జిన్‌పింగ్‌కు మూడోసారి పట్టం! | A third term for China president Xi Jinping as Communist Party General Secretary | Sakshi
Sakshi News home page

జిన్‌పింగ్‌కు మూడోసారి పట్టం!

Published Sat, Oct 15 2022 4:44 AM | Last Updated on Sat, Oct 15 2022 4:44 AM

A third term for China president Xi Jinping as Communist Party General Secretary - Sakshi

జన చైనా అధినేతగా షీ జిన్‌పింగ్‌(69)ను వరుసగా మూడోసారి ఎన్నుకొనేందుకు రంగం సిద్ధమయ్యింది. మరో ఐదేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగడం ఖాయమే. అన్నీ అనుకున్నట్లు జరిగితే జీవితకాలం పదవిలో ఉండేలా అధికార చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ(సీపీసీ) తీర్మానాన్ని ఆమోదించినా ఆశ్చర్యం లేదు. పార్టీ దివంగత నేత మావో జెడాంగ్‌ తర్వాత మూడుసార్లు చైనా అధ్యక్షుడిగా గద్దెనెక్కిన నాయకుడిగా జిన్‌పింగ్‌ రికార్డు సృష్టించబోతున్నారు.

కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ సదస్సు ఈ నెల 16న జరుగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిన్‌పింగ్‌ జాగ్రత్తగా ‘ఎన్నిక చేసిన’ 2,296 మంది ప్రతినిధులు పాల్గొంటారు. వీరంతా జిన్‌పింగ్‌కు మరోసారి పట్టంకడతారు. ప్రపంచ శక్తిగా ఎదగాలని తహతహలాడుతున్న డ్రాగన్‌ దేశంపై అమెరికాతోపాటు పశ్చిమ దేశాలు గుర్రుగా ఉన్నాయి. చైనా దూకుడును అడ్డుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో జిన్‌పింగ్‌ వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికవుతుండడం ఆసక్తికరంగా మారింది.  

’పదేళ్ల పదవీ కాలం’ విధానానికి మంగళం  
చైనాలో ’పదేళ్ల పదవీ కాలం’ అనే నిబంధనకు కాలం చెల్లబోతోంది. ఇన్నాళ్లూ ’రెండు పర్యాయాలు.. ఒక్కోటి ఐదేళ్లు’ అనే విధానం కఠినంగా అమలయ్యింది. అంటే ఒక అధ్యక్షుడు పదేళ్లకు మించి అధికారంలో కొనసాగడానికి వీల్లేదు. ఏకైక రాజకీయ పార్టీ ఉన్న చైనాలో ఏక వ్యక్తి ఆధిపత్యం అరాచకానికి దారితీస్తుందన్న అంచనాతో ఈ విధానం ప్రవేశపెట్టారు. మావో జెడాంగ్‌ మినహా జిన్‌పింగ్‌ కంటే ముందు అధికారంలో ఉన్న అధ్యక్షులంతా దీనికి కట్టుబడి ఉన్నారు.

మావో జెడాంగ్‌ 1976 దాకా అధికారంలో కొనసాగారు. పాలనలో తన బ్రాండ్‌ అయిన ’జెడాంగ్‌ ఆలోచన’ను అమలు చేశారు. పెట్టుబడిదారులపై కఠిన ఆంక్షలు విధించారు. సాంస్కృతిక విప్లవం వంటి ప్రయోగాలు చేశారు. జెడాంగ్‌ పాలనలో చైనా దాదాపు దివాలా దశకు చేరుకుంది. అనంతరం సర్వోన్నత నాయకుడిగా పేరుగాంచిన డెంగ్‌ జియావోపింగ్‌ అధికారంలోకి వచ్చారు.

మావో విధానాలకు మంగళం పాడుతూ తనదైన ఆర్థిక విధానాలకు తెరతీశారు. ఆర్థికాభివృద్ధికి బాటలు వేశారు. ఒకే వ్యక్తి సుదీర్ఘ కాలంలో అధికారంలో ఉంటే దేశానికి ముప్పేనన్న అంచనాతో ’పదేళ్ల పదవీ కాలాన్ని, 68 ఏళ్ల వయోపరిమితిని’ ప్రవేశపెట్టారు. 1982లో జరిగిన సీపీసీ 12వ జాతీయ సదస్సులో వీటికి ఆమోదం లభించింది. ఆ తర్వాత జియాంగ్‌ జెమిన్, హూ జింటావో అధికారంలోకి వచ్చారు. వారి హయాంలోనే చైనా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.

‘నూతన మావో’ జిన్‌పింగ్‌  
31953 జూన్‌ 15న జన్మించిన షీ జిన్‌పింగ్‌ 2008 నుంచి 2013 వరకూ హూ జింటావో హయాంలో చైనా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2012లో చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అటు పిమ్మట సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌(సీఎంసీ) చైర్మన్‌గా మారారు. 2013 మార్చి 14న ‘పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా’ 7వ అధినేతగా బాధ్యతలు చేపట్టారు.

అప్పటినుంచి నిరాటంకంగా కుర్చీని అధిరోహిస్తున్నారు. సైన్యం, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ పూర్తిగా జిన్‌పింగ్‌ నియంత్రణలోకి వచ్చాయి. మూడున్నర దశాబ్దాల తర్వాత ‘వన్‌ లీడర్‌’ పాలన మొదలయ్యింది. పదేళ్ల పదవీ కాలం నిబంధన ప్రకారం 2023లో ఆయన పాలన ముగిసిపోవాలి. కానీ, ‘నూతన మావో’ కావాలన్నది జిన్‌పింగ్‌ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని ఆయన సాధించినట్లేనని చెప్పుకోవచ్చు.   

► జిన్‌పింగ్‌ మరింత శక్తివంతమైన నాయకుడిగా అవతరించబోతున్నారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పదేళ్లలో అధికారాన్ని జిన్‌పింగ్‌ కేంద్రీకృతం చేశారు. పార్టీపై, ప్రభుత్వంపై పట్టు సాధించారు. మాజీ అధినేతలతో పోలిస్తే ఎక్కువ అధికారాలను అనుభవిస్తున్నారు.  
► జిన్‌పింగ్‌కు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన తండ్రి జోంగ్‌షున్‌ జైలుపాలయ్యారు. నగరాలు, పట్టణాల్లో ఉన్న యువత గ్రామాల్లో రైతులతో కలిసి జీవించాలని మావో ఆదేశించడంతో 1969లో జిన్‌పింగ్‌ షాన్‌షీ ప్రావిన్స్‌లోని ఓ మారుమూల పల్లెకు చేరుకున్నారు. అక్కడ ఓ గుడిసెలోనే ఆరేళ్లపాటు జీవనం సాగింది.   
► పల్లె జీవితం తర్వాత జిన్‌పింగ్‌ బీజింగ్‌లోని తిసింగ్‌హువా యూనివర్సిటీలో చేరారు. స్కాలర్‌షిప్‌తో చదువుకున్నారు. తర్వాత చైనా రక్షణశాఖలో మూడేళ్లపాటు పనిచేశారు. 1985లో ఫుజియాన్‌ ప్రావిన్స్‌లోని షియామెన్‌ నగర ఉపమేయర్‌గా ఎన్నికయ్యారు. 2000 సంవత్సరం నాటికి ఆదే పావిన్స్‌ గవర్నర్‌గా ఎదిగారు. ఆ తర్వాత సౌత్‌ ఆఫ్‌ బీజింగ్‌ కౌంటీ కమ్యూనిస్ట్‌ పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
► 2002లో జెజీయాంగ్‌ ప్రావిన్స్‌లో పార్టీ చీఫ్‌గా, 2007లో షాంఘైలో పార్టీ కార్యదర్శిగా వ్యవహరించారు. పార్టీ పొలిట్‌బ్యూరోలో శక్తివంతమైన స్టాడింగ్‌ కమిటీలో సభ్యుడిగా చేరారు.  
► చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ పేరును ప్రతిపాదిస్తూ 2012లో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో తీర్మానాన్ని ఆమోదించారు.   
► తైవాన్‌ విషయంలో అంతర్జాతీయంగా విమర్శలను ఎదుర్కొంటున్నారు. తైవాన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ చైనాలో కలిపేసుకుంటామని జిన్‌పింగ్‌ చెబుతున్నారు.   
► చైనాలో ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం, మీడియాపై ఆంక్షలు సర్వసాధారణంగా మారాయి.   
► హాంకాంగ్‌లో శాంతియుత నిరసనలను కఠినంగా అణచివేశారు.  
► జిన్‌పింగ్‌ అమల్లోకి తీసుకొచ్చిన ‘జీరో–కోవిడ్‌’ పాలసీపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. లాక్‌డౌన్లు కాదు, స్వేచ్ఛ కావాలంటూ జనం నినదిస్తున్నారు.   
        

– నేషనల్‌ డెస్క్, సాక్షి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement