సమర్‌ఖండ్: ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌ఖండ్ నగరంలో ఫాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, చైనా అధినేత షీ జిన్‌పింగ్ తదితర నేతలు హాజరయ్యారు.
ఎస్సీఓ సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఒకే వేదికపై కనిపించారు. గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణల తర్వాత వీరిద్దరూ అంతర్జాతీయ వేదికను పంచుకోవడం ఇదే తొలిసారి. అయితే చైనా అధ్యక్షుడికి ప్రధాని మోదీ దూరం దూరంగా ఉన్నారు. వేదికపై ఫోటో దిగే సమయంలో ఇద్దరు నేతలు పక్కపక్కనే నిల్చున్నప్పటికీ కనీసం నవ్వలేదు. ఇరువురు కరచాలనం(షేక్‌హ్యండ్) కూడా చేసుకోలేదు. శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతలు పరస్పరం వ్యవహరించిన దూరం చూస్తుంటే భారత్-చైనా సరిహద్దు వివాదం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక ఈ సదస్సులో ప్రాంతీయ భద్రతా సవాళ్లు, వ్యాపార-వాణిజ్యం, ఇంధన సరఫరా వంటి కీలక అంశాలపై చర్చించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ఈ సదస్సు ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా 2001లో షాంఘైలో ఏర్పాటైన ఎస్సీఓలో చైనా, ఇండియా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా 2020లో మయన్మార్ పర్యటన అనంతరం జిన్‌పింగ్ కరోనా నేపథ్యంలో విదేశాలకు వెళ్లడం కూడా ఇదే తొలిసారి.
చదవండి: ‘ఈయనేం ప్రధాని.. దేశానికి తలవంపులు తెస్తున్నారు’
Comments
Please login to add a commentAdd a comment