చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్
2013 నుండి నిరంతర ప్రయత్నాలు చేసినప్పటికీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ప్రజా విముక్తి సైన్యం(పీఎల్‌ఏ)లోని అవినీతిని తొలగించలేకపోయారు. దానికోసం ఆయన అమలు చేసిన పర్యవేక్షణ వ్యవస్థ కూడా పనిచేసినట్లు లేదు. జిన్‌పింగ్‌కు మరింత ఇబ్బంది కలిగించే విషయం ఏమిటంటే, సీనియర్ అధికారులందరూ ఆయన ద్వారానే పదోన్నతి పొందారు. అవినీతి ఆరోపణలపై విచారణను ఎదుర్కొంటున్న కనీసం 70 మంది పీఎల్‌ఏ అధికారులను తాము గుర్తించినట్లు ఒక కెనడా థింక్ ట్యాంక్ పేర్కొంది. ఇక, తైవాన్ పై దాడికి పీఎల్‌ఏ సిద్ధంగా లేదని మరో నివేదిక పేర్కొంది. పీఎల్‌ఏ రాజకీయ విశ్వసనీయతను, సైద్ధాంతిక నిబద్ధతను బలోపేతం చేయడానికి చైనా అధ్యక్షుడు ఒక కఠినమైన ప్రచారం నిర్వహించనున్నారనేది స్పష్టం.
గత సంవత్సరం మధ్య నుండి చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ–ప్రజా విముక్తి సైన్యం) ఉన్నత స్థాయులలో స్పష్టంగా గందరగోళం కనిపిస్తోంది. చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) నిర్వహించిన నూతన సంవ త్సర ప్రదర్శనలో జనవరి 29న కనిపించిన సీఎంసీ సీనియర్ వైస్ ఛైర్మన్ జనరల్ జాంగ్ యూక్సియాను, రక్షణ మంత్రి జనరల్ లీ షాంగ్‌ఫును ఆకస్మికంగా తొలగించడం గురించి సుదీర్ఘకాలంపాటు చైనా ప్రభుత్వం వివరణ ఇవ్వలేదు. వీరిద్దరికీ చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్‌తో సన్నిహిత కుటుంబ సంబంధాలు ఉండటం అనిశ్చితిని మరింతగా పెంచింది.
అవినీతి లేదా రాజకీయ క్రమశిక్షణను ఉల్లంఘించిన ఆరోపణలపై చాలా మంది సీనియర్ అధికారులను ఇటీవలి నెలల్లో పదవుల నుండి తొలగించారు. అవినీతి ఆరోపణలపై విచారణలో ఉంచిన కనీసం 70 మంది పీఎల్‌ఏ అధికారులను తాము గుర్తించినట్లు ఒక కెనడా థింక్ ట్యాంక్ (మేధా సంస్థ) పేర్కొంది. అదనంగా, తైవాన్ పై దాడికి పీఎల్‌ఏ సిద్ధంగా లేదని పీఎల్‌ఏ అధికారులు జిన్ పింగ్‌కు తెలియజేసినట్లు మరో నివేదిక పేర్కొంది. అవినీతిని నిర్మూలించడం, రాజకీయ క్రమశిక్షణ, విశ్వసనీయతను నిర్ధారించడంపై చైనా అధ్యక్షుడు దృష్టి సారించడంతో, పీఎల్‌ఏ పూర్తిగా ‘ప్రక్షాళన’ లేదా దిద్దుబాటుకు లోనవుతుందనే విషయం దాదాపు నిశ్చయమైంది.
కదులుతున్న సోపానక్రమం
గత ఏడాది సెప్టెంబర్‌లో జనరల్ లీ షాంగ్‌ఫు ఆకస్మికంగా ప్రజల దృష్టి నుండి అదృశ్యమైనప్పటి నుండి, ఇది ఎందుకు జరిగింది, అతని స్థానంలో ఎవరు ఉంటారు? అనే దానిపై నిరంతర ఊహాగానాలు కొనసాగుతున్నాయి. జిన్ పింగ్ మరొక ఆశ్రితుడైన విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ జూలైలో ఆకస్మికంగా, ఇప్పటికీ వివరించలేని విధంగా అదృశ్యమవడం కారణంగా మరింతగా ఊహాగానాలు పెరిగాయి. బహుశా వారు అవినీతికి పాల్పడ్డారనీ, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారనీ ఆ తర్వాత సంకేతాలు వచ్చాయి. ఆసక్తికరంగా, వీరిద్దరూ చైనా కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులుగా తమ స్థానాన్ని మాత్రం నిలుపుకొన్నారు.
2023 సంవత్సరం అక్టోబరులో జనరల్ లి షాంగ్‌ఫు అధికారికంగా రక్షణ మంత్రి పదవి నుండి వైదొలిగారు. అయితే పీఎల్‌ఏ మాజీ నేవీ కమాండర్ జనరల్ డాంగ్ జున్ ను ఆయన వారసుడిగా నియమించటానికి మరో మూడు నెలలు పట్టింది. మొదటిసారిగా, మాజీ పీఎల్‌ఏ నేవీ కమాండర్‌ను రక్షణ మంత్రిగా నియమించడం వలన పీఎల్‌ఏ పదాతి బలగం, పీఎల్‌ఏ రాకెట్ బలగం గురించి సందేహాలు తలెత్తాయి.
అదే సమయంలో, ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు జనరల్ జాంగ్ చాలా కాలం గైర్హాజరు కావడం, మళ్లీ అడపాదడపా సుదీర్ఘకాలం కనిపించకపోవడం వల్ల, జిన్‌పింగ్‌తో ఆయన సంబంధాలు దెబ్బతిన్నాయని ఊహాగానాలు వచ్చాయి. జనవరి 16న బీజింగ్‌లోని సెంట్రల్ పార్టీ స్కూల్‌లో ‘అధిక నాణ్యత, ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడం’పై జరిగిన అధ్యయన సెషన్‌లో జనరల్ జాంగ్, జనరల్ హీ వీడాంగ్ వెనుక మూడవదైన చివరి వరుసలో కూర్చున్నట్లు ప్రభుత్వ యాజమాన్యంలోని సీసీటీవీ కవరేజి చూపించింది. ఇది పీఎల్‌ఏ సోపానక్రమం విషయంలో చాలా అసాధారణమైనది
తనిఖీ పరిధిలోకి వచ్చినప్పటికీ...
పీఎల్‌ఏలో దశాబ్దాలుగా అవినీతి రాజ్యమేలుతున్న సంగతి తెలిసిందే. 2012 నవంబర్‌లో సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఛైర్మన్ గా జిన్‌పింగ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే, పీఎల్‌ఏను చైనా కమ్యూ నిస్టు పార్టీకి చెందిన అవినీతి నిరోధక సంస్థ అయిన కేంద్ర క్రమశిక్షణా తనిఖీ కమిషన్ పరిధిలోకి తీసుకువచ్చారు. దానిని ఏడాది పొడవునా సైద్ధాంతిక, అవినీతి వ్యతిరేక ప్రచారాలకు గురిచేశారు.
పీఎల్‌ఏ ఆధు నీకరణ, ఆల్–రౌండ్ టెక్నాలజీ అప్‌గ్రేడ్‌పై కొత్త, ప్రధాన ప్రాధాన్యత కారణంగా భారీ మొత్తంలో డబ్బు అందుబాటులోకి వచ్చేది. పీఎల్‌ఏ రాకెట్ ఫోర్స్ ముఖ్యంగా క్షిపణుల జాబితాను పెంచడానికి, కొత్త రకాల క్షిపణులను ప్రవేశపెట్టడానికి, అనేక భూగర్భ గోతులను నిర్మించడానికి చేసిన కృషి కారణంగా పెద్ద మొత్తాలను అందుకుంది. పీఎల్‌ఏ సామగ్రి అభివృద్ధి విభాగానికి సంబంధించిన రక్షణ శాస్త్రీయ సంస్థల్లోని అధికారుల తొలగింపు, వారు కూడా అవినీతికి పాల్ప డ్డారని నిర్ధారిస్తుంది.
తాను కనీవినీ ఎరుగని స్థాయిలో అవినీతి వ్యతిరేక ప్రచారం సాగించినప్పటికీ, పీఎల్‌ఏలో ఇంత పెద్ద ఎత్తున అవినీతి కొనసాగడంపై జిన్ పింగ్ ఆగ్రహం చెందారు. దీని ఫలితంగా 2017 నాటికి అవినీతి ఆరోపణలపై 40 శాతం మంది అధికారులను తొలగించారు. రిపోర్టింగ్, పర్యవేక్షణ యంత్రాంగం పని చేయలేదనీ, దానిని పర్య వేక్షించడానికి పార్టీ చేసిన ప్రయత్నాలను పీఎల్‌ఏ ప్రతిఘటించిందనీ ఇది సూచిస్తుంది. దీనికి అనుగుణంగా, 2024 జనవరి 1న నాటి పీఎల్‌ఏ దినపత్రిక సంపాదకీయం, అవినీతిపై పోరాటానికి ప్రాధాన్య తనిస్తూ మూడుసార్లు ‘అవినీతి’ని ప్రస్తావించింది! అప్పటి నుండి, పీఎల్‌ఏ అవినీతిని అరికట్టాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పే దాదాపు అరడజను కథనాలు వచ్చాయి.
కఠిన ప్రచారం
ఇంతలో, రహస్య పీఎల్‌ఏ రాకెట్ ఫోర్స్ కమాండర్, పొలిటికల్ కమిస్సార్, జనరల్ లీ యుచావో, జనరల్ గ్జూ జోంగ్‌బోలను, వరు సగా వారి పదవుల నుండి తొలగించారు. అవినీతి ఆరోపణలపై వీరిపై విచారణ సాగించారు. విశ్వసనీయ నివేదికల ప్రకారం, ఈ అవినీతి సొమ్ము విలువ మొత్తం 2 బిలియన్ డాలర్లు అని అంచనా. డిసెంబర్ 29న, చైనా పార్లమెంటుగా పేర్కొనే నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ తొమ్మిది మంది సీనియర్ పీఎల్‌ఏ అధికారులను వారి పదవుల నుండి తొలగించింది.
2023 జూన్ లో, అణువ్యతిరేక దాడిని ప్రారంభించడం కోసం చర్యలను పర్యవేక్షించిన జనరల్ లి యుచావో, జనరల్ జు, ఆయన సహాయకులు లియు గ్వాంగ్బిన్, జాంగ్ జెన్ జాంగ్‌లను కూడా వారి పదవుల నుండి తొలగించారు. పీఎల్‌ఏ సామగ్రి అభివృద్ధి విభాగం అధికారులైన జాంగ్ యులిన్, రావో వెన్ మిన్ లను తొలగించడం మరింత ఆసక్తికరంగా ఉంది. గత నెల ప్రారంభంలో, దాదాపు 15 మంది సీనియర్ పీఎల్‌ఏ రాకెట్ ఫోర్స్ అధికారులను కూడా తొలగించి విచారణలో ఉంచారు. వారిలో ఐదుగురు ఆ సంస్థకు చెందిన గత లేదా ప్రస్తుత కమాండర్లు.
2013 నుండి నిరంతర ప్రయత్నాలు చేసినప్పటికీ, జిన్‌పింగ్, పీఎల్‌ఏ నుండి అవినీతిని తొలగించలేకపోయారు. పైగా ఆయన అమలులో ఉంచిన పర్యవేక్షణ వ్యవస్థ కూడా పనిచేసినట్లు లేదు. జిన్‌పింగ్‌కు మరింత ఇబ్బంది కలిగించే విషయం ఏమిటంటే, సీనియర్ అధికారులందరూ ఆయన ద్వారానే పదోన్నతి పొందారు. జనరల్ లి షాంగ్‌ఫు వంటి ఆయన సన్నిహిత వ్యక్తులు కూడా వారి స్థానాల నుండి తొలగించబడిన అధికారులలో ఉన్నారు. పీఎల్‌ఏ రాజకీయ విశ్వసనీయతను, సైద్ధాంతిక నిబద్ధతను బలోపేతం చేయడానికి ఒక కఠినమైన కేంపెయిన్ నిర్వహించనున్నారని స్పష్టం అవుతోంది.
జయదేవ రానాడే
వ్యాసకర్త ‘సెంటర్ ఫర్ చైనా ఎనాలిసిస్ అండ్
స్ట్రాటెజీ’ అధ్యక్షుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment