మొక్కే కదా అని పీకేస్తే... | cinema punch in indra movie | Sakshi
Sakshi News home page

మొక్కే కదా అని పీకేస్తే...

Published Sun, May 17 2015 12:21 AM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM

మొక్కే కదా అని పీకేస్తే...

మొక్కే కదా అని పీకేస్తే...

పంచ్ శాస్త్ర
 
‘నువ్వు నాకో హీరోను చూపెట్టు. నీకు క్షణాల్లో... ట్రాజెడి రాసిస్తా’ అన్నాడొక  అమెరికన్ రచయిత. హీరో అంటే... కొండంత ధైర్యం. కొండను పిండి చేసే సాహసం. కళ్లతో శత్రువును దెబ్బతీసే నైపుణ్యం. మరి అలాంటి హీరోను పట్టుకొని ‘ట్రాజెడి రాస్తానంటాడేమిటి? కామెడీ కాకపోతే!’ అనుకోవద్దు. తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ట్రాజెడి ఎంత పండితే, హీరో ధీరత్వం, శూరత్వం అంతగా పండుతాయి. పంచ్‌లైన్‌లు అంతగా పండుతాయి.

 అటు చూడండి తన అనుచరులతో  ఇంద్రసేనారెడ్డి సునామీలా వీరశంకర్‌రెడ్డి ఇంటివైపుకు దూసుకొస్తున్నాడు. ఈ వీరశంకర్‌రెడ్డి  విషకుట్రలో... ఇంద్రసేనారెడ్డి తన కుటుంబాన్ని కోల్పోయి పుట్టెడు దుఃఖంలా మిగిలాడు. రగులుతున్న అగ్నిపర్వతంలా మిగిలాడు. ఇప్పుడు ఆ అగ్నిశిఖ శత్రువు ఇంటి ముందుకు వచ్చింది. శత్రువు ఇంటి ముందుకు ఇంద్రసేనారెడ్డి ఎందుకు వచ్చాడు? చంపేయడానికా? కాదు... ‘కన్న కొడుకును ఎందుకు చంపేశావురా?’ అని నిలదీసి నిప్పుల వర్షం కురిపించడానికి వచ్చాడు. వీరశంకర్‌రెడ్డి తన కన్నకొడుకును ఎందుకు చంపుకున్నాడు? తన కొడుకును... శత్రువైన ఇంద్రసేనారెడ్డి రక్షించినందుకు!!
  
ఇంద్రసేనారెడ్డి గర్జిస్తున్నాడు... ‘వీర  శంకర్ రెడ్డీ.... ఏం చూసి పెట్టాడురా నీకు నీ అయ్య ఆ పేరు? పసిబిడ్డను చంపుతావనా? నా మీద కనురెప్ప ఎత్తే ధైర్యమైనా లేక పసిబిడ్డ మీద కత్తి దూస్తావా?’ ఇంద్రసేనారెడ్డి భుజం మీద రక్తసిక్తదేహంతో శవమై పోయిన పసిబిడ్డ- ‘‘నాన్నా నేనేం పాపం చేశానని... చంపేశావు?’’ అని వీరశంకర్‌రెడ్డిని మౌనంగా అడుగుతున్నాడు. ఆ పసిబిడ్డ తల్లి దుఃఖసముద్రమై రోదిస్తోంది. భుజం మీద ఉన్న పసిబిడ్డ శవాన్ని రెండు చేతుల్లోకి తీసుకుంటూ ఇంద్రసేనారెడ్డి ఆ బిడ్డ తల్లితో అంటాడు ‘అమ్మా... ఈ చేతులు  కాపాడడం వల్ల నీ బిడ్డ దూరమైతే.... నన్ను క్షమించమ్మా...’

 వీరశంకర్‌రెడ్డి అరుస్తున్నాడు... ‘నా బిడ్డను నేను చంపుకున్నా...మీకేంది రా బాధ?’ వీరశంకర్‌రెడ్డి చెంప చెళ్లుమనలేదుగానీ, అంతకంటే ఎక్కువ శక్తి ఉన్న ఒక డైలాగ్ అతని చెంప చెళ్లుమనిపించలా ఇంద్రసేనారెడ్డి నోటి నుంచి దూసుకొచ్చింది... ‘నీ బిడ్డా... నువ్వు కన్నావా మోశావా?పెంచావా? రేయ్... నిన్ను పొడిస్తే అమ్మా అంటావు. ఇప్పుడు ఆ అమ్మ కడుపులోనే పొడిచావు. నీకు, నీ తమ్ముళ్లకు కత్తిగాయం ఎలా ఉంటుందో తెలుసు. ఓ తల్లికి గుండెగాయం అయితే, ఆ తల్లి పేగులకు గాయమైతే ఎలా ఉంటుందో తెలియదు. భర్త పోతే తన పసుపుకుంకుమలను పోగొట్టుకునే స్త్రీ తన బిడ్డ పోతే తన సర్వస్వం కోల్పోయి కుమిలి కుమిలి ఏడుస్తుంది చూడరా’’
 
ఆవేశస్థాయిని ఆర్ద్రత స్థాయికి తీసుకెళ్లి  ఆ తల్లి వైపు తిరిగి ఇంద్రసేనారెడ్డి అంటాడు- ‘చూడమ్మా-నీకు నీ కొడుకు ఆకారం దూరమైందేగానీ, ఆత్మ ఈ తులసి మొక్కలో ఉంది.బాగా నీళ్లు పోసి పెంచు... పెరిగే ఈ మొక్కను చూస్తే ఎదుగుతున్న నీ కొడుకు గుర్తుకు రావాలి. అతనికి తను చేసిన పాపం గుర్తుకు రావాలి. నిద్ర పోయే ముందు... నిద్ర లేచే ముందు... అన్నం తినే ముందు ఆరు బయకు పోయే ముందు.... ఆ మొక్కకు మొక్కాలి. కాదని అడ్డంగా వాదించి ఎండ బెడితే మీ అందరికీ పాడె కడతా’ ఈ మాటలతో శత్రువుల గుండెలు వణికాయి. ఆ వణుకును తారస్థాయికి తీసుకెళ్లడానికి అన్నట్లు... ఇంద్రసేనారెడ్డి వెళుతూ వెళుతూ అంటాడు -
 ‘వీర శంకర్ రెడ్డి మొక్కే కదాని పీకేస్తే పీక కోస్తా!’ పంచ్‌శాస్త్రను పరాకాష్ఠకు తీసుకెళ్లిన ఈ  డైలాగు ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement