చలినెగళ్లూ.. హేమంత స్వప్నాలూ..
వరవరరావు జ్ఞాపకాల దొంతరలో ఉస్మానియా
ఉస్మానియా శత వసంతాల పండుగ సందర్భంగా వర్సిటీతో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ప్రముఖ విప్లవకవి వరవరరావు. వర్సిటీలో శ్రీశ్రీ కవిత్వం, చలం సాహిత్యం, చిమ్మచీకటినీ, నిశ్శబ్ద స్తబ్ధతను బద్దలుకొట్టుకొని తెల్లవారుతూ రాజేసిన ‘చలినెగళ్లు’.. పేదరికం అలవాటుగా మిగిల్చిన తెల్లని పైజామా లాల్చీ, నవ యువకుడి ‘హేమంత స్వప్నా’ల్లో పూచిన ‘మల్లెపూలు’.. ఇవన్నీ తన అభ్యుదయ సాహిత్య ప్రయాణానికీ, విప్లవోద్యమంతో పెనవేసుకున్న తాత్విక చింతనకూ పునాదిరాళ్లని చెప్పారు. వరవరరావు జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే..
అతిథులం.. రూమ్మేట్స్‌గా..
అంపశయ్య నవీన్‌కు నేనూ, ఎస్‌వీ రామా రావుకి జైపాల్‌రెడ్డి అనాథరైజ్డ్ గెస్ట్‌లుగా ఉస్మానియాలోకి అడుగుపెట్టాం. తర్వాత రూమ్‌మేట్స్‌మి అయ్యాం. తెలుగు ఎంఏలో సీటు రావడంతో 1960 నుంచి 1964 వరకు ఉస్మానియాలో ఉన్నా ను. ఆ సమయంలోనే నా ‘చలినెగళ్ళు’కవితా సంకలనం రాశాను. ఓయూలో ఉన్నంతకాలం శ్రీశ్రీని కలవడం, చలా న్ని చదవడం, హేమకి లేఖలు రాయడం.. ఇదే నా జీవితం. చలాన్ని విపరీతంగా చదివేవాణ్ణి. శ్రీశ్రీ నగరానికి వస్తున్నాడంటే నాకో కార్డుముక్క వచ్చేది. ఆయ న్ను మైసూర్ కేఫ్‌లో కలిసే వాళ్లం. ‘చలినెగళ్ళు’కి శ్రీశ్రీ ముందుమాట కోసం నాలుగేళ్ళు ఎదురుచూశాను. చివరకు ఆయన రాయకుండానే నా పుస్తకాన్ని అచ్చువేసుకున్నాను. ఇక హేమ (భార్య)పైన రాసిన హేమంత స్వప్నాలు ఇంకా పబ్లిష్ చేయలేదు. మల్లెపూలు కవితలు కూడా ఓయూలో రాసినవే.
మూడేళ్లు.. మూడు కవితా బహుమతులు
ఉస్మానియా ఆంధ్రా అభ్యుద య ఉత్సవాల్లో 1959–1960–1961లలో వరుసగా మూడేళ్ల పాటు కవిత్వంలో మూడు బహుమతులు సాధించా. రెండు ప్రథమ, ఒక కవితకు తృతీయ బహుమతి వచ్చింది.
పొలిటికల్ సైన్స్ చేద్దామనుకుని వచ్చి...
ఎకనమిక్స్, పొలిటికల్ సైన్స్ చేద్దామని నేను ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాను. కానీ తెలుగు ఎంఏ విభాగంలో మొదటిపేరు నాదే కావడంతో తెలుగులో చేరాను. ఎందుకంటే అలా ఎంపికైతే నాకు 80 రూపాయలు స్కాలర్‌షిప్ వస్తుంది. దాన్నే అప్పుడు బర్సర్ అనేవారు. దాంట్లో 35 రూపాయలు మెస్ చార్జీలకు, 18 రూపాయలు హాస్టల్‌కు పోను మిగిలినవి జేబు ఖర్చులకు ఉండేవి. ఇక తెలుగులో చేరితే ఉద్యోగం వస్తుందన్న ఆశ ఒకటి అటువైపుగా నడిపించింది. ఇక అంపశయ్య నవీన్ ఎంఏ తెలుగులో చేరాలనుకున్నారు. కానీ నేను వారించి ఎకనమిక్స్ చదవమన్నాను. అలా ఇద్దరం మేం చేరాలనుకున్న కోర్సుల్లో కాకుండా ఇతర సబ్జెక్టుల్లో చేరాం.
లాల్చీ, పైజమాతోనే పోల్చుకునేవారు..
పేదరికం, సింప్లిసిటీ నాకు తెల్ల లాల్చీ పైజమాలను అలవాటు చేసింది. నాకోసం ఉస్మానియాకు ఎవరైనా వస్తే.. లాల్చీ, పైజమాలో ఉన్న వ్యక్తి కావాలని అడిగేవారు.
అంతలా గుర్తింపుగా మారాయి. అప్పుడు ఎక్కువ మంది పంచె కట్టుకునేవారు. పంచె ఖరీదు కనుక నేను పైజమా వేసుకునేవాణ్ని. డిసెంబర్ 25న హేమతో నా పెళ్ళి జరిగింది (హేమంత స్వప్నం సాకారమైంది). డిసెంబర్ 24న నేను ఉస్మానియా నుంచి బయటకొచ్చాను. పెళ్లిలో మాత్రం పంచెకట్టు. అయితే ‘మల్లెపూలూ, హేమంత స్వప్నాలూ’అచ్చువేయలేదు.
విద్యార్థి సంఘాల్లో చురుగ్గా
నిజానికి నేను నెహ్రూకు వీరాభిమానిని. ఉస్మానియా తొలి విద్యార్థి సంఘం ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ ద్వారా విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నాను కూడా. రాఘవాచారి ఓయూ లా కాలేజీ అధ్యక్షుడిగా పోటీచేస్తే ఆయన తరఫున విస్తృతంగా ప్రచారం చేశాం. రాఘవాచారి స్టూడెంట్స్ యూనియన్ ఆవిష్కరణకు కృష్ణమీనన్‌ని పిలిచారు. కృష్ణమీనన్‌ను సమర్థించే వాళ్లంతా అభ్యుదయవాదులని భావించేవాళ్లు. సంఘ్‌పరివార్ వ్యతిరేక భావాలకు పునాది పడింది అక్కడే.