తమ సీక్రెట్ సర్వీస్ పనేనని ప్రకటించుకున్న ఉక్రెయిన్
మాస్కో: రష్యా రాజధానిలోని మాస్కోలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో రష్యా ఆర్మీ సీనియర్ జనరల్ మృత్యువాతపడ్డారు. ఆర్మీ అణు, జీవ, రసాయన భద్రతా విభాగం చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్(54) మంగళవారం కార్యాలయానికి వెళ్లేందుకు తన నివాసం ఆవరణలోని కారు వద్దకు రాగా ఆ పక్కనే స్కూటర్‌లో అమర్చిన బాంబు పేలింది. ఘటనలో కిరిల్లోవ్‌తోపాటు ఆయన సహాయకుడు కూడా ప్రాణాలు కోల్పోయారు.
దీని వెనుక తమ సీక్రెట్ సర్వీస్(ఎస్‌బీయూ) హస్తముందని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. సోమవారం జనరల్ కిరిల్లోవ్‌పై పలు నేరారోపణలను సంధించిన ఎస్‌బీయూ, మరునాడే ఈ చర్యకు పాల్పడటం గమనార్హం. ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు ముందుకు సాగుతున్న వేళ తాజా పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయి న్‌లో రష్యా పాల్పడు తున్న దారుణాల్లో కిరిల్లోవ్ కీలకంగా ఉన్నారంటూ కెనడా, బ్రిటన్ తదితర దేశాలు ఆయనపై ఆంక్షలు విధించాయి.
ఉక్రెయిన్ ఆర్మీపై నిషేధిత రసాయన ఆయుధాల వినియోగానికి కిరిల్లోవ్ ఆదేశాలే కారణమని సోమవారం ఎస్‌బీయూ ఆరోపణలు చేసింది. ‘కిరిల్లోవ్ యుద్ధ నేరస్తుడు, తమ న్యాయబద్ధమైన లక్ష్యం’ అంటూ వ్యాఖ్యానించింది. 2022 ఫిబ్రవరిలో రష్యా దురాక్రమణ మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రంలో 4,800 పర్యా యాలకుపైగా రష్యా రసాయన ఆయుధాలను ప్రయోగించినట్లు ఎస్‌బీయూ ఆరోపిస్తోంది. మొదటి ప్రపంచ యుద్ధంలో వాడిన క్లోరోపిక్రిన్ అనే విష వాయువును ఉక్రెయిన్ బలగాలపై రష్యా ప్రయోగించినట్లు అమెరికా అంటోంది. ఈ ఆరోపణలను రష్యా తీవ్రంగా ఖండించింది.
తగు రీతిలో ప్రతీకారం తప్పదు
జనరల్ కిరిల్లోవ్‌ను చంపేందుకు స్కూటర్‌లో అమర్చిన బాంబును రిమోట్‌తో పేల్చినట్లు గుర్తించామని రష్యా అధికారులు చెప్పారు. రష్యా దీనిని ఉగ్రవాద చర్యగా పేర్కొంది. ఉక్రెయిన్‌ను తగు రీతిలో దండిస్తామని ప్రకటించింది. అధ్యక్షుడు పుతిన్ సారథ్యంలోని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదెవ్ స్పందిస్తూ..సైనిక వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఉక్రెయిన్ ఈ చర్యకు పాల్పడిందన్నారు. ఆ దేశ సైనిక, రాజకీయ నాయకత్వం ప్రతీకార చర్యలను ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు. గతంలోనూ ఇటువంటి దాడుల్లో పలువురు రష్యా ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. వీటికి ఉక్రెయినే కారణమని రష్యా నిందించింది.
🛑Breaking🛑
Senior Russian General Igor Kirillov, head of Russia’s NBC defense forces, killed in a scooter bomb explosion in Moscow (Dec 17). pic.twitter.com/Zn9hhzuz3D— Taymur Malik (@Taymur918) December 17, 2024
Comments
Please login to add a commentAdd a comment