తిరోగమనవాదాలను తిప్పికొడదాం
ప్రగతిశీల పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో వక్తలు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పులకించింది. అప్పుడెప్పుడో ఇక్కడ ఉద్యమ పాఠాలు నేర్చి నేడు దేశరాజకీయాల్లో ఉద్దండులుగా నిలిచిన తన పూర్వ విద్యార్థుల రాకతో ఉప్పొంగి పోయింది. జనాన్ని ఉర్రూతలూగించిన ప్రజాకవులు, గాయకుల పలకరింపులతో తన్మయత్వం చెందింది. ప్రతిభాపాటవాలతో దేశవిదేశాల్లో తన ప్రతిష్టను చాటిచెప్పిన మేధావులను చూసి మురిసిపోయింది. ఈ అపూర్వ సన్నివేశం ఉస్మానియా వర్సిటీ ఠాగూర్ ఆడిటోరియం(జార్జిరెడ్డి హాల్)లో శుక్రవారం జరిగిన ప్రగతిశీల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో చోటు చేసుకుంది.
ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రగతినిరోధక, మతోన్మాద, హిందూత్వ తిరోగమన వాదాలను తిప్పికొట్టేందుకు మరింత సంఘటి తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ కె.లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్య క్రమంలో తొలి విప్లవ విద్యార్థి ఉద్యమ నాయ కుడు బూర్గుల నర్సింగరావు మాట్లాడుతూ 1948 పోలీస్ యాక్షన్ అనంతరం అత్యధిక శాతం మంది వాడే ఉర్దూ భాషకి బదులు ఆంగ్ల భాషని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఉస్మానియాలో తొలి ఉద్యమాన్ని చేపట్టామని అన్నారు.
అనేక ఉద్యమాలకు ఊతమిచ్చిన ఉస్మానియా విద్యారి ్థలోకం దేశ విద్యార్థి ఉద్యమ చరిత్రలోనే ముఖ్యపాత్ర వహించింద న్నారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ నేడు దేశవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి ఉద్యమాల ప్రభా వాన్ని తగ్గించాలనే పాలకవర్గాల కుట్రలో భాగంగా పీహెచ్‌డీ, ఎం.ఫిల్ సీట్లను కుదించి దళిత, ఆదివాసీ, మైనారిటీ విద్యార్థులను విశ్వవిద్యాలయాల్లోకి రాకుండా చేస్తున్నారన్నారు. వామపక్షపార్టీల ఐక్యతా దిశగా పయనిస్తున్నామని, త్వరలోనే దాన్ని సాధిస్తా మని అన్నారు. సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రగతిశీల ఉద్యమాలను అణచివేసే హత్యాఘటనలకు ఉస్మానియా ప్రత్యక్షసాక్షిగా నిలిచిందన్నారు.
ప్రజాగాయకులకు పుట్టినిల్లు: సత్యనారాయణ
ప్రజాగాయకులను, మహిళా ఉద్యమకారులను మన కందించిన ఉస్మానియా చరిత్ర చిరస్థాయిగా ఉంటుందని తెలుగు వర్సిటీ వీసీ ఎస్.వి. సత్య నారాయణ అన్నారు. 1969 తెలంగాణ ఉద్యమం, దళిత్ పాంథర్స్ ఉద్యమాలు స్ఫూర్తినిచ్చా యని గద్దర్ అన్నారు. గ్రామాల నుంచి పట్టణాల కొచ్చిన తాము గ్రామాలకు తరలండి అనే నినాదంతో గ్రామాలకు చేరుకున్నామని అన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీల్లో దళిత, అస్తిత్వ ఉద్యమాలు జరిగిన విధంగా తెలంగాణ పోరాటం సైతం రాజకీయాలకతీతంగా ఉస్మానియా విద్యార్థు లంతా పాల్గొన్నారని అన్నారు.
ఉస్మానియాతోపాటే బోల్షివిక్ విప్లవానికీ వందేళ్లు: వరవరరావు
విప్లవాల పురిటిగడ్డ ఉస్మానియాతోపాటే బోల్షివిక్ విప్లవానికి సైతం నూరు వసంతాలు పూర్తికావడం యాదృచ్ఛికం కాదని విరసం నేత వరవరరావు అన్నారు. బోల్షివిక్ విప్లవ స్ఫూర్తినీ, షహీద్ భగత్‌సింగ్ విప్లవ త్యాగనిరతిని పుణికి పుచ్చుకున్న చరిత్ర ఒక్క ఉస్మానియాకే దక్కిందన్నారు. ప్రజా పోరాటయోధులు మల్లోజుల, పటేల్ సుధాకర్‌లు ఉస్మానియాలా కాలేజ్ విద్యార్థులేనని, తెలంగాణ సాయుధ పోరాట పిలుపునిచ్చిన మగ్దుం మొయీనుద్దీన్, రాజ్‌బహదూర్‌గౌర్‌ల స్ఫూర్తి ఇక్కడుందని అన్నారు.
ప్రగతి శీల ఉద్యమంతో ప్రారంభమై స్త్రీల అస్తిత్వ ఉద్యమాలకు పునాదులు వేసిన సమానత్వ చరిత్ర నేటికీ స్ఫూర్తిదాయకమని ప్రగతిశీల మహిళా సంఘం వ్యవస్థాప కురాలు కె.లలిత అ న్నారు. పీడీఎస్ యూ, ఎఐ ఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, టీవీవీ, డీఎస్‌యూ, టీవీఎస్, పీడీఎస్‌యు (విజృం భణ) లాంటి ప్రగతిశీల విద్యార్థి సంఘాలన్నీ ఒకే వేదికపైకి రావడం హర్షించదగ్గ విషయమన్నారు. నాటి రష్యా బోల్షివిక్ విప్లవం వెదజల్లిన విప్లవ భావాలు నేటికీ ఇక్కడ సజీవంగా ఉన్నాయని న్యూడె మొక్రసీ నాయకుడు ప్రదీప్ అన్నారు. నాటి విద్యార్థి అమరులు జార్జిరెడ్డి, మధు సూధన్‌రాజ్, రంగవల్లి, మారోజు వీరన్నల త్యాగాలు విప్లవం పట్ల అచంచల విశ్వాసాన్ని నింపుతున్నాయని అన్నారు.