లాల్‌–నీల్‌ పోరు | CPM National Meeting Grand Success | Sakshi
Sakshi News home page

లాల్‌–నీల్‌ పోరు

Published Mon, Apr 23 2018 12:55 AM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM

CPM National Meeting Grand Success - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎర్ర జెండా, సామాజిక జెండా కలవాల్సిన అవసరం ఉందని, జై భీమ్‌–లాల్‌ సలామ్‌ కలిసినప్పుడే దేశంలో మార్పు వస్తుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. లాల్‌–నీల్‌ జెండా నీడన ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసి దేశ ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని అందిస్తామని ప్రకటించారు. మతోన్మాద ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. ఐదురోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఎం 22వ జాతీయ మహాసభల ముగింపు సందర్భంగా ఆదివారం సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఏచూరి మాట్లాడారు. దేశంలో రోజురోజుకు ఆర్థిక దోపిడీ పెరిగిపోతోందని, ఏదో చేసేస్తానని డాబు కొట్టి ప్రధాని అయిన నరేంద్రమోదీ దేశ ప్రజల జీవితాలను భారం చేశారని విమర్శించారు. దేశంలో ధరలు, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉత్పత్తి ధరకు ఒకటిన్నర రెట్లు మద్దతు ధర ఇప్పిస్తానన్న మోదీ.. ఇంతవరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదన్నారు. రైతు రుణమాఫీ కూడా అమలు చేయలేదన్నారు. ‘‘ఈ దేశంలో రుణమాఫీ జరిగింది. కానీ రైతులకు కాదు. బడా పెట్టుబడిదారులకు మాత్రమే. గత మూడేళ్లలో 3 లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడిదారులకు రుణమాఫీ చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుంది. బ్యాంకుల్లో ప్రజలు డిపాజిట్‌ చేసిన సొమ్మును రుణంగా తీసుకుని లూటీ చేస్తున్న దుస్థితి దేశంలో నెలకొంది. లలిత్‌మోదీ, నీరవ్‌మోదీ, నరేంద్రమోదీ.. ఇలా అందరు మోదీలు దేశాన్ని లూటీ చేస్తున్నారు. బ్యాంకుల లూటీ జరిగేంతవరకు దేశంలో ఇంతమంది మోదీలున్నారన్న సంగతి ప్రజలకు తెలియదు’’ అని ఏచూరి వ్యాఖ్యానించారు. దేశంలో ఆకలి చావులు పెరిగిపోతున్నాయని, నవ భారత నిర్మాతలైన యువకులకు విద్య, ఉద్యోగం, ఆరోగ్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపి తీరుతామని ప్రజలకు వాగ్దానం చేస్తున్నట్లు చెప్పారు. 

ఈ కౌరవ సేనను ఓడిస్తాం 
దేశంలో మతతత్వ రాజకీయాలు పెరిగిపోతున్నాయని ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మతంపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దుర్వినియోగం చేస్తూ అన్నదమ్ముల్లా ఉన్న హిందూ, ముస్లింల మధ్య విద్వేషాలను సృష్టించే కుట్రకు పాల్పడుతున్నారు. మతం పేరుతో అత్యాచారాలు చేసి బాధితుల పక్షాన నిలవకుండా దౌర్జన్యకారులకు వత్తాసు పలుకుతున్న దుస్థితి ఎన్నడూ లేదు. రామాయణం కథ చెప్పి రాముడి పేరుతో ఓట్లు దండుకుంటున్న బీజేపీ మహాభారతాన్ని విస్మరించింది. మహాభారతంలో కౌరవుల్లాంటి వారు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు. ఆ 100 మంది కౌరవుల్లో మోదీ, అమిత్‌షాలు దుర్యోధన, దుశ్శాసన లాంటివారు. ఆ కౌరవులకు భీష్ముడిలా, ద్రోణాచార్యుడిలా ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవహరిస్తోంది. ఈ కౌరవసేనను ఓడించే పాండవులుగా మేం పనిచేస్తాం. మతోన్మాద శక్తులను మట్టికరిపించి దేశంలో సామరస్యాన్ని కాపాడతాం’’ అని చెప్పారు. వారిది కౌరవ సైన్యమయితే తమది ప్రజాసైన్యమని అన్నారు. 

కేసీఆర్‌ ఫ్రంట్‌తో లాభమేంటి? 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంటున్న ఫెడరల్‌ ఫ్రంట్‌పై ఏచూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్రంట్‌లో చేరాలని కేసీఆర్‌ తనతో మాట్లాడారని, అయితే ఫ్రంట్‌లో చేరి ఉపయోగం ఏంటని ఆయన ప్రశ్నించారు. ‘‘వ్యక్తులు, పార్టీలను చూసి ఫ్రంట్‌లో చేరేందుకు సీపీఎం సిద్ధంగా ఉండదు. ఫ్రంట్‌ విధానాల ఆధారంగానే మేం నిర్ణయం తీసుకుంటాం’’ అని చెప్పారు. ఎన్నికల సమయంలోనే ఎత్తుగడలపై ఆలోచిస్తామన్నారు. తెలంగాణకు చెందిన ప్రముఖ కవి మగ్ధూం మొయినుద్దీన్‌ చెప్పినట్టు భాగ్యాన్ని తీసుకుని, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని, అందరినీ కలుపుకుని విజయం సాధిస్తామన్నారు. తెలంగాణలో ప్రజా ఉద్యమాలను బలపర్చడం ద్వారా భవిష్యత్‌ను నిర్మించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

రాష్ట్రంలో పూర్వ వైభవం తథ్యం 
సాయుధ పోరాట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న తెలంగాణలో ఎర్రజెండాకు పూర్వ వైభవం రావడం తథ్యమని ఏచూరి« ధీమా వ్యక్తం చేశారు. ఈ సభకు హాజరైన లక్షలాది మంది ప్రజలను చూస్తుంటే తనకు ఆ నమ్మకం కలుగుతోందని, ఈ ఊపు కొనసాగించాలని, ఈ గడ్డపై ఎర్రజెండా ఎగురవేయాలని పేర్కొన్నారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో ప్రకాశ్‌ కారత్, బృందా కారత్, రామచంద్రన్‌ పిళ్‌లై, బిమన్‌బోస్, కేరళ సీఎం పినరయ్‌ విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్‌ సర్కార్, తమ్మినేని వీరభద్రం, చెరుపల్లి సీతారాములు, మల్లు స్వరాజ్యం, పి.మధు, ఎస్‌.వీరయ్య, జి.నాగయ్య, ఎమ్మెల్యే సున్నం రాజయ్య, జూలకంటి రంగారెడ్డి, నంధ్యాల నర్సింహారెడ్డి, జి.రాములు, పాటూరి రామయ్య, పోతినేని సుదర్శన్, జ్యోతి, డి.జి.నర్సింగరావు, బి.వెంకట్, నున్నా నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement