
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ రచయిత్రి సి. ఆనందరామం గురువారం ఉదయం హైదరాబాద్ వెస్ట్ మారెడ్‌పల్లిలోని స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె అసలు పేరు ఆనంద లక్షి్మ. భర్త రామం పేరును తన పేరు చివర జోడించి రచయిత్రి సి.ఆనందరామంగా తెలుగు సాహిత్య లోకంలో రాణించారు. 1935, ఆగస్టు 20వ తేదీన ఏపీలోని పశి్చమగోదావరి జిల్లా ఏలూరులో ఆమె జని్మంచారు. 60 నవలలు, 100కు పైగా కథలు, కొన్ని విమర్శనా గ్రంథాలను రాశారు. ఆమె రాసిన నవల ఆత్మబలి... సంసార బంధం పేరుతో సినిమాగా, అదే నవల జీవన తరంగాలు పేరిట టీవీ సీరియల్‌గా వచ్చింది. జాగృతి నవలను త్రిశూలం సినిమాగా, మమతల కోవెల నవలను జ్యోతి సినిమాగా తీశారు. ఏలూరులోని ఈదర వెంకటరామారెడ్డి స్కూలులో ప్రాథమిక విద్యను అభ్యసించారు.
ఇంటర్ వరకు మామూలుగా చదివి బీఏ డిగ్రీని ప్రైవేటుగా పూర్తి చేశారు. అనంతరం సీఆర్‌ఆర్ కాలేజీలో తెలుగు ట్యూటర్‌గా కొన్నాళ్లు పనిచేశారు. 1957లో వివాహం అయ్యాక ఆమె హైదరాబాద్‌కు మకాం మార్చారు. 1958–60లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ. తెలుగు చదివారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి గైడ్‌గా పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందారు. హోంసైన్స్ కాలేజీ, తర్వాత నవజీవన్ కాలేజీలో కొంతకాలం పనిచేశాక 1972లో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చేరి ప్రొఫెసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. సుమారు 30 మంది విద్యార్థులు ఆమె ఆధ్వర్యంలో పీహెచ్‌డీ చేశారు. 2000 సంవత్సరంలో పదవీ విరమణ పొందారు.
ఎన్నో అవార్డులు..
గృహలక్ష్మి స్వర్ణకంకణం 1972, మాలతీ చందూర్ స్మారక అవార్డు 2013, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు 1979 (తుఫాన్ నవలకు), మాదిరెడ్డి సులోచన బంగారు పతకం 1997, తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు రెండు పర్యాయాలు, సుశీలా నారాయణరెడ్డి పురస్కారం, గోపీచంద్ పురస్కారం, అమృతలత జీవన సాఫల్య పురస్కారాలు ఆమెను వరించాయి. ఆమె మృతితో ఒక శకం ముగిసిందని, శాశ్వతంగా గుర్తుండిపోయే రచనలు చేసిన ఆనందరామంకు అశ్రు నివాళి.. అని పలువురు కవులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment