India-Russia relations: మాస్కోలో మోదీ.. నేడు పుతిన్‌తో చర్చలు | India-Russia relations: PM Narendra Modi meets President Putin for private dinner at Presidential Palace | Sakshi
Sakshi News home page

India-Russia relations: మాస్కోలో మోదీ.. నేడు పుతిన్‌తో చర్చలు

Published Tue, Jul 9 2024 6:29 AM | Last Updated on Tue, Jul 9 2024 6:29 AM

India-Russia relations: PM Narendra Modi meets President Putin for private dinner at Presidential Palace

నేడు పుతిన్‌తో మోదీ చర్చలు 

22వ ఇండో–రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సుకు సిద్ధమైన అగ్రనేతలు 

మాస్కో/న్యూఢిల్లీ: భారత్, రష్యాల మైత్రీ బంధాన్ని నూతన సమున్నత శిఖరాలకు చేర్చడమే లక్ష్యంగా ప్రధాని మోదీ రెండ్రోజుల రష్యా పర్యటన ఆరంభమైంది. 22వ ఇండో–రష్యా శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మోదీ సోమవారం రష్యాకు విచ్చేశారు. మంగళవారం ఉదయం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్, భారత ప్రధాని మోదీ అల్పాహారం అనంతరం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. విస్తృతస్థాయి చర్చలు జరపనున్నారు.

 తర్వాత దౌత్య, అధికారిక బృందాలతో కలిసి వార్షిక శిఖరాగ్ర సదస్సులో ఇరుదేశాల మధ్య పటిష్ట మైత్రి, సహకార బంధంపై సమగ్ర, లోతైన చర్చలు జరపనున్నారు. ఉక్రెయిన్‌ను రష్యా దురాక్రమించిన అంశం చర్చకొచ్చే అవకాశముంది. రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా భారతీయులను రిక్రూట్‌ చేసుకుని ఉక్రెయిన్‌ యుద్ధక్షేత్రాలకు తరలించిన ఉదంతాలు చర్చకొచ్చే అవకాశముంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌ యుద్ధం మొదలయ్యాక మోదీ రష్యాకు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

మోదీకి పుతిన్‌ విందు...
మాస్కో శివారులోని నోవో–ఒగార్యోవో అధికార నివాసంలో మోదీని పుతిన్‌ సాదరంగా ఆహా్వనించారు. ఆప్యాయంగా ఇరునేతలూ హత్తుకున్నారు. ఈ సందర్భంగా రాత్రి మోదీకి పుతిన్‌ ప్రత్యేక విందు ఇచ్చారు. మోదీ పాలనలో భారత్‌ సాధించిన అభివృద్ధిని పుతిన్‌ ఈ సందర్భంగా కొనియాడారు.  అంతకుముందు‡మాస్కో విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి రష్యా మొదటి ఉపప్రధాని డెనిస్‌ మాన్‌ట్సురోవ్‌ సాదర స్వాగతం పలికారు. 

అక్కడే మోదీ రష్యా సైనికుల సైనికవందనం స్వీకరించారు. ది కార్ల్‌టన్‌ హోటల్‌ల్లో మోదీకి పెద్దసంఖ్యలో భారత సంతతి ప్రజలు స్వాగతం పలికారు. హిందీ పాటలకు భారతీయులు, రష్యా కళాకారులు నృత్యంచేస్తూ మోదీని ఆనందంలో ముంచెత్తారు.  ‘ఇప్పుడే మాస్కో నేలపై అడుగుపెట్టా. మిత్రుడు పుతిన్‌తో భేటీకి ఎదురుచూస్తున్నా. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకోబోతున్నా. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతల స్థాపనకు ఇరువురం మా వంతు కృషిచేస్తాం’’ అని మోదీ ‘ఎక్స్‌’లో పోస్ట్‌చేశారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement