మాస్కో: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు రష్యాలో ఘనస్వాగతం లభించింది. మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆయన సోమవారం రష్యా రాజధాని మాస్కోకు చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. అవధులు లేని తమ స్నేహాన్ని మరింత పెంపొందించుకోవడానికి ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు ఇరువురు నేతలు ప్రకటించారు. రష్యాపై దండయాత్రకు దిగిన రష్యాను ఒంటరిని చేసేందుకు పశ్చిమ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తుండడం, యుద్ధ నేరాల ఆరోపణల కింద పుతిన్‌కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంటు జారీ చేసిన చేసిన నేపథ్యంలో జిన్‌పింగ్ రష్యా పర్యటన ప్రారంభించడం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది.
శాంతి చర్చల కోసం పుతిన్‌పై ఒత్తిడి!
ప్రపంచంలో రెండు బలమైన దేశాల అధినేతలు జిన్‌పింగ్, పుతిన్ సోమవారం చర్చలు ప్రారంభించారు. ప్రధానంగా ఉక్రెయిన్–రష్యా యుద్ధం, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. జిన్‌పింగ్, పుతిన్ మధ్య ముఖాముఖి చర్చల తర్వాత ఇరుదేశాల నడుమ ప్రతినిధుల స్థాయి చర్చలు ప్రారంభమవుతాయని రష్యా ప్రభుత్వ అధికారి యురీ ఉషాకోవ్ చెప్పారు. ఇద్దరు నాయకుల చర్చలు మంగళవారం కూడా కొనసాగుతాయని రష్యా మీడియా వెల్లడించింది. జిన్‌పింగ్ చైనా అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత రష్యాలో పర్యటిస్తుండడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. వరుసగా మూడోసారి చైనా అధ్యక్షుడిగా, సైనికాధిపతిగా ఎన్నికైన తర్వాత జిన్‌పింగ్ తొలి విదేశీ పర్యటన కూడా ఇదే.
ఉక్రెయిన్–రష్యా మధ్య శాంతి నెలకొనాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు జిన్‌పింగ్ చెప్పారు. ఉక్రెయిన్ సంక్షోభానికి తెరదించడమే లక్ష్యంగా శాంతి చర్చల కోసం పుతిన్‌పై ఆయన ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బద్ధశత్రువులైన ఇరాన్, సౌదీ అరేబియా ఇటీవలే చేతులు కలిపాయి. దీని వెనుక చైనా దౌత్యం ఉంది. గత పదేళ్లుగా చైనా అధ్యక్షుడిగా పదవిలో కొనసాగుతూ ఇటీవలే మూడోసారి ఎన్నికైన జిన్‌పింగ్ రష్యాతో సన్నిహిత సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో రష్యా వైఖరిని ప్రపంచంలో చాలా దేశాలు తప్పుపట్టినప్పటికీ జిన్‌పింగ్ మాత్రం పరోక్షంగా మద్దతు ప్రకటించారు. అమెరికా వ్యతిరేకతే చైనా, రష్యా దేశాలను ఒక్కటి చేస్తోంది.
శాంతి ప్రణాళికతో వచ్చా: జిన్‌పింగ్
చైనా, రష్యా కలిసికట్టుగా ముందుకెళ్తున్నాయని, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నాయని జిన్‌పింగ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. థర్డ్ పార్టీని తాము లక్ష్యంగా చేసుకోవడం లేదన్నారు. రెండు పెద్ద దేశాల సంబంధాల విషయంలో ఒక కొత్త మోడల్‌ను అభివృద్ధి చేస్తున్నామని ఉద్ఘాటించారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన ఇంటర్నేషనల్ సిస్టమ్, ఇంటర్నేషనల్ లా పరిరక్షణ కోసం రష్యాతో కలిసి పని చేస్తూనే ఉంటామని జిన్‌పింగ్ తేల్చిచెప్పారు. ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధానికి ముగింపు పలికేలా శాంతి ప్రణాళికతో రష్యాకు వచ్చానన్నారు. ఉక్రెయిన్‌లో సంక్షోభాన్ని పరిష్కరించే విషయంలో చైనా చేసిన ప్రతిపాదనలను నిశితంగా పరిశీలిస్తున్నామని పుతిన్ తెలిపారు. దీనిపై జిన్‌పింగ్‌తో చర్చిస్తానని పేర్కొన్నారు. పలు అంతర్జాతీయ వ్యవహారాలు, సంక్షోభాల విషయంలో చైనా నిష్పాక్షిక, సమతూక వైఖరి అవలంబిస్తోందని పుతిన్ ప్రశంసించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో జిన్‌పింగ్ మాట్లాడే అవకాశమున్నట్లు సమాచారం. తన శాంతి ప్రణాళికను జెలెన్‌స్కీతో ఆయన పంచుకోనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment