సరిహద్దులో చైనా నిర్మిస్తున్న ఒక గ్రామం
విశ్లేషణ
‘షావోకాంగ్’ పథకం ద్వారా వందల ఆధునిక గ్రామాలను సరిహద్దుల్లో చైనా నిర్మించింది. సరిహద్దు ప్రాంత అభివృద్ధి పేరిట సాగుతున్న ఇది పూర్తిగా నిర్బంధ విస్తరణపై కేంద్రీకృతమైంది. లద్ధాఖ్, బారాహోతి, అరుణాచల్ ప్రదేశ్‌లను తన భూభాగాలుగా చూపిస్తూ చైనా ‘భౌగోళిక పటాల దాడి’ని కూడా ప్రారంభించింది. ఈ ప్రాంతాల్లోని స్థలాలకు మాండరిన్ పేర్లను ఇవ్వడం అనేది చైనా ‘త్రిముఖ యుద్ధవ్యూహం’లో భాగం. టిబెట్, షిన్‌జాంగ్ లలో భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి తర్వాత మాత్రమే, సరిహద్దు ప్రాంతాలలో రోడ్లు, ఉపరితల కమ్యూనికేషన్ లను అప్‌గ్రేడ్ చేయడం భారత్ మొదలుపెట్టింది. ‘ఎత్తుకు పై ఎత్తు’ వేయడం కాకుండా, చైనా విస్తరణవాద నమూనాలను సమర్థంగా ఎదుర్కోవడానికి, నవ్య విధానం అవసరం.
సరిహద్దులలో చైనా ఆధునిక గ్రామాలను నిర్మించడం, వాటిని నివాస ప్రాంతాలుగా చేసుకోవడం గురించి తరచుగా వార్తలు వస్తున్నాయి. మార్చ్ 28న, టిబెట్‌ను చైనా స్వాధీనం చేసుకున్న ఘటన 65వ వార్షికోత్సవం సందర్భంగా, భారత్, భూటాన్ సరిహద్దులకు సమీపంలో ఉన్న కొత్త గ్రామాలలో చైనా ప్రభుత్వం అనేక వేడుకలను నిర్వహించింది. తాజా వార్తల ప్రకారం, ఇప్పటికే ఉన్న 628 ‘సవొకాంగ్’ (సంపన్న గ్రామా లు)తో పాటు, మరో 175 సరిహద్దు గ్రామాలను చైనా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉంది.
సరిహద్దు ప్రాంత అభివృద్ధి పేరిట, షావోకాంగ్ చొరవ అనేది నిర్బంధ విస్తరణపై కేంద్రీకృతమైంది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన ద్వారా చైనా సమాజపు సమాన అభివృద్ధిని నిర్ధారించ డానికి 1979లో డెంగ్ జియావోపింగ్ ఈ నమూనాను ప్రతిపాదించారు. ప్రస్తుత చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ దీనిని, ప్రధాన భూభాగంతో సరిహద్దు ప్రాంతాల ఏకీకరణ వ్యూహంగా మార్చారు. తద్వారా అరుణాచల్‌ప్రదేశ్‌కు ఎదురుగా ఉన్న టిబెట్‌లో దాని భూసరిహద్దుల భద్రతను మెరుగుపరిచారు.
షావోకాంగ్ పథకంలో భాగంగా, 427 మోడల్ గ్రామాలను ఫ్రంట్ లైన్‌లో నిర్మించగా, 201 గ్రామాలు రెండవ శ్రేణిలో ఉన్నాయి. ఈ సంపన్న గ్రామాలు షిగత్సే, లోహ్కా, న్యింగ్చి, ఎన్గారి వంటి ముఖ్య మైన పట్టణాలతో సహా 21 సరిహద్దు కౌంటీలలో విస్తరించి ఉన్నాయి. భూటాన్, అరుణాచల్‌ప్రదేశ్‌లతో సరిహద్దును పంచుకునే లోహ్కా ప్రాంతంలోనే, చైనా 354 ‘సంపన్న’ సరిహద్దు స్థావరాలను అభివృద్ధి చేసింది. ఈ గ్రామాలలో దాదాపు మూడింట ఒక వంతు వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్‌ఏసీ) సమీపంలో నిర్మించారు. మౌలిక సదు పాయాలు సహా, ఈ ఆవాసాల నిర్మాణం కోసం సుమారుగా 4.6 బిలి యన్ డాలర్లు కేటాయించారు.
2017 అక్టోబర్‌లో జరిగిన 19వ పార్టీ కాంగ్రెస్‌లో, ప్రతిభావంతులైన చైనీస్ పౌరులు మారుమూల జాతిపరమైన మైనారిటీ ప్రాంతాలలో పని చేయాలని జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. దీంట్లో నిగూఢంగా దాగి ఉన్నది, ప్రధానంగా అక్కడి జనావాసాల స్థితిగతులను మార్చడమే. గత దశాబ్దంలోనే, టిబెట్‌లో హాన్ జనాభా సుమారు 12 శాతం పెరిగింది. కమ్యూనిస్ట్ పాలన అంతిమ లక్ష్యం, టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో పూర్తిగా చైనీకరణను సాధించడం. భారత్, నేపాల్, భూటాన్ సరిహద్దు ప్రాంతాలలో అన్ని సరిహద్దు గ్రామాలకు రోడ్లు, విద్యుదీకరణ, ఆఖరికి ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి నాణ్యమైన సౌకర్యాలు అందించారు. అదనంగా, దాదాపు 206 పారిశ్రామిక ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.
సరిహద్దు నిర్వహణను బలోపేతం చేయడానికి చైనా ఇటీవలి సంవత్సరాలలో రెండు జాతీయ చట్టాలను ప్రవేశపెట్టింది. 2021లో ఆమోదించిన నేషనల్ డిఫెన్స్ లా, జాతీయ ప్రయోజనాల కోసం పౌర సంస్థలతో కలిసి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పనిచేయడానికి అధిక పాత్రను అందిస్తుంది. ఒక సంవత్సరం తర్వాత, ఆక్రమిత ప్రాంతా లపై చైనా పట్టును ఏకీకృతం చేసేందుకు భూ సరిహద్దు చట్టాన్ని ఆమోదించారు.
ఈ చట్టంలోని ఆర్టికల్స్ 10, 43... సరిహద్దు మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి యథాతథ స్థితిని సవాలు చేస్తున్నాయి. ఇది భారతదేశ సరిహద్దు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. లద్ధాఖ్, బారాహోతి, అరుణాచల్ ప్రదేశ్‌లను తన భూభాగాలుగా చూపిస్తూ చైనా ‘మ్యాప్‌ల దాడి’ని ప్రారంభించింది. ఈ ప్రాంతాల్లోని స్థలాలకు మాండరిన్ పేర్లను ఇవ్వడం అనేది చైనా ‘త్రిముఖ యుద్ధవ్యూహం’లో భాగం. ఇది ప్రచారపరమైన, మానసికపరమైన, చట్టపరమైన కోణాలను కలిగి ఉంటుంది.
జూలై 2021లో, జిన్‌పింగ్ లాసాను సందర్శించారు. గత మూడు దశాబ్దాలలో చైనా దేశాధినేత చేసిన మొదటి సందర్శన. ఆయన టిబెట్‌ను ‘ఇనుప కవచం’గా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. దీని ప్రకారం, డోక్లామ్, లాంగ్ జు వంటి వివాదాస్పద ప్రాంతాలలోని సరిహద్దు గ్రామాలు ఫార్వర్డ్ పోస్ట్‌లుగా వ్యవహరించడానికి చైనా సైన్యపు రక్షణ ప్రణాళికలలో విలీనం చేయబడ్డాయి. హాన్ జాతికి చెందిన మాజీ సైనిక సిబ్బంది సరిహద్దు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. చైనా చర్యలు దాని ‘గ్రే జోన్ వార్‌ఫేర్’కు అనుగుణంగా ఉన్నాయి. ఇందులో పౌరులు, పౌరసైనికులు ‘నాన్–కాంటాక్ట్’ యుద్ధంలో భాగమ వుతారు. దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్ కార్యాచరణ దీనికి ఒక ఉదాహరణ.
ఒక స్పష్టమైన విధానం లేనందున, ముఖ్యంగా చైనాకు ఎదు రుగా ఉన్న భారత సరిహద్దు ప్రాంతాలు అభివృద్ధి చెందలేదు. టిబెట్, షిన్‌జాంగ్‌లలో భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి తర్వాత మాత్రమే, సరిహద్దు ప్రాంతాలలో రోడ్లు, ఉపరితల కమ్యూనికేషన్ లను అప్‌గ్రేడ్ చేయడం భారత్ మొదలుపెట్టింది. సరిహద్దు గ్రామాల్లో నివసించే ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్ (వీవీపీ)ని గతేడాది ప్రారంభించారు. దీని ప్రకారం, చైనా సరిహద్దులో కనెక్టివిటీ లోపించిన 168 గ్రామాలను ఈ ఏడాది చివరి నాటికి అనుసంధానం చేయనున్నారు.
19 జిల్లాల్లోని 663 సరి హద్దు గ్రామాల్లో తగిన మౌలిక సదుపాయాల కల్పనకు రూ.4,800 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు.చైనా నియంత్రణలో పూర్తిగా ఉండే సవొకాంగ్ పథకానికి విరు ద్ధంగా, భారత్ కార్యక్రమం ‘హబ్ అండ్ స్పోక్’(ఒక దగ్గరి నుంచి అందరికి) నమూనాను అనుసరిస్తోంది. ఇది జిల్లా పరిపాలన, గ్రామ పంచాయతీల ద్వారా అమలవుతుంది. కేంద్ర ప్రభుత్వ పాత్ర నిధులు ఇవ్వడానికే పరిమితమైంది. వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ప్రధాన దృష్టి సామాజిక–ఆర్థిక కార్యక్రమాల ప్రచారంపై ఉంది. అయితే, భద్రతా అంశాలను కూడా చేర్చడం ద్వారా ద్వంద్వ–వినియోగ విధానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉంది.
రహదారులు, రైలు మార్గాలు, విమానాశ్రయాలు, దిబాంగ్ జల విద్యుత్ ప్రాజెక్టు, జలమార్గాలతో సహా భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా సరిహద్దుల్లో భారత్ చేపడుతోంది. ఈశాన్య ప్రాంత సమగ్ర అభివృద్ధికి రూ. 12,882.2 కోట్ల నిధులను ‘స్థూల బడ్జెట్ సహాయం’ కింద సమకూర్చారు.
వివాదాస్పద సరిహద్దు, లద్ధాఖ్‌లలో కొనసాగుతున్న ప్రతిష్టంభన దృష్ట్యా, చైనా ప్రణాళిక తీవ్రమైన వ్యూహాత్మక పరిణామాలను కలిగి ఉంది. వాస్తవ నియంత్రణ రేఖ స్థితిని ఏకపక్షంగా మార్చాలనే బీజింగ్ ఉద్దేశం, సవొకాంగ్ పథకంతో మరింత తోడ్పాటును పొందు తుంది. 2005 (ఆర్టికల్ 7)లో పొందుపర్చిన ‘సరిహద్దు సమస్య పరి ష్కారానికి రాజకీయ పరామితులు, మార్గదర్శక సూత్రాలు’ ఒప్పందాన్ని కూడా చైనా విస్మరించింది. ఈ ఒప్పందం ప్రకారం సరిహద్దుల వెంబడి జనాభా ప్రస్తుత అమరికకు ఎవరూ భంగం కలిగించకూడదు.
చైనా విస్తరణవాద నమూనాలను సమర్థంగా ఎదుర్కోవడానికి, నవ్య విధానం అవసరం. ‘ఎత్తుకు పై ఎత్తు’పై ఆధారపడిన మన ప్రస్తుత ప్రతిస్పందనా విధానానికి కాలం చెల్లిపోయింది. సరిహద్దు నిర్వహణ మొత్తంగా సమగ్ర సమీక్షకు గురికావాలి. ఇది జాతీయ భద్రతా వ్యూహంలో కీలకమైన అంశంగా ఉండాలి. దురదృష్టవశాత్తూ ఇది ఇప్పటికీ రూపు దాల్చుతూనే ఉంది!
మేజర్ జనరల్ జిజి ద్వివేది (రిటైర్డ్)
వ్యాసకర్త చైనాకు భారత మాజీ డిఫెన్స్ అటాచె
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment