ఆట నిర్ణయమైపోయింది! | Xi set to open party congress at challenging time for China | Sakshi
Sakshi News home page

ఆట నిర్ణయమైపోయింది!

Published Sun, Oct 16 2022 12:28 AM | Last Updated on Sun, Oct 16 2022 12:28 AM

Xi set to open party congress at challenging time for China - Sakshi

నేటి నుంచి జరగనున్న చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ కాంగ్రెస్‌ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అధికారాన్ని మరింతగా స్థిరపర్చే దిశగా పయనిస్తుందని అంచనా. పార్టీలోని ఇతర కీలక నాయకులు పదవుల నుంచి తప్పుకుంటున్నప్పటికీ జనరల్‌ సెక్రటరీ స్థానానికి ఢోకా లేదన్నది స్పష్టం. పార్టీలో అత్యున్నత స్థానాల్లో ఉన్న కొన్ని వందలమందికి ఇప్పటికే పార్టీ కాంగ్రెస్‌లో జరిగే ఫలితం గురించి తెలుసు. అనుకోనిది జరిగితే తప్ప పార్టీ కాంగ్రెస్‌లో ఆడబోయే ఆట ఇప్పటికే నిర్ణయమైపోయింది. అయితే మూడోసారి పార్టీ జనరల్‌ సెక్రటరీ కాబోతున్న జిన్‌పింగ్‌కు దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు సవాలు విసరనున్నాయి. అసమానతలను రూపుమాపడానికి అవసరమైన సామూహిక వృద్ధి అన్న పార్టీ కేంద్ర భావన ఈ చర్చల్లో ప్రధాన భూమిక పోషించనుంది. స్థానికంగా వినియోగాన్ని పెంచడం, కొత్త ఆవిష్కరణలు, స్థానికంగా పోటీతత్వాన్ని పెంచడం ద్వారా అసమానతలను తగ్గించాలని చైనా యోచిస్తోంది. ముఖ్యంగా చైనా ప్రపంచం దృష్టిలో తన ఇమేజ్‌ను మార్చుకునేందుకు ప్రయత్నిస్తుందన్న అంచనాలున్నాయి.

అధ్యక్షుడి స్థానం సుస్థిరం
చైనా కమ్యూనిస్టు పార్టీ (సీసీపీ) 20వ జాతీయ కాంగ్రెస్‌ నేడు బీజింగ్‌లో ప్రారంభం కానుంది. ప్రతి అయిదేళ్ల కోసారి జరిగే ఈ సమావేశం రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమా వేశంలో ప్రకటనలు, తీర్మానాలు, తదనుగుణంగా కొత్త స్టాండింగ్‌ కమిటీ ఎన్నిక, 25 మంది వ్యక్తుల పోలిట్‌ బ్యూరోలో కొద్ది మంది ముఖ్య నాయ కుల బృందం ఏర్పాటవుతాయి. సాంప్రదాయికంగా, సీసీపీ జనరల్‌ సెక్రటరీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, చైనా ప్రధాని లీ కికియాంగ్‌తో సహా అత్యున్నత నాయకత్వం మార్పునకు పార్టీ కాంగ్రెస్‌ వేదికగా ఉండాలి.

అయితే జిన్‌పింగ్‌ పాలన సాధారణం కంటే ఎక్కువే అని చెప్పాలి. 2017లో జరిగిన 19వ కాంగ్రెస్‌ తదుపరి తరం దేశ నేత గురించి బయటపెట్టలేదు. కానీ ఆ మరుసటి సంవత్స రమే జిన్‌పింగ్‌ నిబంధనలు మార్చివేసి జీవితకాల పాలకుడిగా తనను తాను నియమించుకున్నారు. అదే సమయంలో రాజ కీయ ప్రక్షాళన ద్వారా తన ప్రత్యర్థులను దారిలోకి తెచ్చు కున్నారు. పార్టీ అధినేత కంటే ప్రధానికి అధికారాలు తక్కువ కాబట్టి ఈ కాంగ్రెస్‌లో లీ పదవికి గ్రహణం పట్టడం తప్పదని భావిస్తున్నారు. 

చైనాలో పార్టీ కాంగ్రెస్‌ జరుగుతున్న సమయం కూడా చైనా రాజకీయ గతానికి చెందిన అస్థిరతను గుర్తు చేస్తుంది. తొలి పార్టీ కాంగ్రెస్‌ దాదాపు నూరేళ్ల క్రితం జరిగింది. చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాకుండా విప్లవో ద్యమ పార్టీగా ఉన్నప్పుడు అది జరిగింది. అయితే ప్రతి అయిదేళ్లకు ఒకసారి కాంగ్రెస్‌ని నిర్వహించడం అనేది 1977 నుంచి మాత్రమే జరుగుతూ వస్తోంది. మావో అనంతర అధికారిక వ్యవస్థను నెలకొల్పాలి అని పార్టీ అప్పటినుంచే ప్రయత్నించింది మరి.

చైనా మరింతగా నిరంకుశాధికారంపై ఆధారపడుతుందని సంకేతాలు వెలువరిస్తూ, వ్యవస్థీకృత నాయకత్వ వారసత్వం అమల్లోకి వచ్చింది. ఈ నిరంకుశాధికార వ్యవస్థతోనే ప్రపంచం వ్యవహారాలు నడపాలి. శక్తిమంతమైన పార్టీ చీఫ్‌ కొంతమేరకు సమానులలో ప్రథముడు అని భావించడమే దీనివెనుక ఉన్న భావం. ఆ విధంగా తక్కిన నాయకత్వంతో పాటు, రిటైరైన నాయకులు చైనాలో కొత్త మావో ఆవిర్భవించకుండా నిరోధి స్తారని అందరూ భావించారు. అయితే జిన్‌పింగ్‌ ఎదుగుదల ఈ ఆలోచనలను తోసిపుచ్చింది. చైనా కమ్యూనిస్టు పార్టీ ఇన్‌చార్జ్‌ ఎవరు అనే ప్రశ్నే ఇప్పుడు తలెత్తదు. 20వ కాంగ్రెస్‌ తర్వాత నాయకత్వ మార్పు జరగకపోవచ్చు. ఇప్పటికైతే, చైనా శాశ్వత నాయకుడు జిన్‌పింగ్‌ అనే చెప్పాలి.

పార్టీ కాంగ్రెస్‌ జరగడానికి ముందే పార్టీలో అంతర్గత అధి కార పోరాటాలు మొదలయ్యాయి. కాంగ్రెస్‌ అనే ఈవెంటు... చక్కగా చిత్రీకరించిన డ్యాన్స్‌ అన్నమాట. అనుకోనిది జరిగితే తప్ప పార్టీ కాంగ్రెస్‌లో ఆడబోయే ఆట ఇప్పటికే నిర్ణయమై పోయింది. నెలలు, బహుశా సంవత్సరాలుగా తెరవెనుక సాగుతూ వచ్చిన అనుకూల ప్రచారం, హెచ్చరికలు, అవినీతి ఆరోపణలు, ఆకర్షించడం, బలవంతపెట్టడం, తారుమారు చేయడం వంటివి ఫలితాన్ని ఇప్పటికే నిర్దేశించాయి. కమ్యూ నిస్టు పార్టీ లోపల జరిగే వ్యవహారాలు జిన్‌పింగ్‌ నేతృత్వంలో మరింత పారదర్శకం కాకుండా పోయాయి. పార్టీలో అత్యు న్నత స్థానాల్లో ఉన్న కొన్ని వందలమందికి ఇప్పటికే పార్టీ కాంగ్రెస్‌లో జరిగే ఫలితం గురించి తెలుసు. ఈ దఫా కాంగ్రెస్‌లో ప్రకటించబోయేది ఏమిటంటే పార్టీ గమ్యానికి మార్గనిర్దేశం చేయడం, జిన్‌పింగ్‌ అధికారాన్ని మరోసారి పొడిగించడం మాత్రమే.

ఈ సంవత్సరం పార్టీ కాంగ్రెస్‌కు మూడువేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. సత్ప్రవర్తన, ప్రస్తుత నాయ కులకు సన్నిహితంగా ఉండటం, సంకేత చర్య వంటి రివార్డుల ద్వారా పార్టీలోని వివిధ శ్రేణుల నుంచి ప్రతినిధులను ఎన్ను కుంటారు. పార్టీ కాంగ్రెస్‌లో కొంతమంది ప్రతినిధులు ఎలాంటి సమస్యలూ సృష్టించకుండా జిన్‌పింగ్‌ అధ్యక్షతలోని ఒక చిన్న కమిటీ ప్రతినిధుల తుది జాబితాను ఆమోదిస్తుంది. పార్టీలో ముందుగానే తీసుకున్న నిర్ణయాలను నామమాత్రపు చర్చతో ప్రతినిధులు ఆమోదిస్తారు. పార్టీ కాంగ్రెస్‌ ప్రధాన పని 200 మంది కేంద్ర కమిటీ సభ్యుల కొత్త జాబితాను, 170 మంది ప్రత్యామ్నాయ సభ్యుల జాబితాను ఆమోదించడమే. కొత్తగా ఎంపికయ్యే 200 మంది కేంద్రకమిటీ సభ్యులు పాలిట్‌ బ్యూరోలోని 25 మంది సభ్యులను ఎన్నుకుంటారు. తర్వాత పాలిట్‌ బ్యూరో పార్టీకి చెందిన స్టాండింగ్‌ కమిటీ సభ్యులను నిర్ణయిస్తుంది.

పార్టీ కాంగ్రెస్‌లో అనేక అంశాలపై అధ్యయనాలు జరుగు తుంటాయి. ప్రత్యేకించి పనికి సంబంధించిన నివేదికలు చైనా రాజకీయ, ఆర్థిక, భౌగోళిక పరిస్థితిని సంగ్రహంగా సమీక్షిస్తుం టాయి. ఈ నివేదికలను నాయకత్వమే పార్టీ కాంగ్రెస్‌కి సమర్పిస్తుంది. తైవాన్‌ పట్ల కఠిన పదజాలంలో వ్యాఖ్యలుం టాయి. చైనాలో ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన సంకే తాలు కూడా వాటిలో ఉంటాయి.

అయితే ప్రధాన సమస్య ఏమిటంటే, స్టాండింగ్‌ కమిటీ సభ్యులు ఎవరై ఉంటారని తెలుసుకోవడమే. స్టాండింగ్‌ కమిటీ సభ్యుల అనధికారిక పదవీ విరమణ వయస్సు 68 సంవత్స రాలు. కానీ విధేయులు, కీలకమైన నేతలు మరింతకాలం పదవుల్లో కొనసాగుతారు. అయితే జిన్‌పింగ్‌తో కలిసి చాలా కాలం పనిచేసిన వారికి కొన్ని పదవులు కట్టబెట్టనున్నట్లు కనిపిస్తోంది. వీరిలో చెన్‌ మినెర్‌ ఒకరు. జిన్‌పింగ్‌ వారసుడు ఆయనే అని చెబుతుంటారు. మరొకరు డింగ్‌ జూకియంగ్‌. జిన్‌ పింగ్‌ విధేయులు ఎంతమంది ఎక్కువగా ఉంటే ఆయన అంత బలంగా కనిపిస్తారు. ఈ కాంగ్రెస్‌లో కూడా ఆయన విధేయు లతో కూడిన స్టాండింగ్‌ కమిటీనే ఉంటుందని ఊహించవచ్చు.

అయితే ప్రస్తుతం చైనాను వెంటాడుతున్న ఆర్థిక అస్థిరత వల్ల అధ్యక్షుడిపై పార్టీ కాంగ్రెస్‌లో ఊహించిన దానికంటే ఎక్కువ విమర్శలే రావచ్చు. కాబట్టి సైద్ధాంతిక అవసరాలను దాటి ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే వారికి జిన్‌పింగ్‌ కాస్త ప్రాధాన్యం ఇవ్వవచ్చు. అంటే మరింతగా మార్కెట్‌కు ప్రాధాన్యమిచ్చే వాంగ్‌ యాంగ్‌ వంటి ఆర్థిక వేత్తలకూ, లియు హె వంటి హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదువుకున్న దౌత్యవేత్త లకూ అగ్రస్థానం లభించవచ్చు.

చైనా రాజకీయ నాయకత్వంలో జిన్‌పింగ్‌ ఆకాంక్షలకు వ్యతిరేకంగా సైద్ధాంతికంగా కానీ, దమ్ము ఉన్న వారుకానీ నిల బడే వారులేరు. మరొక కీలక సమస్య ప్రధానమంత్రి పదవి. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న లి కెకియాంగ్‌ తప్పుకోవచ్చని స్పష్టమవుతోంది. జిన్‌ పింగ్‌ దీర్ఘకాలిక సహచరుడు, షాంఘై పార్టీ చీఫ్‌ లి క్వియాంగ్‌ కొత్త ప్రధాని కావచ్చను కుంటున్నారు. అయితే ఈ ఏడాది షాంఘై లాక్‌డౌన్‌ కలిగించిన విధ్వంసం కారణంగా ఈయనకు కీలక పదవి లభిస్తుందంటే సందేహాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా, పార్టీపై జిన్‌ పింగ్‌ పట్టు సడలక పోతే తప్పకుండా లి క్వియాంగ్‌నే ఆయన ప్రధానిగా ఎంచు కోవచ్చు. మొత్తం మీద చైనా పార్టీ కాంగ్రెస్‌ జిన్‌ పింగ్‌ అధి కారాన్ని మరింతగా స్థిరపరిచే దిశగానే కొనసాగవచ్చు.


జేమ్స్‌ పామర్‌
వ్యాసకర్త పాత్రికేయుడు, కాలమిస్ట్‌
(‘ఫారిన్‌ పాలసీ’ సౌజన్యంతో) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement