అమెరికావాళ్ళ మర్యాదలు అతిక్రమిస్తే కష్టాలు ! | Guide To American Culture And Etiquette | Sakshi
Sakshi News home page

అమెరికావాళ్ళ మర్యాదలు అతిక్రమిస్తే కష్టాలు !

Published Thu, May 2 2024 1:53 PM | Last Updated on Thu, May 2 2024 5:52 PM

Guide To American Culture And Etiquette

ఆకలికి ఏదో ఒక ఆహారం తింటేసరి అని మనం అనుకుంటాం. చాలావరకు ఆ తినేదేదో రుచికరంగా ఉంటే చాలని కోరుకుంటాం అందరం. ఆఖరికి సన్యాసులు, పశుపక్ష్యాదులైనా!.. ఉత్త అన్నంమెతుకులే వేస్తే..కుక్కయినా సరే ముఖం చిట్లించేస్తుంది. ఏదో ఓ కూర కలిపి వేస్తే కాస్తయినా రుచి చూస్తుంది. అదే చికెన్, మటన్ లాంటిదైతే కృతజ్ఞతగా తోక కూడా ఊపుతూ మరీ లాగించేస్తుంది. మనం చెట్టుమీదున్న పండు అక్కడికక్కడ తెంపుకొని గబుక్కున తినేస్తాం మనం. కానీ అమెరికావాళ్ళకు ‘ ఏమి తింటున్నాం అనేదానికన్నా ఎలా తినాలి ’ అన్నది చాలా ముఖ్యం. 

చేతితో మాత్రం ముట్టరు..
వాళ్ళు అదే పండును శుభ్రంగా కడిగి, ప్లేట్ లో పెట్టుకొని, ఎడమ చేతిలో ఫోర్క్, కుడి చేత చాకు పట్టుకొని కోసి తినడాన్నే ఇష్టపడతారు. అది శాఖాహారమైనా మాంసాహారమైనా చేతితో మాత్రం ముట్టుకోరు . ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చిన కొత్తలో.. నేను పనిచేస్తున్న సంస్థ మార్కుఫెడ్ వారు ,సహకార శిక్షణలో భాగంగా మూడు మాసాల కోసం నన్ను బెంగుళూరు పంపారు. అక్కడి మెస్సులో భోజనాల దగ్గర బయటి రాష్ట్రాల మిత్రులను చూసి పట్టిన ‘ చెంచా ’ అలవాటును నేను ఇప్పటికీ వదలడం లేదు. మా ఇంట్లో ఈ కొత్త అలవాటును చూసి ‘ ఇదేం చెంచాగిరి ’ అని వెక్కిరించినా, ఆతర్వాత వాళ్లే అర్థం చేసుకున్నారు.

అలా చేస్తే అమర్యాద కింద లెక్క..
ఎటైనా బయటికి వెళ్తున్నామంటే చాలు ఎందుకైనా మంచిదని ఒకటి రెండు చిన్న చెంచాలు బ్యాగులో పెట్టేవారు. అమెరికాలో ఆతిథ్యం విషయంలో ఎన్నో కొత్త విషయాలు గమనించవచ్చు. వాళ్ళు ఆహ్వానించినప్పుడు వస్తామని రాకపోవడం, ఆలస్యంగా వెళ్లడం అమర్యాద కిందే లెక్క. అతిథులకు ముందు నాప్కిన్స్ పెడితే మనం చేతి, మూతి తుడుచుకొని పక్కకు పడేస్తాం. కానీ దాన్నే అమెరికన్స్ బట్టలు పాడుకాకుండా ఉండడానికి పైన వేసుకుంటారు. డైనింగ్ టేబుల్ దగ్గర మనను ఆహ్వానించిన గృహస్తు అందరికీ వడ్డించి, తాను తినడం ప్రారంభించాకనే వచ్చిన అతిథులు తినడం, వైన్ లాంటి డ్రింక్ ఇస్తే గ్లాస్ పైకి లేపి ‘ చీర్స్ ’ చెప్పడం అక్కడి వారి మర్యాద (etiquette ). అంతేకాదు నోరు మూసుకొని తినాలంటారు వారు, లొట్టలేసుకుంటూ శబ్దంచేస్తూ తినడం, తింటూ తింటూ మాట్లాడడం, దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా, ముక్కు చీదాల్సి వచ్చినా రెస్ట్ రూంకు వెళ్లకుండా అక్కడే కూర్చోవడం, వాళ్లకు అస్సలు నచ్చని విషయాలు.

కచ్చితంగా థాంక్స్‌ చెప్పడం వంటివి..
ఏదైనా కావాలనుకుంటే ముందు ‘ప్లీజ్ ’ జతచేసి అడగడం, వాళ్ళు అది మీకు వడ్డించినప్పుడు ‘ థాంక్స్ ’ చెప్పడం విధిగా పాటించాల్సిన మర్యాదలు. ముందు గబగబా ప్లేట్ నింపుకొని తర్వాత తినలేక అవస్థపడి వదిలేసినా అక్కడ బాగోదు సుమా! ఎంత అవసరమో.. అంతే వడ్డించుకుని అది తిన్న తర్వాత మళ్లీ పెట్టుకోవడం అక్కడ గమనించిన విషయం. ఫుడ్‌ వేస్టేజ్‌ను చాలా మంది అమెరికన్లు ఒప్పుకోరు. భోజనం తర్వాత బ్రేవుమని త్రేన్చితే అతిథి దేవుడు తృప్తిపడ్డట్టు మనం భావిస్తాం . వాళ్ళ లెక్కలో అదీ శబ్దకాలుష్యమే. 

అమెరికావాళ్ళు తెలివిగలవాళ్ళు. లంచ్, డిన్నర్లే కాదు బ్రేక్ ఫాస్ట్‌లను కూడా వాళ్ళ కుటుంబ, వ్యాపార వ్యవహారాలు చక్కదిద్దుకోడానికి వాడుకుంటారు. క్లాసుమేట్స్‌తో కలిసి ఇంటికి వచ్చిన మా మనవరాలు స్నేహితురాలయిన ఒక తెల్లపిల్లను చూసి ‘ నీకన్నా చాల పెద్దదానిలా ఉందే ఈ అమ్మాయి ’ అన్నాను పొరపాటున. మా గ్రాండ్ డాటర్ చెవి పిండకుండానే నా చెవిలో చెప్పిన రహస్యం ‘ యూ ఎస్ లో ఎప్పుడూ ఎవరి ఏజ్ ప్రస్తావన తేవద్దు , వాళ్ళ పెళ్ళి గురించి , పిల్లల గురించి అస్సలు మాట్లాడొద్దు జాగ్రత్త ! 
వేముల ప్రభాకర్‌

(చదవండి: తెలుగు సాహిత్యంలో సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు: తానా ఈవెంట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement