Surveillance systems
-
China: జిన్‌పింగ్ గూడుపుఠాణి.. డాటా లీక్ కలకలం
హ్యాకర్ల చేతిలో కోట్ల మందికి చెందిన కీలక సమాచారం.. దీనంతటికి కారణం చైనా అధికార యంత్రాంగ నిర్లక్ష్యం. అంతర్జాతీయ సమాజం నుంచి వెల్లువెత్తుతున్న ఆరోపణలపై నోరు మెదపకుండా ఉండిపోయింది డ్రాగన్ సర్కార్. చైనా పోలీస్, భద్రతా వర్గాల డేటాను హ్యాక్ చేసిన హ్యాకర్లు.. ఏకంగా బిలియన్ల మంది వ్యక్తిగత సమాచారం తమ గుప్పిట్లో ఉందంటూ ప్రకటించడం డ్రాగన్ కంట్రీని కలవరపెడుతోంది. అదే సమయంలో చైనాలో వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ప్రయత్నాలపైనా చర్చ(రచ్చ) మొదలైంది. ఏ దేశంలో అయినా.. ప్రజానుమతులతో వ్యక్తిగత సమాచార సేకరణ ఉంటుంది. గుర్తింపు కోసం(మన దేశంలో ఆధార్‌లాగా) జరిగే సర్వసాధారణ వ్యవహారమే ఇదంతా. కానీ, జి జింగ్‌పిన్ సర్కార్ చేపట్టిన.. డాటా సేకరణ వెనుక అసలు ఉద్దేశాని న్యూయార్క్ టైమ్స్ బట్టబయలు చేసింది. అంతేకాదు ఆ డాటాను సేకరించేందుకు వ్యవహరిస్తున్న తీరుపైనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పుడు. పౌరుల ఐడెంటిటీ కోసమే వ్యక్తిగత సమాచార సేకరణ అంటూ ప్రకటించుకున్న చైనాకు.. అసలు ఉద్దేశం వేరే ఉందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. చైనాలో సామాజిక స్థిరత్వం తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వాన్ని ముప్పుగా పరిణమించే అంశమేదైనా దృష్టికి వస్తే.. వెంటనే దానిని అడ్డుకునేందుకు, అవసరమైతే అడ్డు తొలగించేందుకు ఈ డేటాను ఉపయోగిస్తోంది జింగ్‌పిన్ సర్కార్. అయితే ఇది సంఘ విద్రోహుల అణిచివేత అనడం కంటే.. హక్కుల కోసం నిలదీసేవాళ్లను అణచివేయడంగా పేర్కొనడం సరైందని సదరు కథనం హైలైట్ చేసింది. 2020లో.. చైనాకు చెందిన ఓ మహిళ వివాహం చేసుకునేందుకు హాంకాంగ్ వెళ్లేందుకు ప్రభుత్వం నుంచి అనుమతికి దరఖాస్తు చేసుకుంది. అయితే.. కాబోయే భర్తను తాను ఇదివరకే చాలాసార్లు కలుసుకున్నానని ఆమె చెప్పడం.. పలు అనుమానాలకు తావు ఇచ్చింది. సర్వేయిలెన్స్ సాఫ్ట్వేర్ అదంతా అబద్ధం అని తేల్చింది. దీంతో అప్రమత్తం అయిన చైనా పోలీసులు.. ఆమెను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఆపై దర్యాప్తులో మైగ్రేషన్ పర్మిట్ కోసమే ఆమె నాటకం ఆడిందన్న విషయం వెలుగు చూసింది. ఈ కేసు మాత్రమే కాదు.. పిరమిడ్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని, ఓ ఉద్యమవేత్తను, ఓ నటిని.. ఇలా ఎంతో మందిని కేవలం నిఘా ద్వారానే అప్రమత్తమై నిలువరించగలిగింది చైనా ప్రభుత్వం. జిన్‌పింగ్ ప్రభుత్వంలో అభద్రతా భావం నానాటికి పెరిగిపోతోంది. ముఖ్యంగా కరోనా లాక్డౌన్ పరిస్థితులతో వ్యతిరేకత మరింతగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ముప్పును ముందుగా పసిగట్టి.. అణిచివేసేందుకు నాలుగు రకాలుగా పౌరుల వ్యక్తిగత సమాచార సేకరణ జరుగుతోంది. 1. సీసీటీవీ కెమెరాలు.. దేశంలో నలుమూలలా, దాదాపు ప్రతీ ఇంటిలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ప్రత్యేకించి కరోనా టైంలో ఇది ఎక్కువైంది. 2. ఫోన్ ట్రాకర్స్.. ప్రజల డిజిటల్ జీవితాలను నిరంతరం పర్యవేక్షించేలా ఫోన్ ట్రాకింగ్ డివైజ్‌లను ఉపయోగించడం మొదలుపెట్టింది. తద్వారా వాళ్ల గుర్తింపులతో పాటు కదలికలను సైతం పర్యవేక్షిస్తోంది. 3. డీఎన్ఏ శాంపిల్స్.. నేర చరిత్ర ఉన్నా లేకున్నా.. సాధారణ పౌరుల నుంచి సైతం డీఎన్ఏ శాంపిల్స్ సేకరణ చేపట్టింది చైనా. 4. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ.. నేరాలను గుర్తించేందుకు, ప్రమాదాలను పసిగట్టి దగ్గర్లోని భద్రతా సిబ్బంది అప్రమత్తం చేసేందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తోంది చైనా. అయితే చైనా ప్రజల వ్యక్తిగత జీవితాలపైనా.. ఈ నిఘా ప్రభావం చూపెడుతోంది. అనుమతులు లేకుండా ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూడడం.. అనైతికం మాత్రమే కాదు అన్యాయం కూడా. అలాగే.. ఈ సమాచార సేకరణ కోసం సాంకేతికత కోసం ప్రజాధనాన్ని ఇష్టానుసారం ఖర్చు పెడుతోంది. నిఘా ఆరోపణలను ఏనాడూ ఒప్పుకోని చైనా.. ఇప్పుడు కోట్ల మంది డేటా హ్యాకర్ల బారినపడడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నా మన్నుతిన్న పాములా గమ్మున ఉంటోంది. కీలక సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కడంతో.. దానిని విడిపించుకునేందుకు గప్‌చుప్‌గా బేరసారాలకు దిగిందన్నది పలు అంతర్జాతీయ మీడియా సంస్థల కథనం. ఇంకోవైపు ఐరాస మానవ హక్కుల సంఘ విభాగం జోక్యం చేసుకోవాలంటూ పలు దేశాలు కోరుతున్నాయి. -
కాళేశ్వరం పరిధిలో 17 చోట్ల హెలిప్యాడ్లు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో నిర్మిస్తున్న బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్ల పరిధిలో హెలిప్యాడ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయాచోట్ల ఎలాంటి క్లిష్ట పరిస్థితులున్నా వాటిని వీలైనంత వేగంగా చక్కదిద్దేందుకు, అవసరమైన సిబ్బందిని తరలించేందుకు వీలుగా హెలిప్యాడ్ల నిర్మాణం చేయాలని సూచించారు. దీనికి అనుగుణంగా ప్రాజెక్టు ఇంజనీర్లు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్హౌస్లుసహా కొండపోచమ్మ సాగర్ వరకు మొత్తంగా 17 చోట్ల రెండేసి చొప్పున 34 హెలిప్యాడ్ల నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టుల్లోని ప్రతి ప్యాకేజీ వద్ద హెలిప్యాడ్, స్టాఫ్ క్వార్టర్స్, సమాచార, సీసీ కెమెరాల వ్యవస్థలు ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రూ.44.53 కోట్లతో వీటి నిర్మాణం చేపట్టనుంది. ప్రస్తుతం కాళేశ్వరం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఖరీఫ్ నుంచే గోదావరి వరద నీటిని వీలైనంత ఎక్కువగా ఎత్తిపోయాలని ప్రభత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా పనులు పూర్తవుతున్నాయి. మేడిగడ్డ వద్ద గోదావరి వరద గరిష్టంగా గతంలో 28 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. అంటే ఏకంగా 244 టీఎంసీల నీరు ఒకేసారి వచ్చే అవకాశం ఉంటుంది. ఎల్లంపల్లి వద్ద సైతం గతంలో 20 లక్షల క్యూసెక్కుల మేర వరద వచ్చిన సందర్భాలున్నాయి. ఈ సమయంలో వరద నిర్వహణ, నియంత్రణ, గేట్ల ఆపరేషన్ అత్యంత కీలకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి బ్యారేజీ వద్ద వరదపై పర్యవేక్షణ, పంపులు, మోటార్ల నిర్వహణ, విద్యుత్ వ్యవస్థల నిర్వహణకు సిబ్బంది నిర్మాణ ప్రాంతంలోనే ఉండాల్సిన అవసరం ఉంది. బ్యారేజీల వద్ద నది ప్రవాహం ఎంత ఉధృతంగా ఉన్నప్పటికీ, ఎంత భారీ వర్షం కురిసినప్పటికీ ప్రాజెక్టు నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగని రీతిలో హైఫ్లడ్ లెవల్‌కు చాలాఎత్తులో వాచ్ టవర్, సిబ్బంది క్వార్టర్లు ఉండాలని ఇటీవలి సమీక్షల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ప్రస్తుతమున్న హెచ్ఎఫ్ఎల్ కాకుండా ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత వచ్చే హెచ్‌ఎఫ్‌ఎల్‌ను పరిగణనలోకి తీసుకుంటూ ఈ నిర్మాణాలు చేయాలని సూచించారు. ప్రతి దగ్గర సబ్ డివిజన్ కార్యాలయం, స్టాఫ్ క్వార్టర్స్, సీసీ కెమెరాలు, సమాచార వ్యవస్థల నిర్మాణం చేయనున్నారు. వీటికి మొత్తంగా 44.53 కోట్లు అవసరం ఉంటుందని లెక్కగట్టారు. ఈ వ్యయాలకు త్వరలోనే పరిపాలనా అనుమతి రానుంది. -
'సీసీ కెమెరాలతో నేరాల నివారణ'
రంగారెడ్డి: సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని నేరాలను నివారించవచ్చని ఎల్బీనగర్ ఏసీపీ వేణుగోపాల్‌రావు తెలిపారు. 'సీసీ కెమెరాల ఏర్పాటు-నేరాల నివారణ' అంశంపై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం రాత్రి నాగోలులోని కోఆపరేటివ్ బ్యాంకు కాలనీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల కాలనీకి కొత్తగా వచ్చే వ్యక్తులను గుర్తు పట్టవచ్చని, నేరాల సంఖ్య తగ్గించవచ్చని పేర్కొన్నారు. దీంతో స్మార్ట్ అండ్ సేఫ్ కాలనీగా మార్చుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా తమ ప్రాంతంలో 28 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేందుకు కాలనీవాసులు ముందుకు వచ్చారు.