బీజింగ్: దేశంలో జననాల రేటు పడితుండటంతో చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ విధానపరమైన కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే సంతానం విధానాన్ని దశాబ్దాలపాటు కఠినంగా అమలు చేయడంలో చైనాలో జనాభా పెరుగుదల క్షీణించింది. దీని కారణంగా తలెత్తే దుష్ఫలితాలపై ఆందోళనలు వెల్లువెత్తడంతో ఇద్దరు బిడ్డల్ని కనవచ్చంటూ 2016లో వెసులుబాటు కల్పించింది. పిల్లల్ని పెంచడం ఆర్థికంగా భారంగా మారడంతో చైనాలో చాలా మంది దంపతులు ఇద్దరు సంతానం కలిగి ఉండేందుకు సముఖంగా లేరు. దీంతో తాజాగా, మరో అడుగు ముందుకేసి దంపతులు ముగ్గురు పిల్లల్ని కలిగి ఉండేందుకు వీలు కల్పించింది.
కొత్త గణాంకాల ప్రకారం.. వరుసగా నాలుగో ఏడాది కూడా జననాల రేటు అతితక్కువగా నమోదైంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా, రెండోఅతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనాలో పనిచేయగలిగే వారి సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుండటంపై ప్రభుత్వ వర్గాల్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో, దేశాధ్యక్షుడు, కమ్యూనిస్ట్ పార్టీ(సీపీసీ) అధినేత జిన్‌పింగ్..ఇప్పటి వరకు అనుసరించిన కుటుంబ నియంత్రణ విధానాన్ని పక్కనబెట్టి, దంపతులు మూడో బిడ్డను కూడా కలిగి ఉండేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ‘మూడో సంతానాన్ని కనాలనే దంపతులను చైనా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది’అని అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆధ్వర్యంలో జరిగిన సీపీసీ పొలిటికల్ బ్యూరో నిర్ణయించినట్లు అధికార వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది. ఈ విధానం అమలుకు అవసరమైన ప్రోత్సాహక చర్యలతో చైనా జనాభా పెరుగుతుందని ఆ సమావేశం పేర్కొందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment