
బీజింగ్: ఈ వారంలోనే షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎన్‌సీఓ) ప్రాంతీయ భద్రతా బ్లాక్ సదస్సు జరగనుంది. ఆ సదస్సుకు సంబంధించిన ప్రణాళికా విషయాలు గురించి వెళ్లడించడానికి చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ నిరాకరించింది. ఈ శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 15 నుంచి ఉజ్బెకిస్తాన్‌లో జరగనుంది. బీజింగ్ ప్రధాన కార్యాలయంలో ఈ సదస్సు చైనా, భారత్, పాకిస్తాన్ దేశాల తోపాటు మధ్య ఆసియా దేశాలు కజికిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్ వంటి దేశాలతో నిర్వహిస్తోంది.
అందులో భాగంగానే చైనా అద్యక్షుడు జిన్‌పింగ్ కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలలో పర్యటించనున్నారు. కరోనా మహమ్మారి తదనంతర ఇదే అతని తొలి విదేశీ పర్యటన. ఈ సదస్సు సందర్భంగా నాయకులు గత రెండు దశాబ్దాలుగా జరుగుతున్న సంస్థ కార్యకలాపాలను సమీక్షించడమే కాకుండా బహుపాక్షిక సహకారం గురించి చర్చించాలని భావిస్తున్నారు. ప్రాంతీయంగానే కాకుండా ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ సదస్సులో మోదీ ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.