హిందువులు పవిత్రంగా ఆరాధించే వినాయకుడిని కించపరుస్తూ పుస్తకం రాసిన రచయిత యోగీష్ మాస్టర్‌ను బెంగళూరులోని కలాసీపాళ్య పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
బెంగళూరు, న్యూస్‌లైన్ : హిందువులు పవిత్రంగా ఆరాధించే వినాయకుడిని కించపరుస్తూ పుస్తకం రాసిన రచయిత యోగీష్ మాస్టర్‌ను బెంగళూరులోని కలాసీపాళ్య పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఇటీవల ఇతను రాసిన డుండీ అనే పుస్తకం విడుదలైంది. ఈ పుస్తకంలో వినాయకుడిని కించపరిచేలా చాలా అంశాలున్నాయంటూ నాలుగు రోజులుగా హిందూ ధార్మిక సంఘాల నాయకులు ఆందోళనలు చేస్తున్నారు. రచయితపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పలువురు డిమాండ్ చేశారు.
మత ఘర్షణలు ప్రేరిపించేలా ఉన్న పుస్తకాన్ని వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. ఆందోళనపై స్పందిస్తూ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు నగర అడిషనల్ పోలీస్ కమిషనర్ కమల్‌పంత్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే యోగీష్ మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలంటూ కళాసీపాళ్య పోలీస్ స్టేషన్‌లో హిందూ సంఘ నాయకుడు ప్రణవానంద రామస్వామి ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం సాయంత్రం జ్ఞానభారతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసముంటన్న యోగీష్ మాస్టర్‌ను ఆయన ఇంటిలో ఉండగా అరెస్ట్ చేశారు. కాగా, ఈ అరెస్ట్‌ను కొందరు రచయితలు స్వాగతించగా, మరి కొందరు ఖండించారు. యోగీష్ మాస్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, డుండీ పుస్తకాన్ని నిషేధించాలంటూ ఈ సందర్భంగా శ్రీరామసేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్ డిమాండ్ చేశారు.