బంధం పెరిగిన తర్వాత.. కల్యాణ రావు, గద్దర్, నన్ను అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అప్పటికే చిలకలూరిపేట విధ్వంసంపై నాపై కేసు నమోదైంది. ఆ సమయంలో మలక్‌పేటలో ఉన్న నా ఇంటి ముందు ఒక రోజంతా రాత్రింబవళ్ళు మీడియా కాచుకుని కూర్చుంది. నేను నిద్ర లేకుండా వాళ్లతో గడిపాను. ఆ తర్వాత టాడా కేసులో అరెస్టై, నెలల తరబడి జైళ్లలో గడిపాను. ఆ సమయంలో మలక్‌పేటలోని మైనార్టీ సోదరులు, బడుగు, బలహీనవర్గాల వాళ్లే కుటుంబానికి అండగా ఉన్నారు. ఇవన్నీ మధుర జ్ఞాపకాలే.
మక్కా మసీదు అంటే ఎంతో ఇష్టం
చారిత్రక కట్టడం మక్కా మసీదు అంటే చాలా ఇష్టం. అక్కడ పావురాలకు జొన్నలు వేయడం.. అవి తింటూ రివ్వున ఎగురుతుండటం, ఆ సమయంలో వచ్చే చల్లటి గాలి, పావురాల అరుపులు నా హృదయ అంతరంగాన్ని తట్టి లేపుతాయి. బాగ్‌లింగంపల్లి చింతతోపులో నడిచిన మధుర స్మృతులు, బేగం బజార్‌లోని శంకర్ షేర్ హోటల్‌లో ఇష్టంగా చాయ్ తాగిన రోజులు, కోఠి తాజ్‌మహల్ హోటల్ వద్ద స్నేహితులతో సిద్ధాంతపరమైన చర్చలు ఇవన్నీ ఇప్పటికీ నాకు మరచిపోలేని
జ్ఞాపకాలే.