రచయిత విషాద ‘మరణం’
ఎన్నడో 1927లో అమెరికన్ రచయిత్రి కేథరిన్ మయో ‘మదర్ ఇండియా’ పేరుతో పుస్తకం రాశారు. మూర్తీభవించిన జాత్యహంకారంతో ఆమె హిందూ మతాన్ని, సమాజాన్ని, ఈ దేశ సంస్కృతిని కించపరుస్తూ వ్యాఖ్యానాలు చేశారు. అమెరికా పౌరులు భారత స్వాతంత్య్రోద్యమాన్ని తమ దేశ విప్లవంతో పోల్చుకుంటూ మద్దతు పలుకుతున్న వేళ బ్రిటిష్ పాలకులకు ఈ పుస్తకం రావ(య)డం అవసరమైంది. వారు దాన్ని ఎంతగానో ప్రచారంచేసి తమ వలస పాలనను సమర్థించుకున్నారు. మహాత్మా గాంధీ ఈ పుస్తకాన్ని ‘డ్రైనేజ్ ఇన్‌స్పెక్టర్ రిపోర్టు’గా అభివర్ణించారు. అంతేకాదు... భారతీయులంతా ఆ పుస్తకాన్ని చదివి తీరాలని సూచించారు. మనకు నచ్చని అంశాలున్నా, మన అభిప్రాయాలతో విభేదించే విషయాలున్నా రాజ్యాంగాన్నీ, రాజ్యాంగదత్తమైన భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవించేవారంతా చేయాల్సిన పని అది. దురదృష్టవశాత్తూ దేశంలో అలాంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి రోజురోజుకూ కరువవుతున్నది. తమ మనోభావాలను దెబ్బతీశారని వీధులకెక్కి గొడవచేసి దేన్నయినా సాధించుకునే ‘మాబోక్రసీ’ విస్తరిస్తున్నది.
సామాజిక అసమానతలపైనా, దురాచారాలపైనా సమరశంఖం పూరించిన ద్రవిడ ఉద్యమ నేత పెరియార్ రామస్వామి నాయకర్ జన్మించిన తమిళనాట సైతం అలాంటి అవాంఛనీయ ధోరణులు ప్రబలుతున్నాయని సుప్రసిద్ధ తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ చేసిన ప్రకటన వెల్లడిస్తున్నది. నూటపాతికేళ్ల క్రితంనాడు ఉందంటున్న ఒక ఆచారం ప్రధానాంశంగా చేసుకుని ఆయన రాసిన ‘మధోరుభాగన్’ నవలపై హిందుత్వ సంస్థలు, కొన్ని కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేసి దాన్ని నిషేధించాలని, ఆ రచయితను అరెస్టు చేయాలని కొన్నాళ్లుగా ఆందోళన సాగిస్తున్నాయి. ఆయనపై పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. స్థానికంగా బంద్‌లు జరిగాయి. తన రచన ఈనాటి సమాజానికి సంబంధించినది కాదని... అందులో పేర్కొన్న ఆచారాలను, సంప్రదాయాలను ఇప్పటి ప్రమాణాలతో పోల్చిచూడటం తగదని పెరుమాళ్ చేసిన వినతి అరణ్యరోదనే అయింది.
జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన ‘శాంతి సంఘం’ సమావేశంలో నవలలోని వివాదాస్పద భాగాలను తొలగించడానికి అంగీకరించిన తర్వాత ‘రచయిత పెరుమాళ్ మురుగన్ మరణించాడు. ఇకపై పి. మురుగన్ అనే సాధారణ టీచర్ మాత్రమే మిగులుతాడు’ అంటూ ఫేస్‌బుక్ మాధ్యమంద్వారా ఆయన ఉంచిన ప్రకటన అందరినీ కలవరపరిచింది. సృజనాత్మక రంగంనుంచి తాను శాశ్వతంగా తప్పుకుంటున్నానని చెప్పడంతోపాటు తనను ఇకపై ఎలాంటి సాహితీ సమావేశాలకూ పిలవొద్దని, ఒంటరిగా విడిచిపెట్టాలని మురుగన్ విన్నవించుకున్నారు. నిరసనలకు, ఆందోళనలకు నాయకత్వంవహించినవారికి స్వప్రయోజనాలున్నాయని... తనను లక్ష్యంగా ఎంచుకోవడానికి కారణాలున్నాయని మురుగన్ అంతక్రితం మీడియాతో మాట్లాడినప్పుడు చెప్పిన అంశాలు అవాస్తవం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు వివాదానికి కారణమైన నవల తమిళ భాషలో అచ్చయి నాలుగేళ్లవుతున్నది. దాని ఇంగ్లిష్ అనువాదాన్ని పెంగ్విన్ ప్రచురణల సంస్థ నిరుడు వెలువరించింది. అది ప్రముఖ విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వస్తుందని కూడా పలువురు సాహితీవేత్తలు భావించారు. ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన కొంగునాడు ప్రాంతం సంగతి అటుంచి తమిళనాట ఎక్కడా ఇన్నేళ్లుగా దాన్ని నిషేధించాలని కోరినవారు లేరు. ఉన్నట్టుండి పుట్టుకొచ్చిన ఉద్యమం వెనక ఉద్దేశాలున్నాయని మురుగన్ అన్నది ఇందుకే.
రచయితలైనా, కళాకారులైనా సమాజాన్ని విమర్శనాత్మకంగా ప్రతిబింబిస్తారు తప్ప లేనిది సృష్టించలేరు. ఏకదంత ప్రాకారంలో సృజన ప్రభవించదు. ఈ విషయాన్ని గ్రహించలేనివారే అనవసర ఆవేశాలకు పోయి రాతపైనో, గీతపైనో విరుచుకుపడతారు. కొన్నేళ్లక్రితం తన పెయింటింగ్‌లపై పెను వివాదం రేగినప్పుడు ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ తీవ్రంగా కలతచెంది ఈ గడ్డపై మళ్లీ అడుగుపెట్టబోనని ప్రతినబూని వెళ్లిపోయారు. ఆయన మరో దేశంలో తనువు చాలించారు. బీజేపీ సీనియర్ నాయకుడు జశ్వంత్‌సింగ్ ‘జిన్నా:భారత్ విభజన, స్వాతంత్య్రం’ అనే గ్రంథం వెలువరించి మహ్మదాలీ జిన్నా పెట్టిన పాకిస్థాన్ డిమాండు రాజకీయపరమైనదని, అందులో ఉన్న మతస్పర్శ ఆయన ఉద్దేశించని పరిణామమని తేల్చిచెప్పారు. అప్పుడు కూడా పెద్ద వివాదం తలెత్తింది.
ఆయనకు కనీసం షోకాజు నోటీసు కూడా ఇవ్వకుండా పార్టీనుంచి బహిష్కరించారు. ఆయన ఇటీవల అనారోగ్యానికి గురయ్యేముందు మళ్లీ ఆ పార్టీలో చేరారు....అది వేరే విషయం. ‘మతముల న్నియు మాసిపోవును... జ్ఞానమొక్కటె నిలిచివెలుగును’ అన్నాడు మహాకవి గురజాడ. ఆయన రాసిన ‘కన్యాశుల్కం’ నాటకంలో సాంఘిక దురాచాలను పెంచిపోషిస్తున్నవారిపైనా, అలాంటివారి ఆచార వ్యవహారాలపైనా తీవ్ర విమర్శలున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే దాన్ని నిషేధించాలంటూ ఉద్యమం నడిచేదేమో!
‘కన్యాశుల్కం’ రచననాటికీ, ఇప్పటికీ పోల్చి చూసుకుంటే మనం ముందుకు నడిచామో, కొన్ని యుగాలు వెనక్కుపోయామో అర్థంగాని స్థితి. ఫ్రాన్స్‌లో ‘చార్లీ హెబ్డో’ పత్రికపై ఉగ్రవాదులు దాడికి తెగబడి కార్టూనిస్టులు, జర్నలిస్టుల ప్రాణాలు తీస్తే ఇక్కడ ఆ పని చేయకుండానే ఒక వ్యక్తి ‘రచయితగా నేను మరణించాన’ని చెప్పే స్థితికి తీసుకొచ్చారు. తమిళనాట ఇప్పుడు పరిపాలన సాగిస్తున్న అన్నా డీఎంకే, విపక్షంగా ఉన్న డీఎంకే... పెరియార్ రామస్వామి నాయకర్ ద్రవిడ ఉద్యమ నేపథ్యంలో ఉద్భవించినవి. ప్రస్తుత వివాదంలో ఆ పార్టీలు రెండూ తటస్థతను పాటించడంద్వారా పెరియార్ స్ఫూర్తికి తాము యోజనాల దూరంలో ఉన్నామని నిరూపించు కున్నాయి. ఫలితంగా ఒక రచయిత గొంతు నులమదల్చుకున్నవారిదే పైచేయి అయింది. ఇది విచారకరమైన విషయం.