న్యూయార్క్ : ప్రస్తుతం అమెరికా, చైనాల మధ్య సంబంధాలు అంతగా బాగాలేవనే చెప్పాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్‌కు పరోక్షంగా చైనానే కారణమంటూ పదే పదే ఆరోపించడం తెలిసిందే. ఈ సందర్భంగా అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ ట్రంప్‌ను ఉద్ధేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019లో జి-20 సమావేశంలో వాణిజ్య చర్చల సందర్భంగా అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలిచేందుకు సహాయం అందించాలంటూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను విజ్ఞప్తి చేశారంటూ పేర్కొన్నారు. బోల్టన్ తాను రాసిన రూమ్ వేర్ ఇట్ హ్యాపెన్డ్ పుస్తకం ప్రివ్యూలో భాగంగా అమెకరికన్ మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించేందుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సహాయాన్ని ట్రంప్ కోరినట్లు ఆయన ఆరోపించారు. అమెరికా రైతులకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులను చైనా కొనుగోలు చేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు బోల్టన్ తన పుస్తకంలో తెలిపారు. శ్వేతసౌధాన్ని ఎలా నడుపాలన్న దానిపై ట్రంప్‌కు ఎటువంటి క్లారిటీ లేదన్నారు. (భారత్-చైనా మధ్య కీలక చర్చలు)
ఒసాకాలో జూన్ 29, 2019న జరిగిన జి-20 సమావేశంలో వాణిజ్య అంశాలకు సంబంధించి ఇద్దరు దేశాధినేతలు సమావేశమై చర్చించారు. ఈ సమయంలోనే వారిద్దరి మధ్య ఈ అంశం వచ్చిందని పేర్కొన్నారు. ట్రంప్ వాణిజ్య అంశాలను చర్చిస్తూనే ఆశ్చర్యకరంగా రాబోయే యుఎస్ అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సంభాషణను మార్చారు. చైనా యొక్క ఆర్ధిక సామర్థ్యాన్ని సూచిస్తూనే తాను గెలవడానికి పరోక్షంగా సహకరించాలంటూ జిన్‌పింగ్‌తో విజ్ఞప్తి చేసినట్లు బోల్టన్ పుస్తకంలో రాసుకొచ్చాడు. అంతేగాక ట్రంప్ జిన్‌పింగ్‌ను చైనాలోనే అత్యంత శక్తివంతమైన నేతగా అభివర్ణించాడంటూ పేర్కొన్నారు.
దీనిపై డొమొక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ స్పందిస్తూ..' పుస్తకంలో పేర్కొన్నట్టుగా ట్రంప్ ఆ వాఖ్యలు చేసుంటే నిజంగా క్షమించరానిది. ఇది నైతికంగా అవాస్తవమే కాక అమెరికా ప్రయోజనాలను పరిరక్షించడంతో పాటు విలువలను కాపాడుకోవడంలో ట్రంప్ విఫలమయ్యారు.' అంటూ చురకలంటించారు. కాగా రానున్న నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా డొమొక్రాటిక్ తరపున జో బిడెన్ ట్రంప్‌తో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.
అమెరికా ప్రభుత్వ జాతీయ సలహాదారుడిగా బోల్టన్.. ఏప్రిల్ 2018 నుంచి ఆ ఏడాది సెప్టెంబర్ వరకు పనిచేశారు. ఆ తర్వాత ఆయన రాజీనామా చేశారు. ట్రంప్ విధానాలను వ్యతిరేకించిన బోల్టన్.. శ్వేతసౌధాన్ని విడిచి వెళ్లారు. కానీ బోల్టన్‌ను తానే సాగనంపినట్లు ట్రంప్ చెబుతున్నారు. బోల్టన్ చట్టాన్ని ఉల్లంఘించారని, అందుకే ఆయన్ను తొలగించినట్లు ట్రంప్ తెలిపారు. బోల్టన్ రాసిన పుస్తకాన్ని రిలీజ్ చేయకుండా ఉండేందుకు ట్రంప్ ప్రభుత్వం అడ్డుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బోల్టన్ రాసిన రూమ్ వేర్ ఇట్ హ్యాపెన్డ్ అనే 577 పేజీల పుస్తకం జూన్ 23(మంగళవారం) మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment