బీజింగ్: అమెరికాకు దీటుగా సైనిక సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా చైనా మరో అడుగు ముందుకేసింది. ‘దేశ రక్షణ బడ్జెట్‌ను పెంచుతున్నాం. ఆ మొత్తం ఎంత అనేది ఆదివారం జరగబోయే చైనా పార్లమెంట్ సమావేశాల్లో వెల్లడిస్తాం’ అని ఆ దేశ పార్లమెంట్ అధికార ప్రతినిధి వాంగ్ చావో శనివారం చెప్పారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 7.1 శాతం అధికంగా గత ఏడాది చైనా రక్షణ బడ్జెట్ కోసం 230 బిలియన్ డాలర్లను కేటాయించింది.
777.1 బిలియన్ డాలర్ల రక్షణ బడ్జెట్‌తో ప్రపంచంలో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెల్సిందే. మరోవైపు భారత రక్షణ బడ్జెట్ కంటే చైనా రక్షణ బడ్జెట్ మూడు రెట్లు మించి ఉండటం గమనార్హం. ‘ చైనా అంతర్జాతీయంగా చవిచూస్తున్న సంక్షిష్ట భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు బడ్జెట్ పెంచడం అనివార్యం’ అని వాంగ్ చావో వ్యాఖ్యానించారు. మరోవైపు శనివారం చైనా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
వారంపాటు జరగబోయే ఈ సమావేశాల్లో జిన్‌పింగ్ నాయకత్వంలో కొనసాగే నూతన మంత్రివర్గాన్ని, ప్రధానమంత్రి లీ కెక్వియాంగ్ స్థానంలో నూతన ప్రధానిని ప్రకటిస్తారు. నాయకత్వ మార్పులో భాగంగా ప్రతి పదేళ్లకోసారి జరిగే ఈ ‘రబ్బర్‌స్టాంప్’ తంతులో కొలువుతీరే కొత్త వారంతా దాదాపు జిన్‌పింగ్ ఆజ్ఞలను శిరసావహించేవారే. రెండు సెషన్లుగా జరిగే పార్లమెంట్ భేటీలో దశలవారీగా మొత్తంగా 5,000 మంది పాల్గొంటారు. ప్రధానిగా లీ కెక్వియాంగ్ స్థానంలో లీ క్వియాంగ్‌ను ఎంపికచేసినట్లు వార్తలొచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment