China Largest Data Leak: China President Xi Jingping Intension Exposed, Details Inside - Sakshi
Sakshi News home page

China Data Leakage: ప్రతీపనిపై నిఘానే! కోట్ల మంది డాటా లీక్‌.. జిన్‌పింగ్‌ గూడుపుఠాణి

Published Mon, Jul 4 2022 4:44 PM | Last Updated on Mon, Jul 4 2022 5:45 PM

China Data Leakage Expose Xi Jingping Intention - Sakshi

వ్యక్తిగత సమాచార సేకరణ అంటూ ప్రకటనలు ఇస్తు‍న్న  చైనా ఆంత్యర్యం ఏంటో ఇప్పుడు..

హ్యాకర్ల చేతిలో కోట్ల మందికి చెందిన కీలక సమాచారం.. దీనంతటికి కారణం చైనా అధికార యంత్రాంగ నిర్లక్ష్యం. అంతర్జాతీయ సమాజం నుంచి వెల్లువెత్తుతున్న ఆరోపణలపై నోరు మెదపకుండా ఉండిపోయింది డ్రాగన్ సర్కార్‌‌. చైనా పోలీస్‌, భద్రతా వర్గాల డేటాను హ్యాక్‌ చేసిన హ్యాకర్లు.. ఏకంగా బిలియన్ల మంది వ్యక్తిగత సమాచారం తమ గుప్పిట్లో ఉందంటూ ప్రకటించడం డ్రాగన్‌ కంట్రీని కలవరపెడుతోంది. అదే సమయంలో చైనాలో వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ప్రయత్నాలపైనా చర్చ(రచ్చ) మొదలైంది.

ఏ దేశంలో అయినా.. ప్రజానుమతులతో వ్యక్తిగత సమాచార సేకరణ ఉంటుంది. గుర్తింపు కోసం(మన దేశంలో ఆధార్‌లాగా) జరిగే సర్వసాధారణ వ్యవహారమే ఇదంతా. కానీ, జి జింగ్‌పిన్‌ సర్కార్‌ చేపట్టిన.. డాటా సేకరణ వెనుక అసలు ఉద్దేశాని న్యూయార్క్‌ టైమ్స్‌ బట్టబయలు చేసింది. అంతేకాదు ఆ డాటాను సేకరించేందుకు వ్యవహరిస్తున్న తీరుపైనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పుడు. 

పౌరుల ఐడెంటిటీ కోసమే వ్యక్తిగత సమాచార సేకరణ అంటూ ప్రకటించుకున్న చైనాకు.. అసలు ఉద్దేశం వేరే ఉందని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. చైనాలో సామాజిక స్థిరత్వం తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వాన్ని ముప్పుగా పరిణమించే అంశమేదైనా దృష్టికి వస్తే.. వెంటనే దానిని అడ్డుకునేందుకు, అవసరమైతే అడ్డు తొలగించేందుకు ఈ డేటాను ఉపయోగిస్తోంది జింగ్‌పిన్‌ సర్కార్‌. అయితే ఇది సంఘ విద్రోహుల అణిచివేత అనడం కంటే.. హక్కుల కోసం  నిలదీసేవాళ్లను అణచివేయడంగా పేర్కొనడం సరైందని సదరు కథనం హైలైట్‌ చేసింది.

2020లో.. చైనాకు చెందిన ఓ మహిళ వివాహం చేసుకునేందుకు హాంకాంగ్‌ వెళ్లేందుకు ప్రభుత్వం నుంచి అనుమతికి దరఖాస్తు చేసుకుంది. అయితే.. కాబోయే భర్తను తాను ఇదివరకే చాలాసార్లు కలుసుకున్నానని ఆమె చెప్పడం.. పలు అనుమానాలకు తావు ఇచ్చింది.  సర్వేయిలెన్స్‌ సాఫ్ట్‌వేర్‌ అదంతా అబద్ధం అని తేల్చింది. దీంతో అప్రమత్తం అయిన చైనా పోలీసులు..  ఆమెను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఆపై దర్యాప్తులో మైగ్రేషన్‌ పర్మిట్‌ కోసమే ఆమె నాటకం ఆడిందన్న విషయం వెలుగు చూసింది. ఈ కేసు మాత్రమే కాదు.. పిరమిడ్‌ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని, ఓ ఉద్యమవేత్తను, ఓ నటిని.. ఇలా ఎంతో మందిని కేవలం నిఘా ద్వారానే అప్రమత్తమై నిలువరించగలిగింది చైనా ప్రభుత్వం.  

జిన్‌పింగ్‌ ప్రభుత్వంలో అభద్రతా భావం నానాటికి పెరిగిపోతోంది. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్‌ పరిస్థితులతో వ్యతిరేకత మరింతగా పెరిగిపోయింది.  ఈ నేపథ్యంలో ముప్పును ముందుగా పసిగట్టి.. అణిచివేసేందుకు నాలుగు రకాలుగా పౌరుల వ్యక్తిగత సమాచార సేకరణ జరుగుతోంది. 

1. సీసీటీవీ కెమెరాలు.. దేశంలో నలుమూలలా, దాదాపు ప్రతీ ఇంటిలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ప్రత్యేకించి కరోనా టైంలో ఇది ఎక్కువైంది. 

2. ఫోన్‌ ట్రాకర్స్‌.. ప్రజల డిజిటల్‌ జీవితాలను నిరంతరం పర్యవేక్షించేలా ఫోన్‌ ట్రాకింగ్‌ డివైజ్‌లను ఉపయోగించడం మొదలుపెట్టింది. తద్వారా వాళ్ల గుర్తింపులతో పాటు కదలికలను సైతం పర్యవేక్షిస్తోంది. 

3. డీఎన్‌ఏ శాంపిల్స్‌.. నేర చరిత్ర ఉన్నా లేకున్నా.. సాధారణ పౌరుల నుంచి సైతం డీఎన్‌ఏ శాంపిల్స్‌ సేకరణ చేపట్టింది చైనా. 

4. అర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్సీ.. నేరాలను గుర్తించేందుకు, ప్రమాదాలను పసిగట్టి దగ్గర్లోని భద్రతా సిబ్బంది అప్రమత్తం చేసేందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తోంది చైనా. 

అయితే చైనా ప్రజల వ్యక్తిగత జీవితాలపైనా.. ఈ నిఘా ప్రభావం చూపెడుతోంది. అనుమతులు లేకుండా ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూడడం.. అనైతికం మాత్రమే కాదు అన్యాయం కూడా. అలాగే.. ఈ సమాచార సేకరణ కోసం సాంకేతికత కోసం ప్రజాధనాన్ని ఇష్టానుసారం ఖర్చు పెడుతోంది. నిఘా ఆరోపణలను ఏనాడూ ఒప్పుకోని చైనా.. ఇప్పుడు కోట్ల మంది డేటా హ్యాకర్ల బారినపడడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నా మన్నుతిన్న పాములా గమ్మున ఉంటోంది. కీలక సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కడంతో.. దానిని విడిపించుకునేందుకు గప్‌చుప్‌గా బేరసారాలకు దిగిందన్నది పలు అంతర్జాతీయ మీడియా సంస్థల కథనం. ఇంకోవైపు ఐరాస మానవ హక్కుల సంఘ విభాగం జోక్యం చేసుకోవాలంటూ పలు దేశాలు కోరుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement