ప్రపంచంలోని రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు... ఒకదానిపై మరొకదానికి ఒంటి నిండా అనేక అనుమానాలు, అపనమ్మకాలు. అలాంటి దేశాలు కూర్చొని చర్చించుకుంటే అది పెద్ద విశేషమే. అమెరికా, చైనాల మధ్య ఈ వారం అదే జరిగింది. అస్తుబిస్తుగా ఉన్న తమ సంబంధాలను చక్కదిద్దు కొనేందుకు అవసరమైన ఒక అడుగు ముందుకు వేశాయవి.
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తాజా చైనా పర్యటన అనేక విధాల గుర్తుండిపోయేది అందుకే. 2018 తర్వాత గడచిన అయిదేళ్ళలో అమెరికా విదేశాంగ మంత్రి ఒకరు చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా చివరిరోజైన సోమవారం సాక్షాత్తూ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సైతం బ్లింకెన్ సమావేశమై, ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ కోసం ప్రయత్నించడం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేపింది.
అరుదైన ఈ పర్యటనలో కళ్ళు చెదిరే కీలక ప్రకటనలేవీ లేకపోవచ్చు. కానీ, అసలంటూ ఘర్షణ వాతావరణాన్ని ఉపశమింపజేసి, తమ మధ్య సంబంధాలను సమస్థితికి తీసుకురావాలని రెండు దేశాలూ అంగీకరించడమే అతి పెద్ద వార్త అయింది. పరస్పరం నిష్కర్షగా అభిప్రాయాలు పంచు కొన్న ఈ చర్చలు భవిష్యత్తు పట్ల ఆశలు రేపాయి. నిజానికి, మునుపటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాం నుంచి కొన్నేళ్ళుగా అమెరికా తన దూకుడు చర్యలతో డ్రాగన్‌కు కోపం తెప్పించింది.
ఫలితంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మళ్ళీ గాడిన పెట్టాలనుకున్నా, ఫిబ్రవరిలో గగనతలంలో పయనిస్తూ భారీ బెలూన్ అమెరికాలో కనిపించేసరికి వ్యవహారం ముదిరింది. చైనా బెలూన్ గూఢచర్యానికి పాల్పడుతోందంటూ ఆరోపణలు మిన్నంటాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బాహాటంగానే చైనాను తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో బ్లింకెన్ తాజా చైనా పర్యటన, సత్సంబంధాల పునరుద్ధరణ ప్రయత్నం ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఒక విధంగా– బీజింగ్‌తో సంభాషణ వాషింగ్టన్ ఏరికోరి ఎంచుకున్నది కాదు. తప్పనిసరి అనివార్యత. తాజా సంభాషణల్లో సైతం బీజింగ్ తన మూతి బిగింపు పూర్తిగా వీడినట్టు లేదు. ఆ దేశం కాస్తంత నిష్ఠురంగానే ఉన్నా వైట్‌హౌస్ వర్గం తమ పని తాము కొనసాగించక తప్పదు. స్వీయ ప్రయోజనాల రీత్యా డ్రాగన్‌తో మాటామంతీ కొనసాగింపే అమెరికాకు ఉన్న మార్గం. కొద్ది వారాలుగా ఈ ప్రయత్నాలు కాస్త ముమ్మరించాయి.
చైనాకు చెందిన అగ్ర దౌత్యవేత్త వాంగ్ యీతో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ గత నెల వియన్నాలో రెండు రోజులు ‘‘నిర్మాణాత్మక’’ సమావేశాలు జరపడాన్ని ఈ దృష్టితోనే చూడాలి. ఫలితంగా అమెరికా వాణిజ్య కార్యదర్శి, చైనా వాణిజ్య శాఖ మంత్రితో అమెరికాలో మాట కలిపేందుకు తలుపులు తెరుచుకు న్నాయి.
ఇక, మధ్యశ్రేణి అమెరికన్ అధికారులు బీజింగ్‌లో పర్యటించారు. అమెరికా గూఢచారి విభాగం సీఐఏ డైరెక్టర్ సైతం సద్దు లేకుండా చైనా సందర్శించిన సంగతి మర్చిపోలేం. దీన్నిబట్టి భౌగోళిక రాజకీయాలకు అతీతంగా డ్రాగన్‌తో దోస్తీకి అగ్రరాజ్యం చేయిచాస్తోందని అర్థమవుతోంది.
బంధాలు మెరుగుపడడం దేవుడెరుగు, కనీసం మరింత క్షీణించకుండా ఆపడానికి బ్లింకెన్ పర్య టన ఉపకరిస్తుంది. తక్షణ ప్రయోజనాలు ఆశించలేం కానీ, చైనా విదేశాంగ మంత్రితో, అగ్ర దౌత్య వేత్తతో ‘నిక్కచ్చిగా’ సంభాషణలు సాగడంతో, ఆఖరి రోజున డ్రాగన్ దేశాధినేతతో బ్లింకెన్ భేటీకి మార్గం సుగమం అయింది. రానున్న రోజుల్లో ఇది రెండు అగ్రరాజ్యాల అధినేతల మధ్య భేటీకి దారి తీయగలదని ఆశించడానికి వీలు కలిగింది.
సైనిక ఘర్షణ ముప్పును తగ్గించుకోవాలని రెండు దేశాలూ ఒకే ఆలోచనకైతే వచ్చాయి. ఈ దిగ్గజ దేశాల మధ్య బంధం సుస్థిరంగా ఉండడం ప్రపంచ శాంతికి సైతం అవసరం. నిజానికి, చైనా ఆశలు, ఆకాంక్షలు అపరిమితమే అయినా, షీ మాత్రం విశ్వనేతగా అమెరికా స్థానంలోకి రావాలనే ఆలోచన, వ్యూహం తమకు లేదని చెబుతున్నారు.
చైనా తనదిగా ప్రకటించుకొనే స్వయంపాలిత ద్వీపం తైవాన్‌కు వచ్చే ఏడాది ప్రథమార్ధంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. తైవాన్‌పై డ్రాగన్ వేసే అడుగులను గ్రహించడంలో అంచనాలు తప్పితే ప్రమాదం తప్పదన్న తెలివిడి అమెరికాకు ఉంది. అందుకే, సంబంధాల మెరుగుదలకు, మరీ ముఖ్యంగా సైనిక చర్చల పునరుద్ధరణకు వాషింగ్టన్ తహతహలాడింది.
కానీ, తమ రక్షణ మంత్రిపైన అమెరికా ఆంక్షలు కొనసాగుతున్న వేళ బీజింగ్ అందుకు ఇష్టపడలేదు. అమెరికా మరింత స్పష్టమైన చర్యలతో, సంకల్పంలో నిజాయతీ ఉందని నిరూపించుకొనేలా ముందుకు రావాలని చూస్తోంది. ఆ మాటకొస్తే, గతంలో తనకూ, బైడెన్‌కూ మధ్య కుదిరిన ఒప్పందాల పైనే ఇరుపక్షాలూ ఇంకా చర్యలు చేపట్టాల్సి ఉందని బ్లింకెన్‌కు షీ గుర్తు చేశారు.
రానున్న నెలల్లో పరిణామాల్ని బట్టి, షీ– బైడెన్‌ల శిఖరాగ్ర సమావేశానికి అవకాశాలుంటాయి. సొంతగడ్డపై రాజకీయ ఒత్తిళ్ళ రీత్యా చైనాపై కఠిన వైఖరిని బైడెన్ సర్కార్ ఏ మేరకు మార్చుకో గలుగుతుందన్నది సందేహమే. అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రచారం దగ్గరవుతున్న వేళ బైడెన్‌కు అది మరీ కష్టం. అయితే, భౌగోళిక రాజకీయాల్లో పొరపొచ్చాలెన్ని ఉన్నా, ప్రపంచ కుగ్రామంలో ఆర్థిక అనివార్యతలే కీలకమనే స్పృహ ఈ అగ్రశక్తులు రెంటికీ పుష్కలం.
అదే ఇప్పుడు ఇరు పక్షాల మధ్య అపనమ్మకాన్ని వదిలించుకొనే మాటలకు దృశ్యాదృశ్య హేతువు. పరిమిత సహకారం, ఉద్రిక్తతల్లో కొంత ఉపశమనం సరిపోతాయా? చెప్పలేం. కానీ, నిరంతర సంభాషణలకు సిద్ధంగా ఉన్నామన్న ఈ సంకేతమే గనక ఇవ్వకుంటే, విశ్వశాంతికి కీలకమైన బంధాన్ని చేతులారా చెడగొడుతున్న బాధ్యతారహిత పెద్దన్నలనే ముద్ర మిగిలిపోతుంది. ఆ ఎరుక అమెరికా, చైనాలకు దండిగా ఉంది.
ఎట్టకేలకు ఒక ముందడుగు!
Published Thu, Jun 22 2023 3:19 AM | Last Updated on Thu, Jun 22 2023 3:19 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment